ప్రభుత్వ పరిధిలోకి 147మున్సిపల్‌ స్కూళ్లు

ABN , First Publish Date - 2022-06-25T06:52:15+05:30 IST

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మున్సిపల్‌ పరిధిలోని స్కూళ్లను ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలోకి విలీనం చేస్తూ శుక్రవారం జీవో జారీ అయింది.

ప్రభుత్వ పరిధిలోకి 147మున్సిపల్‌ స్కూళ్లు

తిరుపతి(విద్య)/చిత్తూరు(సెంట్రల్‌), జూన్‌ 24: ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మున్సిపల్‌ పరిధిలోని స్కూళ్లను ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలోకి విలీనం చేస్తూ శుక్రవారం జీవో జారీ అయింది. ఇక నుంచి మున్సిపల్‌ స్కూళ్ల పరిపాలన, పర్యవేక్షణ  ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలో ఉంటుంది.వారానికి ఒకట్రెండు సార్లు సచివాలయ సిబ్బంది స్కూళ్లను పర్యవేక్షించాలి. మధ్యాహ్న భోజనం, యూనిఫాం, నోట్‌బుక్స్‌, ఉపకార వేతనాల పంపిణీ తదితర పథకాల అమలును పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో చిత్తూరు, తిరుపతి, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, నగరి మున్సిపాలిటీలున్నాయి.వీటిలో పుత్తూరు, నగరిలో మున్సిపల్‌ స్కూళ్లు లేవని సమాచారం. ఈ రెండు పంచాయతీ నుంచి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ అయినా స్కూళ్లు మెర్జ్‌ కాలేదని సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 147స్కూళ్లు (106 ప్రైమరీ, 14యూపీ, 27ఉన్నత).. 26502 మంది విద్యార్థులు (పైమ్రరీలో 10729మంది, యూపీలో 4244, ఉన్నత పాఠశాలలో 11529).. 922 మంది టీచర్లు (ప్రైమరీలో 360మంది, యూపీలో 161, ఉన్నత పాఠశాలలో 401) ఉపాధ్యాయులు విద్యాశాఖ పరిధిలోకి రానున్నారు. ఈ విలీన ప్రక్రియను ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల పరిధిలో తీసుకోగా రానున్న రోజుల్లో విభజిత కొత్త జిల్లాలో అమలు చేస్తారు. పరిపాలన, పర్యవేక్షణ ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలోకి వచ్చినా.. శాలరీ డ్రాయింగ్‌పై క్లారిటీ లేదని విద్యాశాఖ వర్గాలు అంటున్నారు. ఈ జీవో వల్ల టీచర్ల బదిలీలు, పదోన్నతులు లాంటివి ప్రభుత్వ టీచర్ల తరహాలో విద్యాశాఖ పరిధిలో ఉంటాయి.తిరుపతి జిల్లా విషయానికి వస్తే తిరుపతిలో 44 మున్సిపల్‌ స్కూళ్లు, గూడూరులో 18, శ్రీకాళహస్తిలో 30 మున్సిపల్‌ స్కూళ్లు  ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలో చేరనున్నట్లు సమాచారం.

Updated Date - 2022-06-25T06:52:15+05:30 IST