మున్సిపల్‌ కార్మికుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-22T05:52:56+05:30 IST

అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారనే మనస్తాపంతో పారిశుధ్య కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గంగవరం మండలంలో గురువారం చోటుచేసుకుంది.

మున్సిపల్‌ కార్మికుడి ఆత్మహత్య
రాజేష్‌(ఫైల్‌ ఫొటో)

గంగవరం/పలమనేరు, జనవరి 21: అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారనే మనస్తాపంతో పారిశుధ్య కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గంగవరం మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు...  మేలుమాయి గ్రామానికి చెందిన రవి కుమారుడు రాజేష్‌(30) 12 ఏళ్లుగా పలమనేరు మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్‌ కింద పారిశుధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యం బారిన పడడంతో విధులకు హాజరుకాలేదు. ఆరోగ్యం కుదుటపడిన తరువాత 5 రోజులుగా ఉద్యోగం కోసం మున్సిపల్‌ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే నీ స్థానంలో మరొకరిని నియమించామని చెప్పడంతో చెల్లెలు పెళ్లికి చేసిన అప్పులు తీరేంతవరకు తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో మనస్థాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఫ్యాను కొక్కీకి ఉరి వేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఇంటికి చేరుకొని తలుపుకొట్టగా, ఎంతసేపటికీ తెరవలేదు. అనుమానం వచ్చి కిటికీలో తొంగిచూడగా ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా, అప్పటికే మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-01-22T05:52:56+05:30 IST