Abn logo
Sep 19 2021 @ 17:24PM

Gautam Gambhir: ముంబై ఇండియన్స్‌కే చాన్స్

న్యూఢిల్లీ: కరోనా కారణంగా భారత్‌లో అర్ధంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో దశ నేటి నుంచి యూఏఈలో ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ముంబై ఇండియన్స్ అని ఠక్కున చెప్పాడు. ఆ జట్టుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. గతేడాది అక్కడే టైటిల్ గెలుచుకోవడం, ఇప్పుడు కూడా మళ్లీ అక్కడే మ్యాచ్‌లు జరుగుతుండడంతో ముంబైకి మరో మారు కప్పు కొట్టే చాన్స్ లభించిందన్నాడు.  


నిజానికి ముంబై ఇండియన్స్ విజయవంతమైన జట్టు అని కొనియాడాడు. ఐపీఎల్ రెండో దశలో ఆ జట్టు ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గంభీర్ అభిప్రాయపడ్డాడు. తొలి దశలో ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి నాలుగో స్థానంలో ఉన్న రోహిత్ సేన.. పార్ట్-2లో లీగ్ దశను రెండో స్థానంతో ముగిస్తుందన్నాడు.


యూఏఈలో కప్పు కొట్టిన అనుభవం ముంబై సొంతమని పేర్కొన్న గంభీర్.. మళ్లీ ఇప్పుడు అక్కడే మ్యాచ్‌లు జరుతుండడంతో దానిని ముంబై అవకాశంగా మలచుకుంటుందని పేర్కొన్నాడు. తనను అడిగితే కనుక కోల్‌కతా (కేకేఆర్), హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) లేదంటే పంజాబ్ వంటి జట్లకు మాత్రం చాలా కష్టమని వివరించాడు. ఒక్క ముంబై ఇండియన్స్‌కు మాత్రమే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గంభీర్ స్పష్టం చేశాడు.