వసూళ్లలో.. వెనుకంజ

ABN , First Publish Date - 2022-09-27T05:30:00+05:30 IST

ప్రగతి పనుల నిర్వాహణకు ప్రధాన వనరైన పన్ను వసూళ్లలో మున్సిపాల్టీలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. చాలా మున్సిపాల్టీల్లో లక్ష్యాల మేర పన్ను వసూలు జరగడం లేదు.

వసూళ్లలో.. వెనుకంజ
వినుకొండ పురపాలక సంఘం

మున్సిపల్‌ అధికారుల అలసత్వం

పన్నుల వసూళ్లపై కొరవడిన పర్యవేక్షణ 

రూ.252.28 కోట్లకు రూ.133.54 కోట్లే వసూలు 

లక్ష్యాలను చేరుకోవడంలో చతికిలపడిన మున్సిపాల్టీలు 

47.10 శాతం పన్ను వసూలుకు మూడు రోజులే గడువు

99.90 శాతం వసూలుతో రాష్ట్రంలో వినుకొండ ప్రథమస్థానం 

 


మున్సిపాల్టీలకు ప్రధాన ఆదాయ వనరు పన్నులే. అయితే ఈ పన్నుల వసూళ్లలో అధికారుల అలసత్వం వహిస్తున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో చాలా మున్సిపాల్టీలు పన్నుల వసూళ్లలో వెనుకంజలోనే ఉన్నాయి. మూడు జిల్లాల్లో 16 మున్సిపాల్టీలు ఉంటే ఏ ఒక్క మున్సిపాల్టీ కూడా లక్ష్యాల సాధించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 70 శాతానికి పైగా ఆస్తి పన్నులు వసూలు చేసిన మున్సిపాల్టీలు ఎనిమిది మాత్రమే ఉన్నాయి. సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట మున్సిపాల్టీలతో పాటు గుంటూరు కార్పొరేషన్‌ అయితే సగం కూడా పన్నుల వసూలు చేయలేక వెనుకబడిపోయాయి. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు 47.10 శాతం పన్ను వసూలుకు ఇక మూడు రోజులే గడువు ఉంది. అయినా అధికారుల్లో చలనం లేదు. ఒక్క వినుకొండ మున్సిపాల్టీ మాత్రం 99.90 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తంమీద ఆస్తి, నీటి పన్ను వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. పన్ను వసూళ్లపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడంతో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.



నరసరావుపేట, సెప్టెంబరు 27: ప్రగతి పనుల నిర్వాహణకు ప్రధాన వనరైన పన్ను వసూళ్లలో మున్సిపాల్టీలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. చాలా మున్సిపాల్టీల్లో లక్ష్యాల మేర పన్ను వసూలు జరగడం లేదు. నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని మున్సిపాల్టీలు చతికిల పడ్డాయి. ఈ నెలాఖరు కల్లా నూరు శాతం పన్ను వసూలు చేయాలని మున్సిపాల్టీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇచ్చిన లక్ష్యాలను వినుకొండ, పొన్నూరు మినహా గుంటూరు కార్పొరేషన్‌తో పాటు ఏ ఒక్క పురపాలక సంఘం చేరుకోలేదు. ఉన్నతాధికారులు పన్ను వసూళ్లపై సమీక్షిస్తున్నా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని అన్ని మున్సిపాల్టీలలో ఆస్తి, నీటి పన్ను రూ.252.28 కోట్లు పన్ను వసూలు చేయాల్సి ఉంది.  ఇప్పటి వరకు రూ.133.54 కోట్లు మాత్రమే పన్ను వసూలైనట్లు డీఎంఏ కార్యాలయ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పన్ను వసూలు శాతం 52.90గా ఉంది. ఆస్తి పన్ను రూ.216.17 కోట్లు వసూలు చేయాలి. అయితే ఇది కేవలం 56.12 శాతం అంటే రూ.121.32 కోట్లు వసూలైంది. 99.90 శాతం పన్ను వసూలు సాధించి రాష్ట్రంలోనే వినుకొండ పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలిచింది. మొదటి పది స్థానాల్లో అద్దంకి, పొన్నూరు మున్సిపాల్టీలు ఉన్నాయి. ఇక నీటి పన్ను రూ.36.11 కోట్లు వసూలు లక్ష్యం కాగా ఇప్పటికి రూ.12.22 కోట్లు మాత్రమే వసూలైంది. నీటి పన్ను వసూలు 33.85 శాతంగా నమోదైంది. నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట మున్సిపాల్టీలు పన్ను వసూళ్లలో వెనుకబడి ఉన్నాయి. ఈ మున్సిపాల్టీలలో ఆస్తి పన్ను 44 శాతం లోపే ఉంది. గుంటూరు కార్పొరేషన్‌లో అయితే 49 శాతం మాత్రమే పన్ను వసూలు చేశారు. 


జీతాల చెల్లింపుల్లో జాప్యం

నిధుల లేమితో మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల నిర్వాహణ, కాంట్రాక్ట్‌ కార్మికుల, ఉద్యోగుల జీతాల చెల్లింపులు జాప్యం జరుగుతున్నది. సకాలంలో పన్ను వసూలు కాక పోవడం వల్లనే కొన్ని పురపాలక సంఘాల్లో ఈ పరిస్థితి నెలకొంది. సాధారణ నిధుల నుంచి చేపట్టే పనుల బిల్లులు చెల్లింపుల్లో కూడా జాప్యం జరుగుతుంది. దీంతో ఆయా పనులు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఖాళీ స్థలాల, ప్రకటనల పన్ను వసూళ్లలో కూడా జాప్యం జరుగుతున్నది. పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రకటనల బోర్డులకు, పన్ను వసూళ్లకు పొంతన లేదు. తాత్కాలిక ఆక్రమణలు, ప్రకటనలకు సంబంధించిన పన్నులు పక్కదారి పడుతున్నాయన్న విమర్శలున్నాయి. ప్రణాళికా విభాగం పర్యవేక్షణ లేక పోవడం వల్లే ఆదాయాన్ని మున్సిపాల్టీలు రాబట్టుకోలేకపోతున్నాయి. పన్ను వసూలు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా వారి మొర అధికారులు ఆలకించే పరిస్థితి లేదు.  


పేరుకుపోతోన్న మొండి బకాయిలు

మున్సిపాల్టీల్లో మొండిబకాయిలు పేరుకుపోతున్నాయి. ఏటేటా పన్నుల చెల్లింపులు జరగకపోవడం, వసూళ్లు కాకపోతుండటంతో మొండిబకాయిల జాబితా చాంతాడంత అవుతుంది.  గుంటూరు కార్పొరేషన్‌ సహా అన్ని పురపాలక సంఘాల్లో 300 వరకు డిఫాల్టర్లను గుర్తించారు. పల్నాడు జిల్లాలో రూ.13.75 కోట్లు, బాపట్ల జిల్లాలో రూ.5.28 కోట్లు, గుంటూరు కార్పొరేషన్‌లో రూ.55.68 కోట్లు ఢిపాల్టర్ల నుంచి పన్ను వసూలు చేయాల్సి ఉంది. మొండి బకాయిల వసూళ్లపై అధికారులు ప్రకటనలు హడావుడికే పరిమితమవుతున్నాయి. దీంతో బకాయిదారుల్లో ఏమాత్రం చలనం ఉండటంలేదు.ఇక కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలకు సంబంధించిన బకాయిలు మూడు జిల్లాల్లో కోట్ల రూపాయలు పేరుకుపోయాయి.  మొండి బకాయిలలో 70 శాతం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  

 

Updated Date - 2022-09-27T05:30:00+05:30 IST