అనుమతులు ఇక చకచకా..

ABN , First Publish Date - 2020-11-22T04:13:06+05:30 IST

మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు, ప్లాట్ల క్రమబద్దీకరణలో రాష్ట్రప్రభుత్వం కొత్తవిధానాన్ని తీసుకువచ్చింది.

అనుమతులు ఇక చకచకా..

  • టీఎస్‌ బీ-పాస్‌తో పర్మిషన్లు సులభతరం
  • మున్సిపాలిటీలకు టీవీటీల నియామకం
  • ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు.. ప్రొసీడింగ్‌లు
  • నామమాత్రం కానున్న పట్టణ ప్రణాళిక విభాగం


తాండూరు : మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు, ప్లాట్ల క్రమబద్దీకరణలో రాష్ట్రప్రభుత్వం కొత్తవిధానాన్ని తీసుకువచ్చింది. టీఎస్‌ బీ-పాస్‌తో గతంలో ఉన్న భవననిర్మాణ అనుమతులకు ఇబ్బందులు తొలగనున్నాయి. టీఎస్‌ బీ-పాస్‌లో కొత్తవిధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఆలస్యం, అవకతవకలను నివారించే లక్ష్యంతో తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌, అప్రువల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ సిస్టం(టీఎస్‌-బీపాస్‌-)-2020 పట్టణాల్లో అమల్లోకి వచ్చాయి. తద్వారా మున్సిపాలిటీలకు పోస్ట్‌ వెరిఫికేషన్‌ స్కీంను నియమించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు పోస్ట్‌ వెరిఫికేషన్‌ టీంలను ఏర్పాటు చేశారు. వికారాబాద్‌ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలున్నాయి. ప్రతి మున్సిపాలిటీకి ఒక వెరిఫికేషన్‌ టీంను నియమించారు. ఇందులో కలెక్టర్‌ అధ్యక్షతన మున్సిపల్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, పోలీసు శాఖల అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ ఉంటుంది. పీవీటీ నివేదిక ఆధారంగా అనుమతులను టాస్క్‌ఫోర్స్‌ ఇవ్వడమా..? తిరస్కరించడమా? చేస్తుంది. దరఖాస్తు వివరాలు క్షేత్రస్థాయితో సరిపోతే రిలీజ్‌ అయిన ప్రొసీడింగ్‌నే అనుమతిగా పరిగణించవచ్చు. దరఖాస్తుకు, క్షేత్రస్థాయిలో తేడాలుంటే టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయం మేరకు సదరు భవనాలను కూల్చి వేయడం, సీజ్‌ చేయడం, లేదా నిబంధనల ప్రకారం జరిమానాలు విధించవచ్చు. అనుమతుల్లో పీవీటీలు కీలకం కానున్నాయి. 


నామమాత్రం కానున్న పట్టణ ప్రణాళిక


పట్టణ ప్రణాళిక విభాగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టీఎస్‌ బీ-పాస్‌ అమల్లోకి రావడంతో మున్సిపాలిటీల్లో కీలకంగా ఉన్న పట్టణ ప్రణాళిక విభాగం నామమాత్రం కానుంది. వెంచర్ల అనుమతులు, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ కూడా టీఎస్‌-బీ-పాస్‌కు వర్తింపజేస్తుంది. మార్గదర్శకాలు త్వరలో జారీ కానున్నట్లు తెలిసింది. 


యజమానుల ధ్రువీకరణే ప్రామాణికం


ఇక నుంచి భవన నిర్మాణ అనుమతులకు యజమానుల ధ్రువీకరణే ప్రామాణికం కానుంది. భవన స్థలం, ప్లాన్‌ వివరాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి నిమిషాల వ్యవధిలో పన్ను చెల్లిస్తే వెంటనే     ప్రొసీడింగ్‌ రిలీవ్‌ అవుతుంది. దీని ఆధారంగా భవనాలను నిర్మించుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌ దరఖాస్తు ఆధారంగా సం బంధిత మున్సిపల్‌ పట్టణ        ప్రణాళిక విభాగం అధికారులు దస్తావేజులు, స్కూృట్ని నిర్వహిస్తారు. కలెక్టర్‌ నియమించిన పీవీటీ బృందం 21 రోజుల్లోపు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవిక నివేదికను అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు క్షేత్రస్థాయిలో పరిశీలిన నివేదికలో తేడాలుంటే మున్సిపల్‌ యాక్ట్‌-2019 ప్రకారం చర్యలు తీసుకుంటారు. 


తప్పనున్న ఇక్కట్లు..


టీఎస్‌-బీ-పాస్‌తో అనుమతుల కోసం మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇక్కట్లు లబ్ధిదారులకు తప్పనున్నాయి. అన్ని సక్రమంగా ఉంటే అనుమతులు ఆన్‌లైన్‌లోనే మంజూరవుతాయి. 75 గజాలలోపు విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి దస్తావేజులతో ఒక్కరూపాయి ఫీజు చెల్లించి జీ-ప్లస్‌-1 భవనాన్ని నిర్మించుకోవచ్చు. 75 నుంచి 600 గజాలలోపు స్థలంలో జీ-ప్లస్‌-2 భవనానికి అనుమతులు లభిస్తాయి. 600 గజాల పైన స్థలంలో నిర్మించే భవనాలకు మాత్రం టీఎస్‌-బీ-పాస్‌లో వచ్చిన దరఖాస్తు ఆధారంగా క్షేత్రస్థాయిలో పీవీటీ పరిశీలించిన తర్వాతనే అనుమతులు మంజూరవుతాయి.

Updated Date - 2020-11-22T04:13:06+05:30 IST