కరోనా కట్టడికి కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-04-13T05:11:17+05:30 IST

కొవిడ్‌ నిబంధనలను ప్రతీ ఒక్కరూ విధిగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని మునిసిపల్‌ కమిషనర్‌ కే శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు.

కరోనా కట్టడికి కఠిన చర్యలు
పెట్రోల్‌ బంక్‌ ఉద్యోగికి జరిమానా విధించి రశీదు అందిస్తున్న గద్వాల కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి

- మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి 

- పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు 

- జిల్లా, మండల కేంద్రాల్లో అవగాహనా కార్యక్రమాలు 

- ప్రతీ ఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచన

- లేకపోతే రూ.100 జరిమానా విధిస్తామని హెచ్చరిక

    గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 12 : కొవిడ్‌ నిబంధనలను ప్రతీ ఒక్కరూ విధిగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని మునిసిపల్‌ కమిషనర్‌ కే శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. పట్టణంలో మాస్కు ధరించ కుండా వ్యాపారాలు నిర్వహించవద్దని, ప్రజలు సైతం మాస్కు లేకుండా బయట తిరగవద్దని, ఇప్పటికే విస్తృత ప్రచారం చేపట్టామన్నారు. పట్టణంలోని పలు దుకాణాలను కమిషనర్‌ తనిఖీ చేశారు. మాస్కు లేకుండా విధులు నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంకు ఉద్యోగికి రూ.1000లు జరిమానా విధించారు. జీవో నెంబర్‌ 69 ఆధారంగా పట్టణంలో విధించిన తొలి జరిమానా ఇదేనని అధికారులు తెలిపారు. అనంతరం పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌ రెడ్డితో కలిసి ప్రధాన రోడ్డు కూడళ్ల వద్ద విస్రృతంగా తనిఖీలు నిర్వహించారు. మాస్కు లేకుండా తిరుగుతున్న వాహనదారులు, పాదచారులను గుర్తించి రూ.1000ల మేరకు జరిమానా విధించారు. మొత్తం రూ.24 వేలు జరిమానా వసూలైనట్లు ఆర్‌ఓ రాములు తెలిపారు. 


కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

    ఇటిక్యాల, ఏప్రిల్‌ 12 : ప్రజలందరూ కొవిడ్‌ జాగ్రతలు తీసుకోవాలని నిబంధనలు పాటించాలని ఇటిక్యాల ఎస్‌ఐ సత్యనారాయణ ప్రజలకు సూచించారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని, గుంపులుగా ఉండకూడదనిక, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వాహనాలపై వెళ్లే వారు కూడా మాస్క్‌ పెట్టుకోవాలని చెప్పారు. 45 ఏళ్లు పైబడిన వారు విదిగా వాక్సిన్‌ వేయించుకోవాలని కోరారు.


జాగ్రత్తలు పాటించాలి

    గద్వాల టౌన్‌ : మునిసిపల్‌ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందితో పాటు పారిశుధ్య కార్మికులందరూ విధిగా మాస్కులు ధరించాలని మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ సూచించారు. సిబ్బంది మాస్కులు ధరించి విధులు నిర్వహిస్తూ, కరోనాపై ప్రజలకు అవగాహన కల్సించాలన్నారు. పారిశుధ్య కార్మికులకు సోమవారం కార్యాలయం వద్ద ఆయన మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో పట్టణ పారిశుధ్యం, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కార్మికులు అందించిన సేవలు చరిత్రలో నిలిచి పోతాయన్నారు. అదే స్ఫూర్తితో వైరస్‌ ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్‌ కే శ్రీనివాస రెడ్డి, ఆర్‌ఓ రాములు, ఆర్‌ఐ వెంకటేష్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ ఎల్లారెడ్డి,  శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ పాల్గొన్నారు. 


ప్రతీ ఒక్కరు మాస్కు ధరించాలి

    మల్దకల్‌ : కరోనా ఉధృతి పెరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ మాస్క్‌ ధరించాలని మల్దకల్‌ ఎస్‌ఐ శేఖర్‌ సూచించారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా సోకిన వారు బయట తిరగొద్దని, హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని చెప్పారు. మల్దకల్‌ ఆలయానికి వచ్చిన భక్తులకు పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. చల్లని మజ్జిగను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఎసై జయరాములు మాట్లాడుతూ  కరోనా రెండవ దశ విస్తరిస్తోందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ప్రజలకు సూచించారు. 



Updated Date - 2021-04-13T05:11:17+05:30 IST