Munugodu: సీఎం కేసీఆర్ గ్రీన్‎సిగ్నల్.. కానీ ఎమ్మెల్యేల్లో భయం!

ABN , First Publish Date - 2022-08-18T01:02:53+05:30 IST

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో తెలంగాణ పాలిటిక్స్‌ హీటెక్కిపోతున్నాయి...

Munugodu: సీఎం కేసీఆర్ గ్రీన్‎సిగ్నల్.. కానీ ఎమ్మెల్యేల్లో భయం!

మునుగోడు (Munugodu):  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ( Komatireddy RajaGopal Reddy) రాజీనామాతో తెలంగాణ పాలిటిక్స్‌ (Telangana Politics) హీటెక్కిపోతున్నాయి. ఉప ఎన్నిక వస్తే తాడోపేడో తేల్చుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ తెగ తహతహలాడుతున్నాయి. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం మునుగోడు తలనొప్పిగా మారుతోంది. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన మాటలు ప్రస్తుతం అక్షరాల నిజం అవుతున్నాయి. ఉపఎన్నిక అనివార్యమని తెలిసినప్పటి నుండి మునుగోడుపై సీఎం కేసీఆర్ (Cm Kcr) ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు నల్లగొండ జిల్లా యంత్రాంగంతో టచ్‌లో ఉంటూ.. మునుగోడు పరిధిలోని పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రతి పనికీ క్షణాల్లో ఆమోదం పొందేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మునుగోడు గెలుపు బాధ్యతలను మంత్రులు జగదీష్‌రెడ్డి (Jagadish Reddy, హరీష్‌రావు (Harish Rao)తోపాటు నల్లగొండ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులకు అప్పగించారు. గ్రౌండ్ లెవల్‌లో పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ సర్కార్ పని తీరును వివరించాలని ఆదేశించారు.


మరోవైపు మునుగోడుకు టీ.సర్కారు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పటికే కీలక నేతల ఆధ్వర్యంలో ఆపరేషన్ మునుగోడు స్టార్ట్​అయింది. ఇన్ని రోజులు నిధులు ఇచ్చేందుకు అవస్థలు పడ్డ తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు గ్రామాల వారీగా పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గత రెండేళ్లుగా మునుగోడుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయని ప్రభుత్వం తాజాగా.. పంచాయతీ భవనాలు, అంతర్గత రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, యువజన సంఘాల భవనాలకు లైన్ క్లియర్ చేస్తోంది. జగదీశ్‌రెడ్డి స్వయంగా వీటికి అప్రూవల్ ఇప్పించి.. 50 కోట్ల నిధులు కేటాయించేలా చేశారట. 


అయితే.. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చౌటుప్పల్-సంస్థాన్ నారాయణపురానికి నిధులు కావాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకుండా పోయింది. అసెంబ్లీ వేదికగా తన నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండలం, చౌటుప్పల్‌లో రోడ్లను బాగు చేయాలని విన్నవించినా పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం.. రోడ్లకు నిధులు ఇవ్వడం, పనులు మొదలు పెట్టడం.. కేవలం కొన్ని రోజుల్లోనే జరిగిపోతోంది. కాగా.. ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలోనే మునుగోడుపై ఒక్కసారిగా వరాల జల్లు కురుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


ఇదిలావుంటే... ఒకవైపు నిధులు కేటాయిస్తూనే.. మరోవైపు ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ముమ్మరం చేశారు గులాబీ నేతలు. ఇందులో భాగంగా రాజగోపాల్‌రెడ్డి వెంట నడిచిన పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు , ఎంపీటీసీలు, సర్పంచులకు టీఆర్ఎస్ నేతలు గాలం వేస్తున్నారు. పార్టీ మారితే భారీగా ఆఫర్లు ఇస్తామంటూ ఆకర్షించే ప్రయత్నాలూ చేస్తున్నారట. ఒకవేళ.. నేతలు పార్టీ మారితే ప్రతి గ్రామానికి కనీసం నాలుగైదు కోట్ల నిధులను అదనంగా ఇచ్చేందుకు హామీలు గుప్పిస్తున్నారు. 


ఇప్పటికే మునుగోడు పంచాయితీ రాజ్‌ శాఖకు దాదాపు రూ. 200 కోట్ల నిధుల ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయట. దీంతో ఈ మొత్తం నిధులకు త్వరలో గ్రీన్ సిగ్నల్ రానుంది. ఇలా.. ఇప్పటికే.. కేసీఆర్‌ ప్రభుత్వం.. అనధికారికంగా మునుగోడుకు రూ. 300 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ఇక.. ఈ నెల 20న ప్రజా దీవెన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి కేసీఆర్ మరిన్ని వరాలు కురిపించే అవకాశం ఉంది.



అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతోందట. రాజీనామా చేసిన ప్రాంతాల్లోనే.. అభివృద్ధికి నిధులు.. భారీగా విడుదల చేస్తుండడం.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా ప్రజల నుంచి వ్యక్తం అవుతోందట. మొన్నా మధ్య ఓ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితే ఎదురైందట. ఇప్పటికే మునుగోడులో వందల కోట్ల నిధుల వరద పారగా.. రాబోయే రోజుల్లో డోస్ మరింత పెంచే అవకాశం ఉంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి.. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి మరి..



Updated Date - 2022-08-18T01:02:53+05:30 IST