ముంబై పాంచ్‌ పటాకా

ABN , First Publish Date - 2020-10-17T08:56:04+05:30 IST

కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బౌలర్లు..

ముంబై పాంచ్‌ పటాకా

ప్రత్యర్థి ఎవరైనా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ విజయమే లక్ష్యంగా సాగిపోతోంది. వరుసగా ఐదు విజయాలతో హోరెత్తిస్తూ తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ముందుగా బౌలర్లు కోల్‌కతాను కట్టడి చేయగా.. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ ఆడుతూ, పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు. డికాక్‌ ఫామ్‌ను చాటుకుంటూ మరో అర్ధసెంచరీతో మెరిశాడు. మరోవైపు కెప్టెన్‌ మారినా కేకేఆర్‌ రాత మాత్రం మారలేదు. వరుసగా రెండో పరాజయంతో డీలా పడింది.


డికాక్‌ అర్ధసెంచరీ

కోల్‌కతా ఓటమి

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బౌలర్లు.. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో రోహిత్‌ సేన 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. డికాక్‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కేకేఆర్‌పై చివరి 12 మ్యాచ్‌ల్లో ముంబైకిది 11వ గెలుపు కావడం విశేషం. అలాగే ఈ విజయంతో తిరిగి ముంబై 12 పాయింట్లతో టాప్‌నకు చేరింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్‌లో తొలిసారి ప్యాట్‌ కమిన్స్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్‌) అర్ధసెంచరీ సాధించగా కెప్టెన్‌ మోర్గాన్‌ (29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్‌) సహకారం అందించాడు. రాహుల్‌ చాహర్‌ (2/18) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఆ తర్వాత ఛేదనలో ముంబై 16.5 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి గెలిచింది. రోహిత్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35), హార్దిక్‌ (11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 21 నాటౌట్‌) రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డికాక్‌ నిలిచాడు.

ఆడుతూ.. పాడుతూ: స్వల్ప లక్ష్య ఛేదనను ముంబై ఇండియన్స్‌ ఎలాంటి తడబాటు లేకుండా ముగించింది.  తొలి బంతినే ఫోర్‌గా మలిచిన కెప్టెన్‌ రోహిత్‌.. ఆ తర్వాత మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదడంతో తొలి 18 బంతుల్లోనే జట్టు స్కోరు 30 పరుగులకు చేరింది. అటు డికాక్‌ కూడా వరుస ఫోర్లతో చెలరేగడంతో ఈ సీజన్‌లో ముంబై జట్టు తమ పవర్‌ప్లేలో 50+ స్కోరును సాధించడంతో పాటు ఒక్క వికెట్‌ను కూడా కోల్పోలేదు. ఆ తర్వాత ఏడో ఓవర్‌లో డికాక్‌ 4,6,4తో మరింత జోరు పెంచాడు. రస్సెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో మరో 4,6 బాది 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అటు చక్కగా సహకరించిన రోహిత్‌ను 11వ ఓవర్‌లో శివమ్‌ మావి అవుట్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (10) ఈసారి నిరాశపరిచినా డికాక్‌ మాత్రం ధాటిని కొనసాగిస్తూ బౌండరీలతో లక్ష్యాన్ని వేగంగా తగ్గించాడు. ఇక 16వ ఓవర్‌లో హార్దిక్‌ 4,6,4తో కమిన్స్‌ను కుమ్మేయడంతో లక్ష్యం 4 ఓవర్లలో 8 పరుగులకు వచ్చింది. దీంతో మరో 19 బంతులుండగానే ముంబై విజయ లాంఛనం ముగించింది.

ఆదుకున్న కమిన్స్‌: టాస్‌ గెలిచిన కోల్‌కతా పరుగులు సాధించడమేమో కానీ చకచకా వికెట్లు మాత్రం చేజార్చుకుంది. కానీ ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ కమిన్స్‌ ఎదురుదాడికి దిగడంతో కేకేఆర్‌ కాస్త గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. అటు మోర్గాన్‌ చివరి వరకు క్రీజులో నిలిచినా అతడి బ్యాటింగ్‌లో ఊపు కనిపించలేదు. ఆరంభం నుంచే ముంబై బౌలర్లు పంజా విసరడంతో 42 పరుగులకే టాప్‌-4 ఆటగాళ్లు రాహుల్‌ త్రిపాఠి (7), నితీష్‌ రాణా (5), శుభ్‌మన్‌ గిల్‌ (21), దినేశ్‌ కార్తీక్‌ (4) పెవిలియన్‌లో కూర్చున్నారు. ఎనిమిదో ఓవర్‌లో గిల్‌, కార్తీక్‌ను స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ వరుస బంతుల్లో అవుట్‌ చేశాడు. ఇక అదే ఓవర్‌లో బరిలోకి దిగిన భారీ హిట్టర్‌ రస్సెల్‌ (12) ఓ సిక్స్‌, ఓ ఫోర్‌కు మాత్రమే పరిమితమై బుమ్రా బౌన్సర్‌కు దొరికిపోయాడు. ఈ కష్టకాలంలో జట్టుకు నయా కెప్టెన్‌ మోర్గాన్‌, కమిన్స్‌ అండగా నిలిచారు.అయితే మోర్గాన్‌ ఆచితూచి ఆడినా కమిన్స్‌ మాత్రం బ్యాట్‌ ఝుళిపించాడు. 13వ ఓవర్‌లో తను వరుసగా 6,4తో 16 పరుగులు సాధించాడు. కానీ ఆ తర్వాత మూడు ఓవర్లపాటు కోల్‌కతా పరుగుల కోసం ఇబ్బందిపడింది. 17వ ఓవర్‌లో కమిన్స్‌ ఫోర్‌తోనే జట్టు వంద పరుగులు దాటింది. 19వ ఓవర్‌లో మరో సిక్స్‌, ఫోర్‌తో స్కోరు పెంచే ప్రయత్నం చేస్తూ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. అయితే ఆఖరి ఓవర్‌లో కమిన్స్‌ ఫోర్‌.. మోర్గాన్‌ రెండు సిక్సర్లతో 21 పరుగులు రాబట్టారు. ఈ జోడీ మధ్య ఆరో వికెట్‌కు అజేయంగా 87 పరుగులు వచ్చాయి. 


స్కోరు బోర్డు

కోల్‌కతా: రాహుల్‌ త్రిపాఠి (సి) సూర్యకుమార్‌ (బి) బౌల్ట్‌ 7; శుభ్‌మన్‌ గిల్‌ (సి) పొలార్డ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 21; నితీష్‌ రాణా (సి) డికాక్‌ (బి) కల్టర్‌నైల్‌ 5; దినేశ్‌ కార్తీక్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 4; మోర్గాన్‌ (నాటౌట్‌) 39; రస్సెల్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 12; కమిన్స్‌ (నాటౌట్‌) 53; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 148/5; వికెట్ల పతనం: 1-18, 2-33, 3-42, 4-42, 5-61; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-32-1; కల్టర్‌నైల్‌ 4-0-51-1; బుమ్రా 4-0-22-1; క్రునాల్‌ 4-0-23-0; రాహుల్‌ చాహర్‌ 4-0-18-2.

ముంబై: రోహిత్‌ శర్మ (సి) కార్తీక్‌ (బి) శివమ్‌ మావి 35; డికాక్‌ (నాటౌట్‌) 78; సూర్యకుమార్‌ (బి) వరుణ్‌ 10; హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 16.5 ఓవర్లలో 149/2; వికెట్ల పతనం: 1-94, 2-111; బౌలింగ్‌: గ్రీన్‌ 2.5-0-24-0; కమిన్స్‌ 3-0-28-0; ప్రసిద్ధ్‌ కృష్ణ 2-0-30-0; రస్సెల్‌ 2-0-15-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-23-1; శివమ్‌ మావి 3-0-24-1.

Updated Date - 2020-10-17T08:56:04+05:30 IST