చివర్లో రెచ్చిపోయిన ఆర్సీబీ.. ముంబై ఎదుట భారీ విజయ లక్ష్యం

ABN , First Publish Date - 2020-09-29T02:52:23+05:30 IST

ఈ సీజన్‌లో తొలిసారి బెంగళూరు జట్టు అదరగొట్టేలా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ కోహ్లీ ఘోరంగా విఫలమైనా దేవదత్ పడిక్కల్, అరోన్ ఫించ్,

చివర్లో రెచ్చిపోయిన ఆర్సీబీ.. ముంబై ఎదుట భారీ విజయ లక్ష్యం

దుబాయ్: ఈ సీజన్‌లో తొలిసారి బెంగళూరు జట్టు అదరగొట్టేలా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ కోహ్లీ ఘోరంగా విఫలమైనా దేవదత్ పడిక్కల్, అరోన్ ఫించ్, డివిలియర్స్, శివం దూబేలు తమలోని పూర్తిస్థాయి సామర్థ్యాన్ని వెలికి తీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన బెంగళూరు 201 పరుగులు చేసింది.


టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించింది. ఓపెనర్ అరోన్ ఫించ్ క్రీజులో ఉన్నంత సేపూ అదరగొట్టాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేసిన ఫించ్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని మూడు పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రోహిత్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మరోమారు బ్యాట్ ఝళిపించాడు. డివిలియర్స్‌తో కలిపి సమయోచితంగా ఆడుతూ స్కోరు పెంచుతూ పోయాడు. ఈ క్రమంలో 54 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద అవుటయ్యాడు. మూడు మ్యాచుల్లో పడిక్కల్‌కు ఇది రెండో అర్ధ సెంచరీ కావడం గమనార్హం. 


ఇక ఆ తర్వాత మ్యాచ్‌లో అసలు షో మొదలైంది. డివిలియర్స్ బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరు జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టింది. చివర్లో అద్వితీయమైన షాట్లతో అలరించాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లో 55 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించాడు. మరోవైపు శివం దూబే కూడా మెరుపులు మెరిపించాడు. 10 బంతుల్లో మూడు సిక్సర్లు, ఫోర్‌తో 27 పరుగులు చేయడంతో ప్రత్యర్థి ముంబై ఎదుట ఆర్సీబీ 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ముంబై బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టగా, చాహర్‌కు ఓ వికెట్ దక్కింది.

Updated Date - 2020-09-29T02:52:23+05:30 IST