ముందు పంపకాలు, తర్వాతే బోర్డులు

ABN , First Publish Date - 2021-07-22T08:47:45+05:30 IST

కేంద్రప్రభుత్వం జూలై 15 తేదీన తీసుకువచ్చిన గెజిట్‌ను పరిశీలిస్తే జయశంకర్ సార్ చెప్పిన మాటలు అక్షరాలా నిజం అనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు...

ముందు పంపకాలు, తర్వాతే బోర్డులు

కేంద్రప్రభుత్వం జూలై 15 తేదీన తీసుకువచ్చిన గెజిట్‌ను పరిశీలిస్తే జయశంకర్ సార్ చెప్పిన మాటలు అక్షరాలా నిజం అనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే సరిపోదని, పునర్నిర్మాణంలోనూ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేవారాయన. అలాంటి సందర్భాలు నిరంతరం మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీ ఆగడం లేదు. కేంద్రప్రభుత్వపు సవతి తల్లి ప్రేమ మానలేదు. నదీజలాల్లో మన రాష్ట్రానికి శాస్త్రీయ పద్ధతిలో నీటి కేటాయింపులు జరగకుండా బోర్డు ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్‌కే లాభం.


జాతీయపార్టీలు తెలంగాణ అస్తిత్వ పార్టీలు కాలేవు. తెలంగాణ ప్రజల హక్కులను పరిరక్షించే చిత్తశుద్ధి వాటికి ఉండదు. పైపెచ్చు మనపై అధికారాన్ని చెలాయించడానికి మాత్రమే పనిచేస్తాయి. మన అభివృద్ధిని దోచుకొని ఉత్తరాది రాష్ట్రాలకు తరలించడమే వాటి కార్యాచరణ. మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్మును దోచుకుని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే పనిలో నిమగ్నమై ఉంది.


నిన్నటిదాకా కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించమని మొరపెట్టుకున్నా కేంద్రం నుంచి స్పందన లేదు. ఇప్పుడేమో ఈ నదులపై బోర్డులను ఏర్పాటు చేసింది. వాటిపై పూర్తి పెత్తనం తన చేతిలోకి తీసుకున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నీటిపారుదల శాఖ పనితీరు అంతా తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని గెజిట్ తీసుకొచ్చింది. రెండు రాష్ట్రాలకు సంబంధంలేని అధికారులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ బోర్డు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్టాల మధ్య నీటి పంపిణీ జరగకుండా నదీ యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయమే కొనసాగుతుంది.


కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై లేని ఆంక్షలు అధికారాలు మనపై ఎందుకు? మన రాష్ట్రంపై బోర్డుల రూపంలో కేంద్రం విశిష్ట అధికారాలు చెలాయించబోతోంది. కొత్తగా తెచ్చిన ఈ బిల్లు ద్వారా మన ప్రాంతంలో కురిసే వర్షం, దాని ఆధారంగా పారే నీటిపై అధికారం లేకుండా పోతుంది. తెలంగాణ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నీటిని వాడుకునే అవకాశం లేదు. నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులు ఆగిపోతే తెలంగాణ ప్రాంతం మునుపటి దుర్భర స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది.


భారత రాజ్యాంగం కల్పించిన శాసనాధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేరువేరుగా ఉన్నాయి. కొన్ని శాసనాధికారాలు ఉమ్మడిగా జాబితాలో ఉన్నాయి. వాటిని తుంగలో తొక్కుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందిస్తున్నది. మన రాజ్యాంగం కల్పించిన శాసనాధికారాలు కేంద్రప్రభుత్వం పరిధిలో గతంలో 97 ఉంటే ఇప్పుడు వాటిని 100కు పెంచుకున్నారు. రాష్ట్ర పరిధిలోని శాసనాధికారాలు 66 ఉండేవి. వాటిని తగ్గించి 61 తగ్గించి వేశారు. ఉమ్మడి జాబితాలో ఉన్న శాసనాధికారాలు 47 నుంచి 52కు పెరిగిపోయాయి. క్రమంగా కేంద్ర జాబితాలోని శాసన అధికారాలు, ఉమ్మడి జాబితాలోని శాసనాధికారాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రాష్ట్రాల అధికారాలను తగ్గించుకుంటూ పోతూ కేంద్రం రాష్ట్రాల అధికారాల్లో చొరబడాలని చూడటం అప్రజాస్వామికం.


నీటిపారుదల రంగం రాష్ట్రాల పరిధిలోని అంశం. అది కూడా తమ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. డ్యామ్ సేఫ్టీ బిల్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. రాష్ట్రాల అభ్యంతరాల వల్ల ఈ బిల్లు వెనక్కి వెళ్తున్నది. కానీ బీజేపీ ప్రభుత్వం రెండేళ్ళ క్రితం డ్యాం సేఫ్టీ బిల్–-2019ని లోక్‌సభలో తనకున్న బలంతో ఆమోదింప చేసుకున్నది. కానీ రాజ్యసభలో ఆమోదం పొందలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని కొన్ని సెక్షన్స్ ఆధారంగా చేసుకొని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న వివిధ ప్రాజెక్టుల మీద పూర్తిస్థాయి అధికారాన్ని కట్టపెట్టుకుంటూ కేంద్రప్రభుత్వం కొత్త గెజిట్‌ను విడుదల చేసింది. ఈ గెజిట్ డ్యాం సేఫ్టీ బిల్లుకు నకలులాగ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడి 70 ఏళ్లపాటు నిర్మాణానికి, నిర్వహణకు నోచుకోని ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటున్న దశలో కేంద్రం ఏర్పాటు చేసిన బోర్డు, దాని అధికారాలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉన్నాయి.


తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించే ఈ గెజిట్‌ను తక్షణం నిలిపివేయాలి. ముందుగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన నీటి వాటాలను కేటాయించాలి. రెండు రాష్ట్రాల మధ్య శాశ్వత కేటాయింపులు నిర్ణయమయ్యేవరకు తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటాలు 50:50 శాతంగా నిర్ణయించి ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాలో తెలంగాణ లెక్క తేల్చాలి. ఇలా గెజిట్ పేరుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాయాలని చూస్తే తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

ఎర్రోజు శ్రీనివాస్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వికాస సమితి

Updated Date - 2021-07-22T08:47:45+05:30 IST