మున్సిపాల్టీల్లో సమ్మె సైరన్‌

ABN , First Publish Date - 2022-01-25T05:25:01+05:30 IST

మున్సిపాలిటీలో సమ్మె సైరన్‌ మోగింది.

మున్సిపాల్టీల్లో సమ్మె సైరన్‌
కొవ్వూరు కమిషనర్‌ రవికుమార్‌కు సమ్మె నోటీసు ఇస్తున్న కాంట్రాక్ట్‌ వర్కర్స్‌

కొవ్వూరు, జనవరి 24: మున్సిపాలిటీలో సమ్మె సైరన్‌ మోగింది. కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ జేఏసీ పిలుపుమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కొవ్వూరు మున్సిపల్‌ కమిషనర్‌ టి.రవికుమార్‌, చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారికి సమ్మె నోటీసు ఇచ్చారు. సీఐటీయూ కార్యదర్శి ఎం.సుందరబాబు మాట్లాడుతూ కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనాలు అందించకుండా నామమాత్రంగా వేతనాలు పెంచి బాగా పెంచినట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. జగన్‌ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను మోసగించిందన్నారు. కాంట్రాక్ట్‌ వర్కర్లకు ఐఆర్‌, కరువుభత్యం, హెచ్‌ఆర్‌ఏ అమలుచేయాలి, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌చేసి, దీర్ఘకాల సమస్యలపై ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌జీవో అసోసియేషన్‌ పిలుపుమేరకు ఫిబ్రవరి 7 నుంచి నిరవదిక సమ్మెలో పాల్గొంటున్నట్లు నోటీసులో పేర్కొ న్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు మీసాల ప్రేమ్‌కుమార్‌, చెట్టేబత్తుల రాజేంద్ర, పి.వాసు, కారింకి దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. 

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 25న జిల్లా కేంద్రంలో జరిగే ర్యాలీ, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొవ్వూరు జోన్‌ కన్వీనర్‌ డి.ప్రకాశరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న కక్షపూరిత దోరణిని వ్యతిరేకిస్తూ అధికసంఖ్యలో ధర్నాలో పాల్గొనాలన్నారు.


పారిశుధ్య కార్మికుల  ఆందోళన


జంగారెడ్డిగూడెం: పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని సీఐటీయు మండల కార్యదర్శి షేక్‌ సుభాషిణి డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్యా లయం వద్ద పారిశుధ్య కార్మికులు సోమవారం జీవో నెం.7 ప్రతిని దహనం చేశారు. ఐఆర్‌ కంటే పీఆర్సీ ఫిట్మెంట్‌ ఎక్కువగా ఉండేటట్లు ప్రకటించాలన్నారు. మున్సిపల్‌ కార్మికులకు సిబ్బందికి ఐఆర్‌, డీఏ, కరువు భత్యం, ఇంటి అద్దె అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని, ఉద్యమ రూపం మరింత ఉధృతం చేస్తామన్నారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు రేలంగి నాగరాజు, కార్యదర్శి బర్రె బాలరాజు, వి.రాజు, ప్రసాద్‌, టి.పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:25:01+05:30 IST