పారిశుధ్యం.. పడకేనా?

ABN , First Publish Date - 2022-07-11T05:02:24+05:30 IST

వర్షాలు పడుతున్నాయి. పారిశుధ్యం పరిస్థితి అంతంతగానే ఉంది. వర్షాలతో డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై చెత్తాచెదారాలు కుళ్లి దుర్వాసనతో పాటు అపరిశుభ్రత తాండవిస్తోంది.

పారిశుధ్యం.. పడకేనా?
సమ్మె గురించి కార్మికులతో చర్చిస్తున్న సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు

నేటి నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ప్రభుత్వం తమను విస్మరించిందని ఆందోళనబాట

ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించని మున్సిపల్‌ అధికారులు


బాపట్లటౌన్‌, జూలై 10: వర్షాలు పడుతున్నాయి. పారిశుధ్యం పరిస్థితి అంతంతగానే ఉంది. వర్షాలతో డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై చెత్తాచెదారాలు కుళ్లి దుర్వాసనతో పాటు అపరిశుభ్రత తాండవిస్తోంది. ఈ పరిస్థితుల్లో సోమవారం నుంచి మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని లేదంటే ఆందోళన బాట పడతామని గతంలోనే కార్మికులు మున్సిపల్‌ అధికారులకు నోటీసులు ఇచ్చి ఉన్నారు. ఆ గడువు ఆదివారంతో ముగిసింది. అయినా వారి డిమాండ్ల పరిష్కారంపై కాని, వారితో చర్చలకు కాని ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఎక్కడికక్కడ సమ్మెకు కార్మికులు సిద్ధమవ్వాలని వారి సంఘాల నాయకులు పిలుపిచ్చారు. జిల్లాలో బాపట్ల, రేపల్లె, చీరాల, అద్దంకి మున్సిపాలిటిలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌,  రెగ్యూలర్‌ కార్మికులు మొత్తం 740మంది ఉండగా వీరందరూ సమ్మెలోకి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. దీంతో సోమవారం నుంచి రోడ్లు ఊడ్చడం, కాల్వల శుభ్రం, చెత్తాచెదారాల సేకరణలాంటి పనులను కార్మికులు బహిష్కరించనున్నారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పారిశుధ్యం అధ్వానంగా దోమలు, దుర్వాసన, అపరిశుభ్రతతో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే కార్మికులు సోమవారం నుంచి సమ్మె బాట పడితే పరిస్థితి గురించి మున్సిపల్‌ అధికారులు కనీసంగా కూడా ఆలోచించడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరవధిక సమ్మె ఎన్ని రోజులు జరుగుతుందోనని, అప్పటి వరకు పారిశుధ్యం పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కనీసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులపై ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె

తమను రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె బాట పట్టాల్సి వస్తోందని కార్మికులు తెలిపారు. తమ సమస్యలపై ఏఐటీయూసీ, సీపీఐ తదితర నాయకుల ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు చేశామన్నారు. అయినా ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం దాటవేస్తూ వస్తుందే కాని తమ గురించి ఆలోచించడంలేని కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా సోమవారం నుంచి పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నట్లు సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ప్రకటించారు.  

డిమాండ్లు ఇవి.. 

- ఆరునెలలు నుంచి మెడికల్‌ అలవెన్స్‌లు ఇవ్వలేదు. 

- మూడేళ్ల నుంచి రెగ్యులర్‌ పారిశుధ్య కార్మికులకు ఇచ్చే సబ్బులు, యూనిఫామ్‌, కొబ్బరినూనె, చెప్పులు ఇవ్వడంలేదు. 

- పారిశుధ్య కార్మికులపై పెంచిన 12 గంటల పనిభారాన్ని 8 గంటలకు తగ్గించాలి.

- కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలి.

- కరోనాతో మరణించిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షలు పరిహారం చెల్లించాలి.

- కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలి.

- రెగ్యులర్‌ కార్మికులకు సీపీఎస్‌ రద్దు చేసి పాతపెన్షన్‌ అమలు చేయాలి.

Updated Date - 2022-07-11T05:02:24+05:30 IST