హోరా హోరీ

ABN , First Publish Date - 2021-03-07T07:16:00+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో కేవలం సంక్షేమ మంత్రాన్ని జపిస్తూ విజ యంపై ఆశలు పెట్టుకున్న అధికార వైసీపీకి పరిస్థితులు క్షేత్రస్థాయిలో పెద్దగా కలిసిరావడం లేదు. ఎక్కడకు వెళ్లినా ఆయా మున్సిపాల్టీల్లో గడిచిన కొన్నినెలల్లో ఏమాత్రం జరగని అభివృద్ధి, పేరుకుపోయిన సమస్యలపై ప్రజానీకం పెడుతున్న ఏకరువులే స్వాగతమిస్తున్నాయి.

హోరా హోరీ

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి  ఇంకా రెండు రోజులే గడువు

వైసీపీ, టీడీపీ తుది ప్రచార హోరు

అభ్యర్థులకు తోడుగా వైసీపీ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు బరిలో..

అటు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు,  మాజీ ఎమ్మెల్యేలకు బరువు బాధ్యతలు

వైసీపీ ప్రచారానికి పట్టణ ఓటర్లలో అనుకున్న స్పందన కరువు

చివరి రెండు రోజుల ప్రలోభాలపైనే నేతల నమ్మకం

ఇప్పటికే మద్యం, నగదు భారీగా పంచేందుకు ఏర్పాట్లు పూర్తి


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగియడానికి సమయం దగ్గర పడింది. ఎస్‌ఈసీ ప్రకటించిన గడువుకు ఇంకా రెండు రోజులే ఉండడంతో పార్టీలు ఎన్నికల ప్రచార బరిలో నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీలు అందుబాటులోని అందరు కీలక నేతలతో ప్రచారం చేయిస్తున్నాయి. దీంతో పురపోరు రసవత్తరంగా మారింది. ఎనభై శాతం మున్సిపాల్టీల్లో గెలిచితీరాల్సిందేనని సీఎం జగన్‌ హుకుం జారీ చేయడంతో ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు చివరకు ఇంఛార్జి మంత్రి కృష్ణదాస్‌ కూడా ప్రచారంలో మునిగితేలుతున్నారు. అధికార పార్టీ వేగానికి కళ్లెం వేయడానికి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు రాజప్ప,  వేగుళ్లతోపాటు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సైతం బరిలో ప్రచార వ్యూహాల్లో మునిగితేలుతున్నారు. ఇక పట్టణ ఓటర్లలో అధికార  పార్టీ ప్రచారానికి అనుకున్న స్పందన లేకపోవడంతో పోలింగ్‌కు ముందురోజు ప్రలోభాల కోసం రకరకాల ఎరలు సిద్ధంచేస్తోంది.


మున్సిపల్‌ ఎన్నికల్లో కేవలం సంక్షేమ మంత్రాన్ని జపిస్తూ విజ యంపై ఆశలు పెట్టుకున్న అధికార వైసీపీకి పరిస్థితులు క్షేత్రస్థాయిలో పెద్దగా కలిసిరావడం లేదు. ఎక్కడకు వెళ్లినా ఆయా మున్సిపాల్టీల్లో గడిచిన కొన్నినెలల్లో ఏమాత్రం జరగని అభివృద్ధి, పేరుకుపోయిన సమస్యలపై ప్రజానీకం పెడుతున్న ఏకరువులే స్వాగతమిస్తున్నాయి. దీంతో ప్రచార బరిలో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు పరిస్థితులు మింగుడు పడడం లేదు. దీంతో అప్పటికప్పుడు కొన్ని సమస్యలు తీర్చేలా అధికారులకు గుట్టుచప్పుడు కాకుండా ఆదేశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా తాగునీరు, అధ్వాన రహదారులు, ఇళ్లస్థలాల్లో పేర్లు లేకపోవడం, స్థలాల పేరుతో చోటామోటా నేతల కలెక్షన్లు.. ఇలా అనేక అంశాలు ప్రచారంలో నేతలకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో అంతర్గతంగా ఉన్న వ్యతిరేకతతో నష్టం జరుగుతుందనే ఆందోళన నాయకులను వెన్నాడుతోంది. సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామనే ఏకైక అజెండా తప్పించి చెప్పడానికి ఏమీ లేకపోవడంతో ప్రజల నుంచి ప్రశ్నల పరంపర ఎదురవుతుండడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పథకాల్లోను రకరకాల నిబంధనల పేరుతో ఆర్హులను తొలగించడంతో వారంతా నేతలను ప్రచారంలో నిలదీస్తున్నారు. దీంతో తుని నుంచి పెద్దాపురం మున్సిపాల్టీ వరకు ఎక్కడ చూసినా అవే సమస్యలు ఎదురవుతున్నాయి.


పెద్దాపురం మున్సిపాల్టీలో స్థానికులు తాగునీటి సమస్యపై నిలదీయడంతో అప్పటికప్పుడు అధికార పార్టీ నేతలు చెరువు గట్టుకు సమీపంలో మంచినీటి వసతి ఏర్పాటు చేయడం విశేషం. ఇలా వ్యతిరేకతను అధిగమించడానికి రకరకాల ఎత్తులు వేస్తున్నారు. జనస్పందన సైతం పల్చగా ఉండడంతో అనుకున్న మార్గాల్లో కాకుండా ప్రధాన రహదారులపైనే ప్రచారం చేస్తున్నారు. ఎంపీ వంగా గీత, ఇంఛార్జి మంత్రి కృష్ణదాస్‌ పర్యటనలకు జనాలు వచ్చేలా చేయడానికి స్థానిక పార్టీ నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. అటు వైసీపీ ప్రచారానికి ధీటుగా టీడీపీ నుంచి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల, పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు, ప్రత్తిపాడులో రాజా ఇలా ఎక్కడికక్కడ నేరుగా రంగంలోకి దిగి అభ్యర్థుల తరపున ప్రచారంతోపాటు విజయానికి కావలసిన వ్యూహాలు అమ లు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడికక్కడ తమకు బాగా కలిసి వస్తోందని, ప్రచారంలో ప్రజల నుంచి ఇది స్పష్టంగా కనిపిస్తోందని వారంతా విశ్లేషిస్తున్నారు.


ప్రలోభాలు రెడీ...

సోమవారంతో ప్రచార గడువు ముగియనుండడంతో మంగళవారం రోజు భారీ ప్రలోభాల తెరకు అధికార వైసీపీ ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తుని, మండపేట, పెద్దాపురం,సామర్లకోట, ముమ్మిడివరం, పిఠాపురం తదితర చోట్ల పంపకాలకు మద్యం కూడా సిద్ధం చేశారు. తెలంగాణ నుంచి వారం ముందు కొన్ని మున్సిపాల్టీల పరిధిలో రహస్య స్థావరాలకు ఇవి ఆయా నేతలు చేర్చేశారు. అటు యానాం నుంచి కూడా మందు భారీగానే తరలించి స్టాకులు సిద్ధం చేశారు. ఇదంతా ఒకెత్తయితే ముక్కుపుడకలు, చీరలు, జాకెట్లు సైతం పంపకాలకు అధికార పార్టీ నేతలు ఏర్పాట్లు చేసి ఉంచారు. అటు పోటీ తీవ్రంగా ఉన్న మండపేట, పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, ముమ్మిడివరం, ఏలేశ్వరం తదితర చోట్ల వార్డును బట్టి ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ. రెండు వేల వరకు పంపకాలకు సిద్ధమయ్యారు.

Updated Date - 2021-03-07T07:16:00+05:30 IST