రౌడీలపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-02-12T13:27:14+05:30 IST

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకుని 21 వేల మంది రౌడీలపై పోలీస్ శాఖ డేగకన్నుతో నిఘావేసింది. అంతేగాక వారి వ్యవహారశైలి ఏమాత్రం అనుమానాస్పదంగా వున్నా తక్షణం అరెస్టు

రౌడీలపై ఉక్కుపాదం

- నిర్భయంగా ఓటేయాలంటూ పోలీసుల పిలుపు

- రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కవాతు


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకుని 21 వేల మంది రౌడీలపై పోలీస్ శాఖ డేగకన్నుతో నిఘావేసింది. అంతేగాక వారి వ్యవహారశైలి ఏమాత్రం అనుమానాస్పదంగా వున్నా తక్షణం అరెస్టు చేసేందుకు సిద్ధమైంది. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల మంది పోలీసుల జాబితాను సిద్ధం చేసింది. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ అన్ని జిల్లాల్లో శుక్రవారం ఎస్పీల నేతృత్వం లో కవాతు నిర్వహించారు. ముఖ్యంగా, రౌడీల ఆగడాలను అడ్డుకొనేందుకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ నెల 19న మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, పోలీసు శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కేసులు, నేరాల ఆధారంగా అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లకు, ఎస్పీలకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా చెన్నై నగరంలో 5 వేల మందికి పైగా రౌడీలు, ఆ తరువాత స్థానంలో తిరునల్వేలి, మదురై, కన్నియాకుమారి జిల్లాలను గుర్తించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు భద్రత, సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు. తొలివిడతగా రౌడీ ముఠాల నేతలపై గూండా చట్టం ప్రయోగించి అరెస్ట్‌ చేయడం, హత్య, హత్యాయత్నం, దౌర్జన్యం తదితర విధ్వంస చర్యలకు పాల్పడే రౌడీల అరెస్టుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బెయిలుపై విడుదలైన పాత నేరస్తులు సుమారు 18 వేల మంది దినచర్యలను పర్యవేక్షించి సెక్షన్‌ 107, 109, 110ల కింద సత్ప్రవర్తన ధ్రువపత్రంలో సంతకాలు సేకరించాలని ఎస్పీలకు ఆదేశించారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందే రౌడీలు వారి సొంత జిల్లాలు వదలి వెళ్లాలని, ముఖ్యంగా తుపాకులు, ఇతర మారణాయుధాలతో రౌడీ మూకలు సంచరించకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తునట్లు ఉన్నత పోలీసు అధికారులు తెలిపారు.


పోలీసుల కవాతు....

ఎన్నికల భద్రత చర్యల్లో భాగంగా రాష్ట్ర పోలీసులు అవగాహన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణిలో జిల్లా ఎస్పీ వరుణ్‌ కుమార్‌ ప్రారంభించిన ఈ అవగాహన ప్రచారం తిరుత్తణి-చిత్తూరు రోడ్డు మీదుగా అరక్కోణం రోడ్డు, మాపూసి రోడ్డు, మేట్టు వీధి, ఆర్ముగస్వామి ఆలయ వీధి తదితర నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ వరుణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 19న జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు తమ శాఖ అన్నిరకాల భద్రతా చర్యలు సన్నద్ధం చేసిందన్నారు. ఈ ప్రచారంలో తిరుత్తణి ఏఎస్పీ సాయిప్రణీత్‌, డీఎస్పీలు రీతుకల్పనాదత్‌, హనుమంత్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పెరంబూర్‌ నియోజకవర్గ పరిధిలోని పులియాంతోపు, ఓటేరి, బేసిన్‌బ్రిడ్జి, వ్యాసర్పాడి, మహాకవి భారతి నగర్‌, కొడుంగైయూర్‌, తిరువిక నగర్‌, పెరువళ్లూర్‌, వీనస్‌ సహా అన్ని వార్డుల్లో కవాతు నిర్వహించారు. పులియాంతోపు అసిస్టెంట్‌ కమిషన్‌ ఈశ్వరన్‌ సహా సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-12T13:27:14+05:30 IST