కొనసాగుతున్న ముంబై హవా.. ఢిల్లీ చిత్తు

ABN , First Publish Date - 2020-11-01T00:14:15+05:30 IST

ప్లే ఆఫ్స్‌ మెట్టు ఎక్కాలంటే తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ చతికిల పడింది. ముంబై ఇండియన్స్ చేతిలో దారుణ పరాజయాన్ని చవి చూసింది.

కొనసాగుతున్న ముంబై హవా.. ఢిల్లీ చిత్తు

దుబాయ్: ప్లే ఆఫ్స్‌ మెట్టు ఎక్కాలంటే తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ చతికిల పడింది. ముంబై ఇండియన్స్ చేతిలో దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన ముంబై 18 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థి ముంబై ఎదుట స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. 


111 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇన్నింగ్స్ ఆడుతూ పాడుతూ సాగింది. లక్ష్యం చిన్నది కావడంతో బ్యాట్స్‌మెన్ తొలుత అనవసర షాట్లకు పోకుండా నిదానంగా ఆడుతూ, తర్వాత చెలరేగిపోయారు.  ఓపెనర్ ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 8 ఫోర్లు,3 సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు. క్వింటన్ డికాక్ 26 పరుగులు చేసి అవుట్ కాగా, సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు చేశాడు. ఫలితంగా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 14.2 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.


అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ ఇన్నింగ్స్ మొత్తం పేలవంగా సాగింది. ముంబై బౌలర్ల దెబ్బకు పరుగులు రావడం గగనం కాగా, తొలి ఓవర్‌లో శిఖర్ ధవన్ (0) అవుట్‌తో మొదలైన వికెట్ల పతనం చివరి వరకు కొనసాగింది. ఢిల్లీ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌దే. 29 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు. ఆ తర్వాత పంత్ 21 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. ఫలితంగా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగుల వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది.

Updated Date - 2020-11-01T00:14:15+05:30 IST