Munugode By Poll: రేవంత్ రెడ్డి మునుగోడు ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. గట్టిగానే ప్లాన్ చేశారుగా..

ABN , First Publish Date - 2022-08-19T17:57:09+05:30 IST

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి (PCC Chief Revanth Reddy) కరోనా (Corona) నుంచి కోలుకున్నారు. మునుగోడులో..

Munugode By Poll: రేవంత్ రెడ్డి మునుగోడు ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. గట్టిగానే ప్లాన్ చేశారుగా..

హైదరాబాద్: పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి (PCC Chief Revanth Reddy) కరోనా (Corona) నుంచి కోలుకున్నారు. మునుగోడులో (Munugode) ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మునుగోడులో శనివారం రేవంత్‌రెడ్డి పాదయాత్ర (Revanth Padayatra) జరగనుంది. ఒకే రోజు ఐదు మండలాల్లో పాదయాత్రకు రేవంత్ ప్లాన్ చేశారు. అదే రోజున మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ నేతల పాదయాత్రలు కూడా జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి మండలాల వారీగా రేవంత్ పర్యటించనున్నారు. మునుగోడులో ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ సభ (KCR Munugode Meeting) ఉండగా, అదే రోజు రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా 175 మంది కాంగ్రెస్‌ దిగ్గజాలు నియోజకవర్గానికి రానున్నారు.



సీనియర్‌ నేతలు జానారెడ్డి (Jana Reddy), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), షబ్బీర్‌ అలీ వంటి నేతలు ఒక్కో గ్రామానికి ఒకరు చొప్పున చేరుకుని కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నారు. సీఎం సభ రోజు ఇబ్బందే అని తొలుత అనుకున్నా, ఢీ అంటే ఢీ అనే రీతిలో ఉండాలంటే అదే రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని, పార్టీ క్యాడర్‌ ఎంత మంది కలిసివస్తారో తెలిసిపోతుందని నాయకులు నిర్ణయించినట్లు తెలిసింది. పీసీసీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించగా, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ పాల్గొని 20న కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.



మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణికం ఠాకూర్‌ పిలుపునిచ్చారు. బుధవారం గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ పిలుపు మేరకు ఆజాదీకా గౌరవ్‌ యాత్రను విజయవంతం చేసినందుకు డీసీసీ అధ్యక్షులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు సర్వశక్తులు ఒడ్డాలని సూచించారు. ఈనెల 20న రాజీవ్‌గాంధీ జయంతిని సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో పార్టీల నేతలు కార్యక్రమాలు చేపట్టాలని కార్యచరణ రూపొందించామన్నారు. గ్రామంలో కనీసం 100 కుటుంబాలను కలిసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-08-19T17:57:09+05:30 IST