ముంబై అదుర్స్‌

ABN , First Publish Date - 2020-10-05T08:37:13+05:30 IST

ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది.

ముంబై అదుర్స్‌

డికాక్‌ అర్ధ శతకం

సన్‌రైజర్స్‌ ఓటమి 

వార్నర్‌ పోరాటం వృథా


షార్జా: ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 34 పరుగుల తేడాతో గెలిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. డికాక్‌ (39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) అర్ధ శతకంతో ఫామ్‌లోకి వచ్చాడు. సందీప్‌, సిద్దార్థ్‌ కౌల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేదనలో హైదరాబాద్‌ ఓవర్లన్నీ ఆడి 174/7 స్కోరు చేసి ఓడింది. వార్నర్‌ (44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) హాఫ్‌ సెంచరీ వృథా అయింది. బౌల్ట్‌, ప్యాటిన్సన్‌, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. బౌల్ట్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 


మిడిలార్డర్‌ ఫెయిల్‌: ఛేదనను సన్‌రైజర్స్‌ ధాటిగానే ఆరంభించినా మిడిలార్డర్‌ వైఫల్యం దెబ్బతీసింది. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతిని సిక్స్‌గా మలచిన ఓపెనర్‌ బెయిర్‌స్టో (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25) తర్వాతి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. అయితే, 5వ ఓవర్‌లో బౌల్ట్‌ బౌలింగ్‌లో బెయిర్‌స్టో భారీషాట్‌ ఆడే క్రమంలో హార్దిక్‌కు క్యాచ్‌గా చిక్కాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్‌ పాండే (30)  తన రెండో బంతిని బౌండ్రీకి తరలించాడు. ఇక, మరో ఓపెనర్‌ వార్నర్‌.. బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లు బాదడంతో సన్‌రైజర్స్‌ స్కోరు 50రన్స్‌ దాటింది. చాహర్‌ వేసిన 9వ ఓవర్‌లో పాండే, వార్నర్‌ చెరో సిక్స్‌ బాదడంతో 16 రన్స్‌ లభించాయి. ఇక, రెండో వికెట్‌కు 60 రన్స్‌ జతచేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ప్యాటిన్సన్‌ విడదీశాడు. పాండేను క్యాచ్‌ అవుట్‌ చేశాడు.


వార్నర్‌ మాత్రం ధాటిగా ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కేన్‌ విలియమ్సన్‌ (3)ను బౌల్ట్‌, ప్రియమ్‌ గార్గ్‌ (8)ను క్రునాల్‌ వెనక్కి పంపారు. 16వ ఓవర్‌లో మరోసారి బౌలింగ్‌కు దిగిన ప్యాటిన్సన్‌.. వార్నర్‌ను క్యాచ్‌ అవుట్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ ఓటమి ఖరారైంది. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా పెరిగి పోయింది. కొంతసేపు మెరుపులు మెరిపించిన సమద్‌ (20), అభిషేక్‌ (10)ను బుమ్రా 18వ ఓవర్‌లో అవుట్‌ చేశాడు. చివరి ఓవర్‌లో విజయానికి 37 రన్స్‌ చేయడం అసాధ్యమవడంతో.. రషీద్‌ (3 నాటౌ ట్‌) పెద్దగా షాట్లు ఆడే ప్రయత్నం చేయలేదు.


ఆఖర్లో పరుగుల వరద: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలోనే షాక్‌ తగిలింది. సిక్సర్‌తో ఖాతా తెరచిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (6) తర్వాతి బంతికే క్యాచ్‌ అవుటయ్యాడు. సందీప్‌ వేసిన వైడ్‌ బంతిని ఆడే క్రమంలో బంతి ఎడ్జ్‌ తీసుకోవడంతో కీపర్‌ బెయిర్‌స్టో క్యాచ్‌ అందుకున్నాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా.. సన్‌రైజర్స్‌ రివ్యూకు వెళ్లి పైచేయి సాధించింది. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌(27), మరో ఓపెనర్‌ డికాక్‌తో కలిసి స్కోరుబోర్డును నడిపించాడు. సిద్దార్థ్‌ వేసిన మూడో ఓవర్‌లో 4 ఫోర్లు బాదాడు. అయితే, తన తర్వాతి ఓవర్‌లో రెండు బౌండ్రీలతో జోరు ప్రదర్శించిన యాదవ్‌ను కౌల్‌ క్యాచ్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌(31) తోడుగా డికాక్‌ చెలరేగడంతో ముంబై 10ఓవర్లు ముగిసేసరికి 91/2 స్కోరుతో నిలిచింది. ఈ క్రమంలోనే విలియమ్సన్‌ వేసిన 12వ ఓవర్‌ 3వ బంతిని సిక్స్‌గా మలిచి డికాక్‌ అర్ధ శతకాన్ని అందుకున్నాడు. అయితే, డికాక్‌ను సెల్ఫ్‌ క్యాచ్‌తో అవుట్‌ చేసిన రషీద్‌.. మూడో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు.


సందీప్‌ బౌలింగ్‌లో పాండే అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ఇషాన్‌ వెనుదిరిగాడు. ఈ దశలో పవర్‌ హిట్టర్లు హార్దిక్‌ పాండ్యా (28), పొలార్డ్‌ (25 నాటౌట్‌) భారీషాట్లతో విరుచుకుపడడంతో చివరి 5 ఓవర్లలో ముంబై 59 రన్స్‌ రాబట్టింది. దూకుడు మీదున్న హార్దిక్‌ను కౌల్‌ బౌల్డ్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌లో క్రునాల్‌ పాండ్యా (4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20 నాటౌట్‌) దుమ్మురేపడంతో ముంబై స్కోరు 200 మార్క్‌ దాటింది. 


స్కోరు బోర్డు

ముంబై: రోహిత్‌ శర్మ (సి) బెయిర్‌స్టో (బి) సందీప్‌ 6, డికాక్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 67, సూర్యకుమార్‌ (సి) నటరాజన్‌ (బి) కౌల్‌ 27, ఇషాన్‌ కిషన్‌ (సి) పాండే (బి) సందీప్‌ 31, హార్దిక్‌ పాండ్యా (బి) కౌల్‌ 28, పొలార్డ్‌ (నాటౌట్‌) 25, క్రునాల్‌ పాండ్యా (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 208/5; వికెట్ల పతనం: 1-6, 2-48, 3-126, 4-147, 5-188; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-41-2, నటరాజన్‌ 4-0-29-0, సిద్దార్థ్‌ కౌల్‌ 4-0-64-2, అబ్దుల్‌ సమద్‌ 2-0-27-0, రషీద్‌ ఖాన్‌ 4-0-22-1, కేన్‌ విలియమ్సన్‌ 2-0-24-0.


హైదరాబాద్‌: వార్నర్‌ (సి) ఇషాన్‌ (బి) ప్యాటిన్సన్‌ 60, బెయిర్‌స్టో (సి) హార్దిక్‌ (బి) బౌల్ట్‌ 25, మనీష్‌ పాండే (సి) పొలార్డ్‌ (బి) ప్యాటిన్సన్‌ 30, కేన్‌ విలియమ్సన్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 3, ప్రియమ్‌ గార్గ్‌ (సి) చాహర్‌ (బి) క్రునాల్‌ 8, అభిషేక్‌ శర్మ (బి) బుమ్రా 10, అబ్దుల్‌ సమద్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 20, రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 3, సందీప్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 174/7; వికెట్ల పతనం: 1-34, 2-94, 3-116, 4-130, 5-142, 6-168, 7-172; బౌలింగ్‌: ట్రెంట్‌ బౌల్ట్‌ 4-0-28-2, జేమ్స్‌ ప్యాటిన్సన్‌ 4-0-29-2, క్రునాల్‌ పాండ్యా 4-0-35-1, బుమ్రా 4-0-41-2, పొలార్డ్‌ 3-0-20-0, రాహుల్‌ చాహర్‌ 1-0-16-0. 

Updated Date - 2020-10-05T08:37:13+05:30 IST