టీడీపీ నేతను పొగిడాడని... పోలీసులు కొట్టడంతో ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-05T08:56:08+05:30 IST

ఓ టీడీపీ నాయకుడిని పొగుడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టడమే ఆ యువకుడు చేసిన నేరమైంది.

టీడీపీ నేతను పొగిడాడని...  పోలీసులు కొట్టడంతో ఆత్మహత్య

అవమానభారంతో బలవన్మరణం 

వైసీపీ నేతలే కారణమన్న బంధువులు

శానిటైజర్‌ తాగి మేనత్త ఆత్మహత్యాయత్నం 


కంచికచర్ల, సెప్టెంబరు 4: ఓ టీడీపీ నాయకుడిని పొగుడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టడమే ఆ యువకుడు చేసిన నేరమైంది. పోలీసులు స్టేషన్‌కు పిలిచి కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను కృష్ణానదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావటంతో ఈ నెల 2న రాత్రి పోలీసులు దాడిచేశారు. గ్రామానికి చెందిన మున్నంగి రాజశేఖర్‌రెడ్డి(25) సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారిని.. టీడీపీ మండల స్థాయి నేత జామీను ఇచ్చి విడిపించారు. దీంతో.. ఆయన్ను పొగుడుతూ రాజశేఖర్‌రెడ్డి తన వాట్స్‌పలో స్టేటస్‌ పెట్టుకున్నాడు. ఇది స్థానిక వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. పోలీసులకు ఫోన్‌చేసి ఆ పోస్టు పెట్టినవారి గురించి ఆరా తీయాలని ఆదేశించారు. దీంతో ఆ ఏడుగురినీ తిరిగి స్టేషన్‌కు పిలిపించి  ప్రశ్నించారు. ఆ పోస్టు తానే పెట్టానని రాజశేఖర్‌రెడ్డి చెప్పడంతో లాఠీలతో చితకబాదారు. పోలీసులు విడిచిపెట్టిన తర్వాత ‘ఇక ఇదే నా చివరి మాట. పోలీసులు నన్ను బాగాకొట్టారు. ఊళ్లో నేను తలెత్తుకోలేను’ అంటూ రాజశేఖర్‌ రెడ్డి స్నేహితుల వద్ద విలపించాడు. 


నేరుగా విజయవాడ చేరుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటాక కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణానికి పరిటాలకు చెందిన ఓ వైసీపీ నాయకుడే ప్రధాన కారణమని, అతను ఒత్తిడి చేయడం వల్లే పోలీసులు రాజశేఖర్‌రెడ్డిని చావబాదారని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతదేహంతో పరిటాల వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చిన తర్వాత ఆందోళన విరమించారు. కాగా, మేనల్లుడి మరణవార్త తెలిసి రాజశేఖర్‌రెడ్డి మేనత్త సరస్వతి శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. 


తెల్లారితే ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. 

రాజశేఖర్‌రెడ్డికి హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్‌లో ఉద్యోగం వచ్చింది. ఈ నెల 5న ఉద్యోగంలో చేరాల్సి ఉంది. పేకాట కేసు లేకపోతే 4వ తేదీనే హైదరాబాద్‌ వెళ్లేవాడు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పనిచేశాడని గ్రామస్థులు చెబుతున్నారు. సౌమ్యుడైన రాజశేఖర్‌రెడ్డి పోలీసుల దెబ్బలు తట్టుకోలేక, అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

Updated Date - 2020-09-05T08:56:08+05:30 IST