Abn logo
Mar 2 2021 @ 00:10AM

అలా ఎన్నికల‘పుర’ంలో!

మున్సిపాలిటీల్లో మొదలైన రాజకీయ సెగ

నేడు, రేపు నామినేషన్లకు ఉపసంహరణ గడువు

అధికార పార్టీకి రెబల్స్‌ బెడద

ఆత్మకూరులో సర్వే ఆధారంగానే టికెట్ల ఖరారు

‘పేట’లో ఆశలన్నీ ఏకగ్రీవాలపైనే!

‘గిరి’లో ఇరుపార్టీలకూ ప్రతిష్ఠాత్మకమే!


ఆత్మకూరు, మార్చి 1  : పుర సమరానికి గడువు సమీపిస్తోంది. పట్టణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికల హడావుడి వేగవంతమైంది. జిల్లాలో ఎన్నికల జరగనున్న నాలుగు మున్సిపాలిటీల్లో పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా మారింది. ముఖ్యంగా ఆత్మకూరులోని వైసీపీలో రెబల్స్‌ బెడద కొలిక్కి రాలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదివారం ఒక వర్గానికి చెందిన నేతలను పిలిచి నచ్చచెప్పాలని  చేసిన ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. కొన్ని వార్డుల్లో తమ వర్గీయులను బరిలో నుంచి తప్పించేందుకు అంగీకరించడంలేదు. ‘‘నమ్మబలికి నామినేషన్లు వేయించాం.. ఇప్పుడు ఉపసంహరించుకోవాలంటే కుదరదు.’ అని ఖరాకండీగా చెప్పేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమీపించింది. మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఈ క్రమంలో రెబల్స్‌ రాజీపడే అవకాశాలు సన్నగిల్లాయి. 


సర్వే ఆధారంగా ఆత్మకూరులో టికెట్లు

ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు 42 మంది నామినేషన్లు దాఖలు చేసి ఉన్నారు. వీరిలో పార్టీ గుర్తించిన అభ్యర్థులతోపాటు కొందరు రెబల్‌ అభ్యర్థులూ ఉన్నారు. డమ్మీ అభ్యర్థులు మాత్రం పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇటీవల  వైసీపీ నేతలు మున్సిపాలిటీలో గెలుపు గుర్రాలపై సర్వే చేయించారు. ఈ క్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ సర్వే ఆధారంగా అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేస్తారని  ఆ పార్టీ నేతలకు తెలిపారు. దీంతో కొన్ని వార్డుల్లో డమ్మీ  అభ్యర్థులకే టికెట్‌ దక్కే అవకాశాలు ఉన్నాయి.  7వ వార్డు అభ్యర్థి విషయంలో రాజీ కుదిరినా 18వ వార్డు అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరణకు ఒక వర్గం నేతలు అంగీకరించలేదు. మున్సిపాలిటీలోని 15 వార్డు ఎస్టీ మహిళ, 18 వార్డు ఎస్టీ జనరల్‌కు కేటాయించబడ్డాయి. ఆ వార్డుల్లో గెలిచిన వారే చైౖర్మన్‌ పీఠం అధిరోహంచేందుకు అర్హులవుతుతారు. అందుకు అనుగుణంగా తమ వర్గీయులను వైసీపీలో ఇరువర్గాల నేతలు 15, 18 వార్డుల్లో పోటీలో నిలిపారు. 18 వార్డులో రెబల్‌ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరణకు ఒక వర్గం నేతలు ససేమిరా అంటున్నారు. తమకు గెలిచే సత్తా ఉందని బి-ఫారం ఇప్పించాలని మంత్రిని కోరారు. అయితే అందుకు మంత్రి అంగీకరించలేదని సమాచారం. అందుకే ఆ వర్గం నేతలు ఇక మంత్రి దగ్గర నో సిట్టింగ్‌.. నో చర్చింగ్‌.. రెడీ టూ ఫైట్‌ అంటున్నారు. చివరికి ఏ విధంగా ముందుకు సాగుతారో చూడాలి.  


అంతా ఒక్కటే చర్చ!

నాయుడుపేట : పట్టణంలో ఏ కూడలిలో చూసినా... ఏ ఇద్దరు ఎదురుపడినా... అంతటా ఒక్కటే చర్చ... నాయుడుపేట మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతాయా... లేదా ఏకగ్రీవాలు అవుతాయనే. ఇందుకు కారణం ప్రధాన పార్టీల నేతలందరూ లోపయికార ఒప్పందం చేసుకుంటున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో 160 మంది  అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వాటిలో ఆరింటిని ఎన్నికల సిబ్బంది తిరస్కరించారు. దాంతో 154 కౌన్సిలర్‌ నామినేషన్‌ ఖరారయ్యాయి. టీడీపీ, వైసీపీలు అన్ని వార్డుల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ మాత్రం 8, 9, 11, 14, 16 వార్డుల్లో, 10వ వార్డులో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలకు రెబల్స్‌ బెడద ఉంది. దీంతో వారిని బుజ్జగించే పనిలో నేతలు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటివరకు పార్టీ అభ్యర్థులు వీరేనంటే ఎవరినీ ప్రకటించలేదు. దీంతో బరిలో నిలిచిన వారంతా ప్రచారంలో ఉన్నారు. ఇక సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 25 వార్డులు ఉండగా,  121 మంది నామినేషన్లు సమర్పించారు.


ఇరుపార్టీలకు ప్రతిష్ఠాత్మకమే

వెంకటగిరి : మున్సిపల్‌ ఎన్నికలు అటు అధికార పార్టీకి, టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఎన్నికలు లేకుండా వార్డులన్నింటినీ ఏకగ్రీవం చేసుకునే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ అభ్యర్థులలో 1, 2 వార్డులు మినహా మిగిలిన వారందరినీ ప్రత్యేక శిబిరాలకు  తరలించారు.ఇక వైసీపీలో వర్గపోరు నడుస్తుండటంతో రెబల్స్‌ను బుజ్జగించే పనిలో నేతలు ఉన్నారు. ఎమ్మెల్యే  ఆనం రామనారాయణ రెడ్డి అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినా ఇంకా బహిర్గతం చేయలేదు. ఈ పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని టీడీపీ భావిస్తోంది. కాగా, పట్టణంలో 25 వార్డులకు 144 నామినేషన్లు దాఖలై ఉన్నాయి. 20వ వార్డులో మాత్రం వైసీపీ అభ్యర్థి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేసి ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement