అత్యాచారం కేసుపై ఫాస్ట్ ట్రాక్ విచారణ: థాకరే

ABN , First Publish Date - 2021-09-11T22:03:30+05:30 IST

సబర్బన్ సకినాక ప్రాంతంలో అత్యాచారానికి గురైన 34 ఏళ్ల యువతి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..

అత్యాచారం కేసుపై ఫాస్ట్ ట్రాక్ విచారణ: థాకరే

ముంబై: సబర్బన్ సకినాక ప్రాంతంలో అత్యాచారానికి గురైన 34 ఏళ్ల యువతి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూసింది. ఈ అమానుష ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకు ఉద్ధవ్ థాకరే సర్కార్ ఆదేశించింది. అత్యాచారంతో పాటు ఇనుప రాడ్డుతో శరీరంలోని ప్రైవేటు భాగాలపై బాధితురాలిపై దాడి చేసిన అగంతకులు సకనాకలో రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన వాహనంలో ఆమెను వదిలేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి 45 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.


ముంబైలో జరిగిన ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని, ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించి ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. తద్వారా బాధితురాలికి న్యాయం చేస్తామని అన్నారు. హోం మంత్రి దిలీప్ వాల్షే పటేల్, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలేతో తాను ఈ విషయమై చర్చించానని, కేసును త్వరిగతిని విచారించాలని ఆదేశించానని చెప్పారు. కాగా, ముంబైలో జరిగిన అత్యాచార ఘటనకు కారకులైన నిందితులను ఉరిశిక్ష విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మహిళా భద్రత విషయంలో శివసేన సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఎస్సీ-ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టం తరహాలోనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చి మహిళలపై దాడికి తెగబడే వారికి అంత సులువుగా బెయిల్ దొరక్కుండా చేయాలని బీజేపీ ఉపాధ్యక్షుడు చిత్ర వాఘ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-09-11T22:03:30+05:30 IST