తల్లడిల్లుతున్న తల్లులు

ABN , First Publish Date - 2021-12-18T06:16:26+05:30 IST

భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ఎనిమిదిమంది బాలింతలకు శస్త్ర చికిత్స అనంతరం వేసినకుట్లు వికటించాయి. ఓవైపు బిడ్డపుట్టిన ఆనందం, మరోవైపు కుట్లు వికటించి తల్లడిల్లుతున్న తల్లుల దీనస్థితి శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

తల్లడిల్లుతున్న తల్లులు
జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు

వికటించిన శస్త్రచికిత్స కుట్లు 

ఆందోళనలో ఎనిమిది మంది బాలింతలు 

స్టెరిలైజేషన్‌ లోపమే కారణమంటున్న ఇతర వైద్యులు 


భువనగిరిటౌన్‌, డిసెంబరు 17: భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ఎనిమిదిమంది బాలింతలకు శస్త్ర చికిత్స అనంతరం వేసినకుట్లు వికటించాయి. ఓవైపు బిడ్డపుట్టిన ఆనందం, మరోవైపు కుట్లు వికటించి తల్లడిల్లుతున్న తల్లుల దీనస్థితి శుక్రవారం వెలుగులోకి వచ్చింది. జిల్లాకేంద్ర ఆసుపత్రిలో ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు గర్భిణులకు ఆసుపత్రి వైద్యులు చేసిన ప్రసవ శస్త్ర చికిత్సలు చేయగా; అందులో ఎనిమిది మంది బాలింతలకు వేసిన కుట్లు మాన లేదు. శస్త్ర చికిత్స నిర్వహించిన అనంతరం 7నుంచి 10లోపు కుట్లు వేస్తారు. శస్త్ర చికిత్స జరిగిన 6, 7 రోజుల అనంతరం విప్పి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. ప్రతీరోజు కుట్ల వద్ద శుభ్రంచేసి మానని కుట్లు ఉంటే ప్రత్యేక చికిత్స అందిస్తారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది బాలింతల కుట్లు పలు కారణాలతో మానలేదు. అందులో ఇద్దరికి రెండు కుట్లు పూర్తిగా మానగా మిగతా కుట్ల నుంచి చీము రావడంతో వైద్య చికిత్సలు చేశారు. మరో ఇద్దరు బాలింతలు మెరుగైన వైద్యంకోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు. నలుగురు బాలింతల పరిస్థితి కూడా అలాగే ఉండగా గురు, శుక్రవారాల్లో వారి మొత్తం కుట్లు పూర్తిగా తెగి కడుపు పొరలు విచ్చుకున్నాయి. దీంతో ఆందోళనకు గురైన బాలింతలు, బంధువులు ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో శుక్రవారం వాగ్వాదానికి దిగగా, విషయంలో వెలుగులోకి వచ్చింది. కుట్లు విచ్చుకున్న చోట కడుపు లోపలి పొర పూర్తిగా మానిందని, పై పొరలు మాత్రమే మానలేదని, ఇన్‌ఫెక్షన్‌ తగ్గాక తిరిగి కుట్లు వే స్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. 


స్టెరిలైజేషన్‌ లోపమే  కారణమా?

బాలింతల కుట్లు మానకపోవడానికి స్టెరిలైజేషన్‌ లోపమే కారణమని పలువురు వైద్యులు చెబుతున్నారు. శస్త్ర చికిత్స చేసేముందు ఆపరేషన్‌ థియేటర్‌, పడకలు, వైద్యులు, సిబ్బంది వేసుకునే దుస్తులు సహా పరికరాలన్నింటినీ స్టెరిలైజేషన్‌ చేయాల్సి ఉంటుంది. జిల్లా ఆసుపత్రిలో స్టెరిలైజేషన్‌ విధానాలను వైద్యులు విస్మరించడంతోనే బాలింతల కడుపు కుట్లు విచ్చుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. 


బాధితులను పరామర్శించిన కలెక్టర్‌

బాలింతలను కలెక్టర్‌ పమేలాసత్పథి శుక్రవారం పరామర్శించారు. కుట్లు తెగడానికి కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆందోళనకు అవసరం లేదని, కుట్లు అతుక్కునేవరకు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించారు.


ఇతరులతో సోకిన ఇన్‌ఫెక్షనే కారణం : డాక్టర్‌ చిన్నా నాయక్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌  

రోగుల బంధువులు వార్డుల్లోకి స్వేచ్ఛగా వస్తున్న కారణంగా బాలింతలు ఇన్‌ఫెక్షన్‌కు గురై శస్త్ర చికిత్సకుట్లు మానలేదు. కుట్లు తెగినప్పటికీ బాలింతల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పులేదు. ప్రస్తుతానికి వారు క్షేమంగాఉన్నారు. పూర్తిగా నయం అయ్యాకే వారిని డిశ్చార్జీ చేస్తాం.  


Updated Date - 2021-12-18T06:16:26+05:30 IST