ఈ మహిళకు రూ. 1.8 కోట్ల పరిహారం.. ప్రతి మహిళా ఉద్యోగి తెలుసుకోవాల్సిన ఈమె కథేంటంటే..

ABN , First Publish Date - 2021-09-08T01:23:42+05:30 IST

మహిళా ఉద్యోగిపై వివక్ష చూపించిన రియల్ ఎస్టేట్ సంస్థకు భారీ షాక్..

ఈ మహిళకు రూ. 1.8 కోట్ల పరిహారం.. ప్రతి మహిళా ఉద్యోగి తెలుసుకోవాల్సిన ఈమె కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగులకూ కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని యాజమాన్యాలు విధిగా గౌరవించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సెలవుల మంజూరు చేయడం, మహిళలకు సౌకర్యంగా ఉండేలా పనివేళల నిర్ణయించడం వంటి అంశాల విషయంలో సంస్థలు ఎటువంటి వివక్షకూ తావివ్వకూడదు. ఓ మహిళా ఉద్యోగి పట్ల వివక్ష ప్రదర్శించిన రియల్ ఎస్టేట్ సంస్థకు తాజాగా దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆమెకు జరిగిన నష్టానికి పరిహారంగా సదరు సంస్థ భారీగా పరిహారం చెల్లించుకోవాల్సి వచ్చింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..


బ్రిటన్‌కు చెందని ఆలిస్ థామ్సన్.. మేఫెయిర్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేసేవారు. ఆమె ఆదాయం 1.20 లక్షల పౌండ్లు. ప్రతిరోజు ఆమె సాయంత్రం 6 గంటల వరకూ ఆఫీసులోనే ఉండాల్సి వచ్చేది. కాగా.. 2018లో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో ఆమె తన బిడ్డను క్రచ్‌లో చేర్పించారు. అయితే.. సాయంత్రం ఆరు వరకూ ఆఫీసులోనే ఉండాల్సి రావడంతో.. క్రచ్ నుంచి పాపను తీసుకురావడం ఆలిస్‌కు ఇబ్బందిగా మారింది. 

ఇవీ చదవండి:
ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యం.. ఏడేళ్ల తర్వాత సిటీలో ఉంటున్న ఆమె గురించి షాకింగ్ నిజాలు..!
కాసేపట్లో ఇంట్లో ఉంటా.. అంటూ ఫోన్లో భార్యకు చెప్పిన భర్త.. వర్షం వస్తోందని బస్టాప్‌లో ఆగడమే అతడి పొరపాటయింది..!


దీంతో..ఆమె కంపెనీ డైరెక్టర్ అయిన పాల్ సెల్లర్‌ను సంప్రదించారు. తనకు సౌలభ్యంగా ఉండేలా పనివేళల్లో మార్పులు చేయాలని కోరారు. వీలైతే పార్ట్‌టైంగా ఉద్యోగం చేసేందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే.. పాల్ దీన్ని నిరాకరించారు. ఆలిస్ అభ్యర్థనను అంగీకరించాలంటే.. వ్యవస్థలో పలు మార్పులు చేయాల్సి వస్తుందని, ఇది ఆర్థికంగా తమకు భారమవుతుందని పాల్ పేర్కొన్నారు. 


ఆలిస్.. అప్పటికే సంస్థలో తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. కింది స్థాయిలో ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. సంస్థతో ఇంత సుదీర్ఘ అనుబంధం ఉన్న తన అభ్యర్థనను పాల్ తిరస్కరించడం ఆలిస్‌ను మానసికంగా గాయపరించింది. ఓ తల్లిగా తన బాధ్యతను నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్న తనపై సంస్థ వివక్ష చూపిస్తోందని ఆలిస్ భావించారు. దీంతో.. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె న్యాయపోరాటం ప్రారంభించారు. స్త్రీ అయిన కారణంగానే తాను సంస్థలో వివక్ష ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆలిస్ ఉద్యోగుల ట్రిబ్యునల్‌లో కేసు వేశారు.


2019లో ఉద్యోగానికి రిజైన్ చేసిన అనంతరం ఆలిస్.. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా తాజాగా ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువడింది. సదరు కంపెనీ తన చర్యల ద్వారా ఆలిస్‌పై పరోక్షంగా వివక్ష ప్రదర్శించిందని పేర్కొన్న ట్రిబ్యునల్.. ఆమెకు 1.85 లక్షల పౌండ్లు(మన కరెన్సీలో 1.8 కోట్లు) పరిహారం చెల్లించాలంటూ తాజాగా తీర్పు వెలువరించింది. జీతభత్యాలు, పెన్షన్ రూపంలో ఇంతకాలంగా ఆలిస్ నష్టపోయిన సొమ్మును ఆమెకు తిరిగి చెల్లించాలని తీర్పిచ్చింది. 

Updated Date - 2021-09-08T01:23:42+05:30 IST