Abn logo
Jun 19 2021 @ 23:21PM

పట్టణంలో పన్ను పోటు

ఆస్తి విలువను బట్టి మునిసిపల్‌ పన్ను విధింపు

ఇళ్లలో చెత్త సేకరించినందుకు సొమ్ము చెల్లించాల్సిందే


పట్టణవాసులకు పన్ను పోటు తీవ్రం కానుంది.  ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించాలనే ప్రభుత్వ నిర్ణయంతో భవనం, స్థలాలకు పన్ను రేటు భారీ పెరగనుంది. దీనికి చెత్త పన్ను అదనం. కరోన రాకాసి ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చేసింది. పనిలేదు.. వ్యాపారాలు డీలా పడ్డాయి.. అందిన కాడికి అప్పులు.. ఈ తరుణంలో ప్రభుత్వ పన్నులతో బతుకు భారమవుతుందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అద్దె జీవితాలు మరింత దుర్భరం కానున్నాయి. పన్నుల పెంపు నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

– జంగారెడ్డిగూడెం, కొవ్వూరు


నూతన పన్ను విధానంలో పట్టణంలో ఒకో ప్రాంతానికి ఒకో పన్ను రేటు ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా పన్ను విధిస్తారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొత్తం 13,527 నివాసాలకు రూ.7,48,81,239 పన్ను డిమాండ్‌  ఉంది. నివాస భవనాలకు 0.15 శాతం, వాణిజ్య భవనాలకు  0.30 శాతం ఆస్తి పన్ను పడుతుంది. పట్టణంలో 2868 ఖాళీ స్థలాలకు పన్ను డిమాండ్‌ రూ.1,44,62,060 కాగా 0.20శాతం పన్ను పడనుంది. పట్టణ ప్రజలు గతం కంటే రెట్టింపు స్థాయిలో పన్ను కట్టాల్సి వస్తుంది.


ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరణ పన్ను కూడా పెరగనుంది. ఒక్కొక్క నివాసం నుంచి వారానికి రూ.20 చొప్పున ప్రతీ నెల రూ.80 ఇవ్వాలి. ఈ లెక్కన నెలకు రూ.12.82 లక్షలు వసూలు కానుంది. పట్టణంలో నివాసితులు (అద్దెకు ఉండేవారితో కలిపి) 16,025 మంది పన్ను కట్టాల్సి ఉంది. నాన్‌ రెసి డెన్షియల్‌ 1712 (వ్యాపారులు, సంస్థలు) నుంచి నెలకు రూ.200 చొప్పున  దాదాపు నెలకు రూ.5.60లక్షలు వసూలు అవుతాయని అంచనా. ప్రతీ వెయ్యి ఇళ్లకు రెండు ఆటోలతో చెత్త సేకరణ చేసే విధంగా పన్నులు వసూలు చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.కొవ్వూరు పట్టణంలో..


కొవ్వూరు పురపాలక సంఘంలో ప్రజలకు నూతన ఆస్తి పన్ను విదానం బారంగా మారనుంది.భూమి,భవనం యొక్క మూలధనం విలువ ఆదారంగా ఆస్తి పన్ను పెంపుదల చేయాలని ప్రభుత్వం 196,197,198 జివోలను విడుదల చేసింది.నివాస భవనాలకు 0.15 శాతం,కమర్షియల్‌ భవనాలకు 0.30 శాతం పన్ను విదించేందుకు అదికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కొవ్వూరు పట్టణాన్ని ఇప్పటివరకు 4 జోన్లుగా విభజించి పన్నులు విదించేవారు. ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించడం ద్వారా  ఏడాదికి 1400 పన్ను చెల్లించేవారు ఇకపై రూ.2500 నుంచి రూ.3వేలు  చెల్లించాల్సి వస్తుందని అంచనా. కొవ్వూరు పట్టణంలో ఆస్తి పన్ను చెలించేవారు 12,500 మంది ఉన్నారు. ఏటా మున్సిపాల్టీకి ఆస్తి పన్ను ద్వారా రూ.2.27 కోట్ల ఆదాయం వస్తోంది. నూతనం విధానం అమలు చేస్తే  మొదటి ఏడాది పురపాలక సంఘానికి కనీసం రూ.కోటి పైగా ఆదాయం సమకూరనుందని అంచనా. ఏటా ప్రభుత్వం భూముల విలువ పెంచితే దానికనుగుణంగా ఆస్తి పన్ను కూడా పెరుగుతుంది.


పన్నుల ప్రభుత్వంగా మారింది

రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ప్రభుత్వంగా మారింది. ఇంటితో పాటు స్థలం కూడా పరి గణనలోకి తీసుకుని పన్ను విధిస్తారు. ప్రభు త్వం ఉచితంగా ప్రజలకు రూ.10 ఇచ్చినట్టు ఇచ్చి తిరిగి వారి నుంచి రూ.100 లాక్కునేం దుకు చూస్తోంది. ఆస్తి పన్ను పెంచడంతో పాటు చెత్తసేకరణ పన్ను విధించడం ప్రలపై పన్ను భారం మోపడమే. 

నంబూరి రామచంద్రరాజు, కౌన్సిలర్‌, జంగారెడ్డిగూడెం


తక్షణం ఉపసంహరించాలి

ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను భారం తక్షణం ఉపసంహరించాలి. ఇబ్బందులు ఎదు ర్కొంటున్న పట్టణ ప్రజలపై పన్ను రాయితీ ఇవ్వాల్సిందిపోయి భారం మోపుతారా. కేంద్ర ప్రభుత్వ షరతులకు తలవంచి రాష్ట్రంలో  పన్నుభారాన్ని పెంచే జీవోలను రద్దుచేయాలి.

ఎం.సుందరబాబు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు, కొవ్వూరు


పన్నుల భారం దారుణం

కరోన సమయంలో పన్నుల భారం దారుణం. పనులు లేక, వ్యాపారాలు లేక ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆస్తి, చెత్త సేకరణకు పన్నుల విధించడం వలన వారిపై మరింత భారం పడుతుంది. ప్రస్తుత పన్నుల విధానాన్ని జనసేన పార్టీ వ్యతిరేకిస్తుంది.

వలవల తాతాజీ, కౌన్సిలర్‌, జంగారెడ్డిగూడెం


ప్రజలను దోపిడీ చేస్తోంది

ప్రభుత్వం పథకాల పేరు చెప్పి ఆశలు రేపుతూ పన్నుల రూపంలో ప్రజలను దోపిడీ చేస్తోంది. కరోనా సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందుల్లో గురవుతున్న ప్రజలపై ఆస్తి విలువ ఆధారంగా పన్నుల భారం మోపడం సరైంది కాదు. పన్నులు పెంచడానికి ఇది సమయం కాదు.

సూరపనేని రామ్మోహన్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌, కొవ్వూరు


మూలధనం ఆధారంగా పన్ను

ప్రభుత్వ నూతన ఆస్తి పన్ను విధానంలో మూలధనం విలువ ఆధారంగా పన్ను నిర్ధారించడం జరుగుతుంది. కొవ్వూరు పట్టణంలో నివాసగృహాలకు 0.15 శాతం, వాణిజ్య భవనాలకు 0.30 శాతం పెంపుదల చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.

ఎస్‌.సర్వేశ్వరరావు, మునిసిపల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, కొవ్వూరు