రేట్లు తగ్గించేందుకు మల్టీప్లెక్స్‌లు రెడీ

ABN , First Publish Date - 2022-08-19T07:37:54+05:30 IST

సినిమా ప్రియులకు శుభవార్త! థియేటర్లలో టికెట్‌ రేట్లతో పాటు.. ఇంటర్వెల్‌ సమయంలో ప్రేక్షకుల జేబులు గుల్ల చేస్తున్న తినుబండారాల ధరల తగ్గింపు ప్రతిపాదనకు మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేశాయి

రేట్లు తగ్గించేందుకు మల్టీప్లెక్స్‌లు రెడీ

టికెట్‌తో పాటు తినుబండారాల ధరలూ..

షూటింగ్స్‌ పునఃప్రారంభంపై 4 రోజులపాటు చర్చలు

ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటాం

థియేటర్లో విడుదలైన 50 రోజులు లేదా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీ రిలీజ్‌: దిల్‌ రాజు


సినిమా ప్రియులకు శుభవార్త! థియేటర్లలో టికెట్‌ రేట్లతో పాటు.. ఇంటర్వెల్‌ సమయంలో ప్రేక్షకుల జేబులు గుల్ల చేస్తున్న తినుబండారాల ధరల తగ్గింపు ప్రతిపాదనకు మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేశాయి!! ధరల తగ్గింపుతో సహా పలు ప్రతిపాదనలకు థియేటర్ల యాజమాన్యాలు అంగీకారం తెలిపాయని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. చిత్రపరిశ్రమలో నిలిచిపోయిన షూటింగ్స్‌ రెండు, మూడు రోజుల్లోనే ప్రారంభమవుతాయంటూ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో.. గురువారం ఆయన ఫిలించాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. దీనిపై మరో నాలుగు రోజులపాటు పలు విభాగాలతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని..


ఆ తర్వాతే షూటింగ్స్‌ ప్రారంభమవుతాయని ఆయన తేల్చిచెప్పారు. థియేటర్ల సమస్యలపై నిర్మాతలతో చర్చలు కొనసాగుతున్నాయని, వీపీఎఫ్‌ చార్జీల  ప్రతిపాదనపై తుది సమావేశంలో ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. ఈ సమస్యలపై గురువారం ఎగ్జిబిటర్లతో చర్చించినట్లు వెల్లడించారు. చిత్ర నిర్మాణ వ్యయంపై అదుపు, అనవసర వ్యయాల తగ్గింపునకు సంబంధించి.. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)తో చాంబర్‌ ఒక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ‘మా’ కూడా ఈసీ సమావేశంలో నిర్మాతల ప్రతిపాదనలపై చర్చించి, అవన్నీ హేతుబద్ధంగా ఉన్నాయని భావించి చాంబర్‌తో ఒప్పందం చేసుకోవడం మంచి పరిణామం అన్నారు. వృథా వ్యయాన్ని అరికట్టే దిశగా అడుగులు వేస్తున్నామని.. ఈ మేరకు దర్శకులు, ఇతర విభాగాల ప్రముఖులతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 


కార్మికులు అడుగుతున్న వేతనాలు చెల్లించడానికి ఇబ్బంది లేదని.. కానీ, పనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేవని, ఫెడరేషన్‌తో ఇంకా రెండుసార్లు సమావేశమై వాటిపై చర్చించి తుదినిర్ణయానికి వస్తామని దిల్‌ రాజు తెలిపారు. ఇలా ఒక్కో సమస్యనూ పరిష్కరించుకుంటూ త్వరలోనే తిరిగి షూటింగ్స్‌ మొదలుపెడదామని తాము అనుకుంటుంటే..


ఈలోపే అసత్యాలు ప్రచారంలోకి తెస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘త్వరలోనే మీడియా ముందు కు వస్తాం. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, షూటింగ్స్‌ ఎప్పుడు ప్రారంభించేది అన్నీ అప్పుడు మీడియాకు వివరంగా చెబుతాం. సమస్యల పరిష్కారం కోసం మనం తీసుకోబోయే నిర్ణయాలను బాలీవుడ్‌, దక్షిణాది చిత్రపరిశ్రమలు  ఆసక్తిగా గమనిస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే.. ‘‘సినిమాల ఓటీటీ విడుదలపై నిర్మాతలందరం చర్చించుకొని ఓ నిర్ణయానికి వచ్చాం. ఇక నుంచి థియేట్రికల్‌ రిలీజ్‌ అయిన ఎనిమిది వారాలు లేదా 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం’’ అని దిల్‌ రాజు వివరించారు. అయితే.. ఇప్పటికే నిర్మాణంలో ఉన ్న కొన్ని సినిమాల నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని.. వాటిని మినహాయించి, ఇప్పటిదాకా ఓటీటీలతో ఒప్పందం ఖరారు కాని, నిర్మాణంలో ఉన్న సినిమాలను ఇక నుంచి 50 రోజుల అనంతరమే ఓటీటీల్లో రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా.. ఈ సమావేశంలో చాంబర్‌ అధ్యక్షుడు బసిరెడ్డి, నిర్మాత సి.కల్యాణ్‌, దామోదర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

-- సినిమా డెస్క్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - 2022-08-19T07:37:54+05:30 IST