సమ్మక్క ఆగమనం నేడు

ABN , First Publish Date - 2022-02-17T16:44:38+05:30 IST

మేడారం: కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి రానుంది.

సమ్మక్క ఆగమనం నేడు

మేడారం: కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి రానుంది. ప్రభుత్వ లాంఛనాలతో సమ్మక్కను మేడారం గద్దెపైకి తీసుకవచ్చేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు గిరిజన పూజారులు, అధికారులు సంసిద్ధం అయ్యారు. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య తల్లిని తీసుకువస్తారు. ఆ సమయంలో ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కను ఆహ్వానిస్తారు. అమ్మ రాకతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది.


మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఉద్విగ్నభరితంగా సాగింది. వనదేవత సారలమ్మ బుధవారం రాత్రి 10.52 గంటలకు గద్దెపైకి చేరడంతో జాతర సంరంభం అంగరంగ వైభవంగా మొదలైంది. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి చేరడంతో కోలాహలం నెలకొంది. బిడ్డరాక వేళ భక్తిభావంతో భక్త జనం ఊగిపోయారు.  సాయంత్రం నుంచే సారలమ్మ రాక కోసం భక్తులు ఎదురుచూడడం మొదలు పెట్టారు.   ప్రధాన వడ్డె కాక సారయ్య, ఇతర వడ్డెలు సాయంత్రం 4గంటలకు కన్నెపల్లిలోని తల్లి ఆలయానికి చేరుకున్నారు.


ఆలయంలో పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం 7 గంటల 8 నిమిషాలకు సారలమ్మను ఆలయం నుంచి బయటకు తోడ్కోని వచ్చారు. కన్నెపల్లి నుంచి జంపన్నవాగు మీదుగా తీసుకొని మేడారంలోని గద్దెమీదికి రాత్రి 10.52 గంటలకు చేర్చారు. సారలమ్మను గద్దెమీద  ప్రతిష్టించే ముందు పూజా తంతును ఇతరులు చూడకుండా ఉండేందుకు లైట్లను బంద్‌ చేశారు. పున్నమి వెలుగుల్లో తల్లిని గద్దెపై కొలువు దీర్చారు. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా రాత్రి 10.55 గంటలకు గద్దెలపైకి వేంచేశారు. వీరి ఆగమనం కన్నుల పండువగా ప్రశాంతంగా జరిగింది.  

Updated Date - 2022-02-17T16:44:38+05:30 IST