సూపరో సూపర్

ABN , First Publish Date - 2020-10-19T08:42:19+05:30 IST

ఐపీఎల్‌లో సూపర్‌ సండే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.. నరాలు తెగే ఉత్కంఠతో మునివేళ్ల మీద నిలబెట్టింది.

సూపరో సూపర్

ముంబైకి చెక్‌

డబుల్‌ సూపర్‌ ఓవర్‌లో పంజాబ్‌ విజయం


ఐపీఎల్‌లో సూపర్‌ సండే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.. నరాలు తెగే ఉత్కంఠతో మునివేళ్ల మీద నిలబెట్టింది. ఒకే రోజు జరిగిన రెండు మ్యాచ్‌లూ సూపర్‌ ఓవర్‌కు వెళ్లడం అనూహ్యమైతే, ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు సూపర్‌ ఓవర్లు జరిగిన అత్యంత అరుదైన ఘటన లీగ్‌ చరిత్రలో తొలిసారి చోటు చేసుకుంది. ముంబై, పంజాబ్‌ మ్యాచ్‌లో స్కోర్లు ‘టై’కాగా.. సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. అందులోనూ స్కోర్లు ‘టె’ౖకావడంతో.. ఫలితాన్ని నిర్ణయించడానికి మరోసారి సూపర్‌ ఓవర్‌ ఆడించాల్సి వచ్చింది. కోల్‌కతా, హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ కూడా సూపర్‌ ఓవర్‌కు వెళ్లినా.. ఏకపక్షంగా ముగిసింది. 


దుబాయ్‌: వాట్‌ ఎ మ్యాచ్‌.. రెండు జట్ల స్కోర్లు సమం కావడమే అరుదైతే.. ఏకంగా సూపర్‌ ఓవర్‌ కూడా మరో సూపర్‌ ఓవర్‌కు దారి తీస్తే ఆ పోరాటాన్ని ఏమని వర్ణించగలం.. ముంబై-పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి అరుదైన సన్నివేశమే ఆవిష్కృతమైంది. ముందుగా ఇరు జట్లు 176 పరుగులు చేయగా ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌లోనూ ఐదు పరుగులే చేశాయి. దీంతో ఫలితం కోసం మరోసారి ‘సూపర్‌’కు వెళ్లగా చివరకు గేల్‌, మయాంక్‌ హిట్టింగ్‌తో పంజాబ్‌ గెలిచి ఊపిరి పీల్చుకుంది. దీంతో ఈ సీజన్‌లో రెండో సారి కూడా సూపర్‌ ఓవర్‌లో ముంబై ఓడినట్టయింది.  ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. డికాక్‌ (53) ఈ సీజన్‌లో వరుసగా మూడో అర్ధసెంచరీ సాధించగా చివర్లో పొలార్డ్‌ (34 నాటౌట్‌), కల్టర్‌నైల్‌ (24 నాటౌట్‌) వేగంగా ఆడారు. షమి, అర్ష్‌దీ్‌పలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పంజాబ్‌ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులే చేసింది. రాహుల్‌ (77) అర్ధసెంచరీ సాధించాడు. బుమ్రాకు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాహుల్‌ నిలిచాడు.


రాహుల్‌ ఒక్కడే..:

ఛేదనలో పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ మూడో ఓవర్‌లోనే 4,4,6,4తో విరుచుకుపడగా 20 పరుగులు వచ్చాయి. అయితే నాలుగో ఓవర్‌లో మయాంక్‌ (11)ను బుమ్రా అవుట్‌ చేసి ఝలక్‌ ఇచ్చాడు. అటు గేల్‌ (24) నిరాశపర్చినా పూరన్‌ (24) మాత్రం ఉన్నంత సేపు ధనాధన్‌ ఆటను ప్రదర్శించాడు. తనని కూడా బుమ్రానే పెవిలియన్‌కు చేర్చగా.. మ్యాక్స్‌వెల్‌ డకౌట్‌ అయ్యాడు. అటు వికెట్లు పడుతున్నా రాహుల్‌ మాత్రం కసిగా ఆడుతూ ఓ సిక్సర్‌తో 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే 15 బంతుల్లో 24 పరుగులు కావాల్సిన దశలో బుమ్రా యార్కర్‌కు రాహుల్‌ బౌల్డ్‌ కావడంతో పంజాబ్‌కు షాక్‌ తగిలింది.


ఆఖరి బంతికి టై:

రాహుల్‌ నిష్క్రమణ తర్వాత అంతా అయుపోయినట్టే అనిపించినా దీపక్‌ హూడా, జోర్డాన్‌ మాత్రం పోరాటం ఆపలేదు. వీరి జోరుతో పంజాబ్‌ లక్ష్యం ఆఖరి ఓవర్‌లో 9 రన్స్‌కు తగ్గింది. తొలి బంతికే మరోసారి హూడాకు లైఫ్‌ లభించగా జోర్డాన్‌ ఓ ఫోర్‌తో మ్యాచ్‌పై ఆశలు రేపాడు. అయితే ఆఖరి బంతికి జోర్డాన్‌ రనౌట్‌ అవడంతో మ్యాచ్‌ టై అయ్యింది.


డికాక్‌ పోరాటం:

వరుస విజయాలతో ఉన్న ముంబై టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌ ఎంచుకున్నా.. పంజాబ్‌ బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. కానీ డెత్‌ ఓవర్లలో పొలార్డ్‌ బాదుడుకు పట్టు కోల్పోయారు. ఇక ఎప్పటిలాగే డికాక్‌ హ్యాట్రిక్‌ అర్ధసెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వరుస విరామాల్లో రోహిత్‌ (9), సూర్యకుమార్‌ (0), ఇషాన్‌ (7) వికెట్లను కోల్పోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 43/3తో కష్టాల్లో పడింది.


ఈ దశలో పంజాబ్‌ దూకుడును అడ్డుకున్న డికాక్‌కు క్రునాల్‌ (34) సహకరించాడు. చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ వీరు నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. 14వ ఓవర్‌లో క్రునాల్‌ను స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అవుట్‌ చేయగా నాలుగో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు హార్దిక్‌ (8) తొలి బంతినే సిక్సర్‌గా మలిచినా నాలుగు బంతులకే పరిమితమయ్యాడు. 15వ ఓవర్‌లో డికాక్‌ వరుసగా 4,6 బాదగా 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ కాసేపటికే పేసర్‌ జోర్డాన్‌ అతడి జోరుకు ముగింపు పలికాడు.


18 బంతుల్లో 54: 17 ఓవర్లలో ముంబై స్కోరు 119/6. పొలార్డ్‌ మినహా మరే చెప్పుకోతగ్గా బ్యాట్స్‌మెన్‌ లేకపోవడంతో స్కోరు 150 కూడా కష్టమే అనిపించింది. కానీ చివరి మూడు ఓవర్లలో కీరన్‌ బాదుడుకు కల్టర్‌నైల్‌ నుంచి కూడా సహకారం లభించింది. 18వ ఓవర్‌లో పొలార్డ్‌ రెండు సిక్సర్లు, కల్టర్‌నైల్‌ రెండు ఫోర్లతో జట్టు 22 పరుగులు రాబట్టింది. మరుసటి ఓవర్‌లో కల్టర్‌నైల్‌ రెండు ఫోర్లతో 12 రన్స్‌ సాధించగా ఆఖరి ఓవర్‌లో పొలార్డ్‌ రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 20 రన్స్‌ పిండుకున్న ముంబై ఈ పిచ్‌పై పటిష్ఠ స్కోరునే సాధించింది.


ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ (బి) అర్ష్‌దీప్‌ సింగ్‌ 9; డికాక్‌ (సి) మయాంక్‌ (బి) జోర్డాన్‌ 53; సూర్యకుమార్‌ (సి) ఎం.అశ్విన్‌ (బి) షమి 0; ఇషాన్‌ (సి) ఎం.అశ్విన్‌ (బి) అర్ష్‌దీప్‌ సింగ్‌ 7; క్రునాల్‌ (సి) హూడా (బి) బిష్ణోయ్‌ 34; హార్దిక్‌ (సి) పూరన్‌ (బి) షమి 8; పొలార్డ్‌ (నాటౌట్‌) 34; కల్టర్‌నైల్‌ (నాటౌట్‌) 24; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 176/6; వికెట్ల పతనం: 1-23, 2-24, 3-38, 4-96, 5-116, 6-119; బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 4-0-24-0; షమి 4-0-30-2; అర్ష్‌దీప్‌ సింగ్‌ 3-0-35-2; జోర్డాన్‌ 3-0-32-1; ఎం.అశ్విన్‌ 3-0-28-0; హుడా 1-0-9-0; రవి బిష్ణోయ్‌ 2-0-12-1.


కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (బి) బుమ్రా 77; మయాంక్‌ (బి) బుమ్రా 11; క్రిస్‌ గేల్‌ (సి) బౌల్ట్‌ (బి) చాహర్‌ 24; పూరన్‌ (సి) కల్టర్‌నైల్‌ (బి) బుమ్రా 24; మ్యాక్స్‌వెల్‌ (సి) శర్మ (బి) చాహర్‌ 0; దీపక్‌ హుడా (నాటౌట్‌) 23; జోర్డాన్‌ (రనౌట్‌/పొలార్డ్‌/డికాక్‌) 13; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 176/6; వికెట్ల పతనం: 1-33, 2-75, 3-108, 4-115, 5-153, 6-176; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-48-0; క్రునాల్‌ 2-0-12-0; బుమ్రా 4-0-24-3; కల్టర్‌నైల్‌ 4-0-33-0; పొలార్డ్‌ 2-0-26-0; రాహుల్‌ చాహర్‌ 4-0-33-2. 

Updated Date - 2020-10-19T08:42:19+05:30 IST