చైర్మన్‌ పీఠం కోసం వైసీపీలో తీవ్ర పోటీ

ABN , First Publish Date - 2021-02-27T05:04:19+05:30 IST

మార్కాపురం మున్సిపల్‌ చైర్మన్‌ పదవి వైసీపీ తరఫున తీవ్ర పోటీ నెలకొంది. విడముంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అన్నంతగా పరిస్థితి మారింది.

చైర్మన్‌ పీఠం కోసం వైసీపీలో తీవ్ర పోటీ

రంగంలోకి ముగ్గురు అభ్యర్థులు

ఒకరికి దేవదాయ శాఖ మంత్రి సిఫార్సు అని ప్రచారం?

ఎమ్మెల్యే ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్న మిగిలిన ఇద్దరు


మార్కాపురం, ఫిబ్రవరి 26 : మార్కాపురం మున్సిపల్‌ చైర్మన్‌ పదవి వైసీపీ తరఫున తీవ్ర పోటీ నెలకొంది. విడముంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అన్నంతగా పరిస్థితి మారింది. కరోనా నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు గత మార్చిలో నిలిచిపోయాయి. అప్పట్లో మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి ఇరువురు మాత్రమే పోటీలో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ తరఫున పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. 

మార్కాపురం పురపాలక సంఘ చైర్మన్‌గా బరిలోకి దిగేందుకు గత యేడాది నోటిఫికేషన్‌ వెలువడినప్పుడు వైసీపీ పట్టణాధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్‌ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, ప్రముఖ వైద్యురాలు, మాజీ కౌన్సిలర్‌ డాక్టర్‌ చెప్పల్లి కనకదుర్గ పోటీ పడ్డారు. అప్పుడు కరోనాతో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తిరిగి మున్సిపల్‌ ఎన్నికలకు నోటిషికేషన్‌ వెలువడటం, ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే కొనసాగించాలని శుక్రవారం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీలో చైర్మన్‌ సీటు కోసం పలువురు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టీడీపీకి చెంది జిల్లా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పెరుమాళ్ల కాశీరావు గత ఏడాది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మూడు రోజుల క్రితం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి అధిష్టానం ఆదేశిస్తే చైర్మన్‌ పదవికి తాను పోటీలో నిలుస్తానని ప్రకటించారు. 

పాత కాపులకు ప్రాధాన్యత ఉంటుందా?

ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పార్టీ వ్యవహారాలకు సంబంధించి తన తండ్రి కేపీ కొండారెడ్డి, సోదరుడు కృష్ణ మోహనరెడ్డిల సూచనలు, సలహాల మేరకే నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. చైర్మన్‌ అభ్యర్థి ఎంపికలో కూడా ఇదే జరగనున్నట్లు తెలుస్తుంది. వారు కాంగ్రెస్‌ నుంచి తమ వెంట ఉన్న చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, డాక్టర్‌ చెప్పలి కనకదుర్గకు ప్రాధాన్యత ఇస్తారా? లేదా గత ఏడాది టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన పెరుమాళ్ల కాశీరావుకు ప్రాధాన్యత ఇస్తారా? అనే అంశం చర్చనీయాంశమైంది. 

సిఫార్సులు అమలయ్యేనా?

పోటీలో ఉన్న కాశీరావుకు మద్దతుగా నేతలకు సిఫార్సు ఒత్తిడి ఎక్కువైంది. కాశీరావు సామాజికవర్గానికి చెందిన దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘాల నేతల నుంచి సిఫార్సులు అందినట్లు సమాచారం. ఆయన చేయించిన సిఫార్సులకు పార్టీ నియోజకవర్గ బాధ్యులు ఎంతవరకూ ప్రాధాన్యత ఇస్తారు? వాటిని పరిగణనలోకి తీసుకుంటే పాత వారికి ఏమైనా ప్రత్యామ్నాయ పదవులు ఏర్పాటు చేస్తారా? లేదా పెరుమాళ్లనే బుజ్జగించే ప్రయత్నం చేస్తారా? అనేది వేచిచూడాలి.


Updated Date - 2021-02-27T05:04:19+05:30 IST