ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-03-04T06:57:35+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ పర్వం ఎట్టకేలకు ముగిసింది. అభ్యర్థిత్వాల విత్‌డ్రాకు బుధవారం ఆఖరు కావడంతో ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల పరిధిలో అభ్యర్థులు భారీగా క్యూ కట్టారు.

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

 చివరి రోజు 325 మంది అభ్యర్థిత్వాల ఉపసంహరణ 

  అత్యధికంగా రామచంద్రపురం 63, పిఠాపురం మున్సిపాల్టీలో 52 మంది విత్‌డ్రా

  ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల్లో మొత్తం 655 మంది అభ్యర్థులు బరిలో

 (కాకినాడ-ఆంధ్రజ్యోతి) మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ పర్వం ఎట్టకేలకు                ముగిసింది. అభ్యర్థిత్వాల విత్‌డ్రాకు బుధవారం ఆఖరు కావడంతో ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల పరిధిలో అభ్యర్థులు భారీగా క్యూ కట్టారు. పలు మున్సిపాల్టీల్లో అధికార వైసీపీ ఒత్తిళ్లతో ఆఖరి క్షణంలో టీడీపీ నుంచి పలువురు కౌన్సిలర్‌ అభ్యర్థులు  నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వెరసి బుధవారం మొత్తం 325 నామినేషన్లు విత్‌డ్రా అయ్యాయి. మంగళవారం 292 విత్‌డ్రా కాగా, రెండు రోజుల్లో మొత్తం 617 నామినేషన్లను వివిధ పార్టీల అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 655గా తేలింది. పిఠాపురంలో అత్యధికంగా 86, ముమ్మిడివరంలో అత్యల్పంగా 47 మంది పోటీలో నిలిచారు. మరోపక్క ఏకగ్రీవ వార్డులు బుధవారం మరో 13 పెరిగి మొత్తం 35కి చేరాయి. రామచంద్రపురం మున్సిపాల్టీ పరిధిలో అత్యధికంగా తొమ్మిది వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విత్‌డ్రా కావడంతో అవన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి.ఏకగ్రీవాల వేటలో అధికార పార్టీ ఆడిన నామినేషన్ల ఉపసంహరణ క్రీడకు ఎట్టకేలకు తెరపడింది. విత్‌డ్రాలకు బుధవారం చివరి రోజు కావడంతో అన్ని మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో సాధ్యమైనన్ని ఏకగ్రీవాలు చేయించుకునేందుకు ఆ పార్టీ నేతలు బరితెగించారు. బేరాలు కుదుర్చుకున్న తర్వాత ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు చేజారిపోతారేమోననే భయంతో తమ కనుసన్నల్లోనే ఉంచుకున్నారు. దగ్గరుండి పలుచోట్ల నామినేషన్లు ఉపసంహరించేలా చేయించారు. అయితే అత్య ధిక మున్సిపాల్టీల్లో సగానికిపైగా వార్డుల్లో పోటీ లేకుండా చేయించాలనే ప్రయత్నాలు మాత్రం బెడిసికొట్టాయి. ఈనేపథ్యంలో చివరిరోజైన బుధవారం వివిధ పార్టీలకు చెందిన మొత్తం 325 మంది అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్నారు. ఇందులో తుని మున్సిపాల్టీ పరిధిలో ఆరుగురు, పిఠాపురం 48, మండపేట 35, అమలాపురం 23, రామచంద్రపురం 63, పెద్దాపురం 10, సామర్లకోట 52, ముమ్మిడివరం 22, గొల్లప్రోలు 34, ఏలేశ్వరం 32 మంది చొప్పున విత్‌డ్రా అయ్యారు. కాగా తొలిరోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా 292 నామినేషన్లు విత్‌డ్రా కాగా, బుధవారం 325 మందితో కలిపి రెండ్రోజుల్లో మొత్తం 617 మంది విత్‌డ్రాలు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా సామర్లకోటలో 96, రామచంద్రపురం మున్సిపాల్టీ పరిధిలో 90 మంది విత్‌డ్రా అయ్యారు. 


బరిలో మిగిలింది వీరే...


విత్‌డ్రాల పర్వం ముగియడంతో ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల్లో మొత్తం బరిలో ఉన్న అభ్యర్థులు 655 మందిగా తేలారు. ఈ నేపథ్యంలో వీరి మధ్యే పోటీ నెలకొంది. కాగా పిఠాపురం మున్సిపాల్టీ పరిధిలో అత్యధికంగా 86 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైసీపీ నుంచి 29, టీడీపీ 28, వైసీపీ రెబల్‌ 7, టీడీపీ రెబల్‌ 1, జనసేన 3, బీజేపీ 3, సీపీఐ,సీపీఎం తరఫున చెరొకరు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 13 మంది చొప్పున ఉన్నారు. తునిలో టీడీపీ,వైసీపీ నుంచి చెరో 15, బీజేపీ 6, జనసేన 1, కాంగ్రెస్‌ 3, ఇండిపెండెంట్‌ 12 చొప్పున పోటీలో ఉన్నారు. పెద్దాపురంలో వైసీపీ నుంచి 29, టీడీపీ 27, జనసేన 11, సీపీఎం 4, బీజేపీ 2, కాంగ్రెస్‌ 2, ఇండిపెండెంట్లు ఏడుగురు చొప్పున ఉన్నారు. సామర్లకోటలో వైసీపీ నుంచి 31, టీడీపీ 20, జనసేన 13, సీపీఎం 1, సీపీఐ1, బీజేపీ 3, కాంగ్రెస్‌ 1, ఇండిపెండెంట్‌లు 5 చొప్పున బరిలో ఉన్నారు. అమలాపురంలో వైసీపీ 23, టీడీపీ 16, జనసేన 16, బీజేపీ 7, సీపీఐ1, ఇండిపెండెంట్‌లు 9 మంది పోటీలో ఉన్నారు. మండపేటలో టీడీపీ, వైసీపీ నుంచి చెరో 30 మంది, జనసేన 10, బీజేపీ 2, స్వతంత్రులు నలుగురు చొప్పున పోటీలో నిలిచారు. రామచంద్రపురంలో వైసీపీ నుంచి 18, టీడీపీ 9, జనసేన 13, బీజేపీ 4, కాంగ్రెస్‌ 1, ఇండిపెండెంట్‌లు 10 మంది చొప్పున బరిలో తేలారు. ఏలేశ్వరంలో టీడీపీ,వైసీపీ నుంచి చెరో 20 మంది, బీజేపీ 4, సీపీఐ 4, ఇండిపెండెంట్‌లు 8 మంది బరిలో నిలిచారు. గొల్లప్రోలు 53 మంది బరిలో ఉండగా టీడీపీ, వైసీపీ తరఫున చెరో 20 మంది, జనసేన 6, బీజేపీ 3, ఇండిపెండెంట్‌లు నలుగురు (వైసీపీ రెబల్స్‌) ఉన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీలో వైసీపీ నుంచి 19, టీడీపీ 17, జనసేన 2, బీఎస్పీ, బీజేపీ, సీపీఐ నుంచి చెరొకరు, ఇండిపెండెంట్‌లు 5గురు బరిలో నిలిచారు.


అలా ఏకగ్రీవాలు చేయించారు..


నామినేషన్ల ఘట్టం ముగియడంతో మొత్తం ఏకగ్రీవాల సంఖ్య 35గా తేలింది. తొలిరోజు 22 ఏకగ్రీవాలు లెక్క తేలగా, బుధవారం విత్‌డ్రాల ప్రక్రియలో వైసీపీ బెదిరింపులతో అద నంగా మరో 13 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని మున్సిపాల్టీలు,నగర పంచాయతీల్లో 268 వార్డులకు జరగాల్సిన ఎన్నికలు 233 వార్డులకే జరగనున్నాయి. అత్యధికంగా తుని మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 30 వార్డులకు 15 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల తొలిరోజు 13, చివరిరోజు రెండు చొప్పున 1,5,6,7,8,9,10,11,13,14,16,22,23,26,28 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో సగానికి సగం వార్డులు ఏకగ్రీవాల రూపంలో వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. దాదాపు ఇవన్నీ అధికార పార్టీ నేతల ప్రలోభాలు, ఒత్తిళ్లతో టీడీపీ అభ్యర్థులను వెనక్కు తగ్గేలా చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామచంద్రపురం మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 28 వార్డులకుగాను 10వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. 5,6,9,12,18,24,25,26,27,28 వార్డుల్లో టీడీపీ నుంచి అభ్యర్థులు లేకుండా విత్‌డ్రా చేయుంచి అధికార పార్టీ నేతలు తమ ఆధిపత్యం ప్రదర్శించారు. అమలాపురం మున్సిపాల్టీలో 11,13, 14,16,17,25 వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 30 వార్డులకుగాను ఏకగ్రీవాలు మినహాయించి 24 స్థానాలకే ఎన్నికలు జరగనున్నాయి. సామర్లకోటలో ఒకటో నెంబర్‌ వార్డు మంగళవారం ఏకగ్రీవం కాగా, బుధవారం 14వార్డు నుంచి టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ విత్‌డ్రా కావడంతో వైసీపీకి పోటీలేకుండా పోయింది. ఇక్కడ 31 వార్డులకుగాను, 29 వార్డుల కే ఎన్నికలు జరగనున్నాయి. పిఠాపురంలో ఆరో వార్డు, ముమ్మిడివరం నగర పంచాయతీలో నాలుగో వార్డు వైసీపీకి ఏకగ్రీవమైంది. మండపేట, పెద్దాపురం మున్సిపాల్టీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో ఏకగ్రీవాలకు లేకపోవడంతో మొత్తం ఎన్నికలు జరుగుతాయి.

Updated Date - 2021-03-04T06:57:35+05:30 IST