అర్ధ శతాబ్దం కిందటే మునిసిపాలిటీ

ABN , First Publish Date - 2021-04-17T05:05:49+05:30 IST

నేటి జడ్చర్ల మునిసిపాలిటీ అర్ధ శతాబ్దం కిందటే బాదేపల్లి మునిసిపాలిటీగా ఉన్నది.

అర్ధ శతాబ్దం కిందటే మునిసిపాలిటీ
మునిసిపల్‌ కార్యాలయం

నాటి బాదేపల్లి పురపాలికకు ఇద్దరు చైర్మన్లు


జడ్చర్ల, ఏప్రిల్‌ 16: నేటి జడ్చర్ల మునిసిపాలిటీ అర్ధ శతాబ్దం కిందటే బాదేపల్లి మునిసిపాలిటీగా ఉన్నది. 1956లో నాటి మునిసిపాలిటీకి ఆరేళ్లు కొత్త కేశవులు, మరో ఆరేళ్లు గుబ్బ విశ్వనాథంగుప్త చైర్మన్‌లుగా పని చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో గ్రామ పంచాయతీగా, ఆ తర్వాత మేజర్‌ గ్రామ పంచాయతీగా కొనసాగింది. మునిసిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీగా మారిన బాదేపల్లికి 2011 వరకు పాలకవర్గంతో పరిపాలన సాగింది. 2011 డిసెంబరులో బాదేపల్లి, జడ్చర్ల, కావేరమ్మపేటలతో కలిపి బాదేపల్లి మునిసిపాలిటీని ఏర్పాటు చేశారు. మూడేళ్ల పాటు మునిసిపాలిటీ కొనసాగింది. తర్వాత మునిసిపాలిటీ నుంచి జడ్చర్ల మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న ప్రాంతాన్ని వేరు చేయాలంటూ జడ్చర్లకు చెందిన కొందరు కోర్టును ఆశ్రయించారు. దాంతో 2014లో జడ్చర్ల మేజర్‌ గ్రామ పంచాయతీ మునిసిపాలిటీ నుంచి విడిపోయింది. 2014 జూన్‌లో మేజర్‌ గ్రామ పంచాయతీగా మారింది. సంవత్సరం పాటు మేజర్‌ గ్రామ పంచాయతీగా సాగిన అనంతరం 2015 ఫిబ్రవరి 4న బాదేపల్లి నగర పంచాయతీగా ఏర్పడింది. నగర పంచాయతీగా మూడు సంవత్సరాల పాటు కొనసాగి, 2018లో బాదేపల్లి మునిసిపాలిటీగా ఏర్పడింది. బాదేపల్లి పట్టణ సమీపంలోని నాగసాల, బురెడ్డిపల్లి, నక్కలబండ తండాను కలుపుతూ మునిసిపాలిటీని ఏర్పాటు చేశారు. 


2019లో జడ్చర్ల మునిసిపాలిటీగా

2019 అక్టోబర్‌లో జడ్చర్ల మేజర్‌ గ్రామ పంచాయతీని బాదేపల్లి మునిసిపాలిటీలో విలీనం చేస్తూ, దానిని జడ్చర్ల మునిసిపాలిటీగా పేరు మార్చారు. 2011లో బాదేపల్లి మునిసిపాలిటీగా ఏర్పడి, తర్వాత గ్రామ పంచాయతీ, ఆ తర్వాత నగర పంచాయతీగా మారి మళ్లీ 2018లో మునిసిపాలిటీగా ఏర్పడింది. ప్రస్తుతం బాదేపల్లి, జడ్చర్ల, కావేరమ్మపేట, బురెడ్డిపల్లి, నాగసాల, నక్కలబండతండా, శంకరాయపల్లి తండాలను కలుపుతూ ఏర్పాటు చేసిన జడ్చర్ల మునిసిపాలిటీకి ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. బాదేపల్లి మునిసిపాలిటీకి అర్ధ శతాబ్దం తర్వాత మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రాబోతున్నారు. నాడు ఇద్దరు పురుషులు చైర్మన్లుగా కొనసాగగా, తాజాగా జడ్చర్ల మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు.


మొదటి రోజు నామినేషన్‌లు నిల్‌

జడ్చర్ల మునిసిపాలిటీకి ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మొదటి రోజు ఎవరూ నామినేషన్‌లు వేయలేదు. నామినేషన్‌ పత్రాలను తీసుకెళ్లేందుకు మునిసిపాలిటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు అధిక సంఖ్యలో వచ్చారు. నామినేషన్‌తో పాటు సమర్పించే పత్రాల వివరాలను తెలిపే ఫ్లెక్సీని మునిసిపాలిటీ కార్యాలయ ఆవరణలో నామినేషన్‌ గడువు ముగిసే సమయంలో ఏర్పాటు చేయడం గమనార్హం.


Updated Date - 2021-04-17T05:05:49+05:30 IST