ముంబై నరమేధాన్ని మరిచిపోం

ABN , First Publish Date - 2021-11-27T07:29:48+05:30 IST

ఉగ్రవాదంపై నేటి భారతం నూతన విధానంతో, కొత్త పద్ధతులతో పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2008 నవంబరు 26న ముంబైలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన....

ముంబై నరమేధాన్ని మరిచిపోం

ఉగ్రవాదంపై నేటి భారత పోరాటం కొత్తది: మోదీ.. 

26/11 మృతులకు ప్రధాని నివాళి

అమరులకు ఎప్పుడూ రుణపడి ఉంటాం: కోవింద్‌

మృతులకు దేశవ్యాప్తంగా ప్రముఖుల నివాళి


న్యూఢిల్లీ/ముంబై, నవంబరు 26: ఉగ్రవాదంపై నేటి భారతం నూతన విధానంతో, కొత్త పద్ధతులతో పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2008 నవంబరు 26న ముంబైలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులను దేశం మరిచిపోదని ఆయన పేర్కొన్నారు. 26/11 దాడులు జరిగి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలు, భద్రతా సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడిన ఓ వీడియోను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘‘ముంబై దాడిలో మృతి చెందిన వారందరికీ నా నివాళులు. ఈ దాడిలో అమరులైన పోలీసులకూ అంజలి ఘటిస్తున్నాను’’ అని మోదీ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడిపై దర్యాప్తును వేగవంతం చేయాలని పాకిస్థాన్‌ను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) కోరింది. ‘‘15 దేశాలకు చెందిన 166 మంది ఈ ఘోరమైన దాడిలో ప్రాణాలు కోల్పోయారు.


పాక్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదు. దోషులను శిక్షించడంలో పాక్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు’’ అని ఎంఈఏ వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులతో పోరాడుతూ అమరులైన భద్రతా సిబ్బందికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. దక్షిణ ముంబైలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారి, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, రాష్ట్ర హోం మంత్రి దిలిప్‌ వాల్సే పాటిల్‌ నివాళి అర్పించారు. 26/11 దాడులు ఉగ్రవాదుల పిరికి మనస్తత్వానికి నిదర్శనమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ట్వీట్‌ చేశారు.  


ఆ ఘోరం ఇంకా కళ్ల ముందే: అమితాబ్‌

26/11 తాలూకు ఘటనలను తలచుకుంటే ఇంకా కళ్ల ముందే ఉన్నట్లు ఉందని బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు. ముంబై ఉగ్రదాడులు జరిగి 13 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ కు ఆయన ఓ వ్యాసం రాశారు. ‘‘ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత సైన్యం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినా నాటి ప్రభుత్వం ఆ ఒత్తిడికి తలొగ్గలేదు. ఆ సమయంలో దేశమంతా అద్భుతమైన సంయమనాన్ని పాటించింది. మన సంఘీభావాన్ని, ఐక్యమత్యాన్ని దెబ్బతీసే ఏ అవకాశాన్నీ ఉగ్రవాదులకు ఇవ్వరాదు’’ అని అమితాబ్‌ పేర్కొన్నారు. నాటి నరమేధాన్ని తలచుకొంటూ ఇజ్రాయెల్‌లో భారతీయులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. 26/11 దాడుల సూత్రధారులను శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-11-27T07:29:48+05:30 IST