ఉపసంహరణం!

ABN , First Publish Date - 2021-03-04T08:24:35+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. పాలక పక్షం వైసీపీ నేతల దౌర్జన్యాలు,

ఉపసంహరణం!

ఒత్తిళ్లు, బెదిరింపులతో భారీగా వైదొలగిన అభ్యర్థులు

ఫోర్జరీ సంతకాలతోనూ ఉపసంహరణలు

17,415 మందిలో 7,400 మంది విత్‌డ్రా

తొలి రోజు కంటే రెండు రెట్లు అధికం

577 వార్డులు, డివిజన్లలో ‘ఏకగ్రీవాలు’

ఇందులో ఐదు మినహా అన్నీ వైసీపీవే

16 నగరాలు/పట్టణాల్లో వంద చొప్పున ఉపసంహరణలు

విశాఖలో ఏకంగా 484 మంది చిత్తూరులో 295, విజయవాడలో 198

రాష్ట్రవ్యాప్తంగా బరిలో మిగిలింది పది వేలే!


పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపోల్స్‌లోనూ వైసీపీ అధికార బలం ప్రదర్శించింది. ఒత్తిళ్లు, బెదిరింపులతో ప్రతిపక్ష అభ్యర్థులను మంగళవారం బరి నుంచి తప్పించగా.. బుధవారం ఏకంగా ఫోర్జరీ సంతకాలతో మరికొందరిని పోటీలో లేకుండా చేసి.. ఏకగ్రీవాలు చేసుకుంది. నామినేషన్లు వేసిన 17,415 మంది అభ్యర్థుల్లో ఈ రెండ్రోజుల్లో 7,400 మంది వైదొలగడం గమనార్హం.


ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్‌ విత్‌ డ్రా చేశారంటూ భర్తతో కలసి ఆర్వో కార్యాలయంలో తిరుపతి 7వ డివిజన్‌ అభ్యర్థిని విజయలక్ష్మి నిరసన


అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. పాలక పక్షం వైసీపీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపులు బుధవారం కూడా కొనసాగాయి. చివరకు అభ్యర్థుల సంతకాలు కూడా ఫోర్జరీ చేశారు. అభ్యర్థులు రాకుండానే.. వారు విత్‌డ్రా చేసుకున్నట్లు పలు చోట్ల రిటర్నింగ్‌ అధికారులు వైసీపీ నేతల ఒత్తిళ్లతో ప్రకటించేశారు. అన్ని స్థాయుల అధికార పక్ష నేతలు ఎక్కడికక్కడ తమదైన శైలిలో ప్రతిపక్షాల అభ్యర్థులనే గాక.. స్వతంత్ర అభ్యర్థులతోనూ నామినేషన్లు విత్‌డ్రా చేయించారు. ఫలితంగా.. ఉపసంహరణ ప్రక్రియ ముగిసేసరికి.. నామినేషన్లు దాఖలు చేసిన మొత్తం 17,415 మందిలో 7,400పైచిలుకు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు! మంగళవారం తొలి రోజునే 2,502 మంది ఉపసంహరించుకోగా.. బుధవారం సుమారు 4,900 మంది తప్పుకొన్నారు. ఒక్క విశాఖ మహా నగర పాలక సంస్థలోనే ఏకంగా 484 మంది పోటీ నుంచి వైదొలగగా.. చిత్తూరు కార్పొరేషన్‌లో 295 మంది, విజయవాడ నగర పాలక సంస్థలో 198 మంది, హిందూపురం మున్సిపాలిటీలో 176 మంది, చీరాలలో 170 మంది.. విత్‌డ్రా చేసుకున్నారు.

 దీంతో 10వ తేదీన జరిగే ఎన్నికలకు సుమారు 10,000 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలినట్లయింది. ఎన్నికలతో నిమిత్తం లేకుండానే అధికార పార్టీ 11 నగరాలు/పట్టణాలు/నగర పంచాయతీలను కైవసం చేసుకునేందుకు తగినంత మంది అభ్యర్థులను ఇలా ‘ఏకగ్రీవాల’ ద్వారా ‘గెలిపించుకుంది’! పులివెందుల, రాయచోటి, ఎర్రగుంట్ల మంగళవారమే వైసీపీ పరంకాగా.. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, మదనపల్లె పట్టణాలు.. కడప, తిరుపతి కార్పొరేషన్లను బుధవారం తన ఖాతాలో వేసేసుకుంది!


ఉపసంహరణల తీరిదీ..

13 జిల్లాల్లో మంగళవారంతో పోల్చితే తుది రోజైన బుధవారం భారీ సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణలు జరిగాయి. అనంతపురం జిల్లాలో 742, గుంటూరు జిల్లాలో 680, ప్రకాశం జిల్లాలో 631, చిత్తూరు జిల్లాలో 523 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కార్పొరేషన్ల వారీగా చూస్తే విశాఖలో 2 రోజుల్లో కలిపి 484 మంది అభ్యర్థులు వైదొలిగారు. చిత్తూరు (295), విజయవాడ (198), ఏలూరు (107), మచిలీపట్నం (101).. మున్సిపాలిటీల్లో హిందూపురం (176), చీరాల (170), అనంతపురం (155), ఒంగోలు (148), నాయుడుపేట (147), తాడిపత్రి (146), మార్కాపురం (145), నంద్యాల (139), పుత్తూరు (135), సూళ్లూరుపేట (120), కనిగిరి (110) ఉన్నాయి. ఉపసంహరణల తర్వాత.. చిత్తూరు కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 37 వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. పుంగనూరు (31కిగాను అన్నీ), నాయుడుపేట (25లో 21), పలమనేరు (26కిగాను 18), సూళ్లూరుపేట (25లో 14) మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఇక్కడ మేయర్‌/చైర్‌పర్సన్లుగా ఆ పార్టీకి చెందిన వారే ఎన్నికవనున్నారు.


ఇవి కాకుండా.. 50 డివిజన్ల చొప్పున ఉన్న కడప నగర పాలక సంస్థలో 24 మంది, తిరుపతి కార్పొరేషన్‌లో 21.. 35 వార్డులున్న మదనపల్లెలో 15 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే రంగంలో మిగలడంతో అవి కూడా ఆ పార్టీ ఖాతాలోనే జమ కానున్నాయి. బుధవారం రాత్రి వరకూ అందిన సమాచారం ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 577 డివిజన్లు, వార్డుల్లో ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే పోటీలో మిగలడంతో అవన్నీ ఏకగ్రీవమైనట్లయింది. వీటిలో 572 వైసీపీకి, టీడీపీకి ఐదు దక్కాయి. టీడీపీకి ఒక్క కొవ్వూరు (పశ్చిమ గోదావరి జిల్లా)లోనే 4 వార్డులు వచ్చాయి.


ఏకగ్రీవాల్లో చిత్తూరు  టాప్‌..

జిల్లాల వారీగా చూస్తే.. 130 ఏకగ్రీవాలతో చిత్తూరు అన్నింటికంటే ముందంజలో ఉంది. 121తో కడప రెండో స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో గుంటూరు జిల్లా (85), కర్నూలు (77), నెల్లూరు (44), తూర్పుగోదావరి (35), ప్రకాశం (24), అనంతపురం (21), పశ్చిమగోదావరి (19), విజయనగరం, కృష్ణా జిల్లాలు (7 చొప్పున), శ్రీకాకుళం (4), విశాఖపట్నం (3) నిలిచాయి. కాగా.. ప్రకాశం జిల్లాలోని అద్దంకిలోని ఒక వార్డులో నామినేషన్లు వేసిన అభ్యర్థులందరూ వాటిని ఉపసంహరించుకోవడంతో అక్కడి ఎన్నికను అనివార్యంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Updated Date - 2021-03-04T08:24:35+05:30 IST