మల్టీలెవల్‌ పార్కింగ్‌ ఫీజు పెంపు

ABN , First Publish Date - 2022-06-29T13:49:23+05:30 IST

ప్రభుత్వ స్థలాల్లో వాహనాల పార్కింగ్‌ ఫీజు పెంచాలని, కార్పొరేషన్‌ పాఠశాలల్లో లింగ వివిక్ష కమిటీలను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్‌ పాలకవర్గం

మల్టీలెవల్‌ పార్కింగ్‌ ఫీజు పెంపు

- పాఠశాలల్లో లింగ వివిక్ష కమిటీల ఏర్పాటు  

- వేగంగా నగర అభివృద్ధి పనులు 

- చెన్నై కార్పొరేషన్‌ సమావేశంలో తీర్మానం 


అడయార్‌(చెన్నై), జూన్‌ 28: ప్రభుత్వ స్థలాల్లో వాహనాల పార్కింగ్‌ ఫీజు పెంచాలని, కార్పొరేషన్‌ పాఠశాలల్లో లింగ వివిక్ష కమిటీలను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్‌ పాలకవర్గం నిర్ణయించింది. మహానగర పాలక సంస్థ సమావేశం మంగళవారం మేయర్‌ ఆర్‌.ప్రియ అధ్యక్షతన జరిగింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. నగరంలోని 83 వాహన పార్కింగ్‌ స్థలాల్లో కార్లు, ద్విచక్రవాహనాలు కలిసి దాదాపు 12 వేల వరకు పార్కింగ్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం కార్లకు గంటకు రూ.20, బైకులకు గంటకు రూ.5 చొప్పున వసూలు చేస్తున్నారు. టి. నగర్‌లోని మల్టీలెవల్‌ పార్కింగ్‌ స్థలంలో మాత్రం ఇప్పటివరకు గంటకు రూ.10 వసూలు చేస్తుండగా, దీన్ని రూ.15కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, చెన్నై కార్పొరేషన్‌ పాఠశాల్లో చదివే విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఉచితంగా అందజేయాలని, ఇందుకోసం కో-ఆ్‌పటెక్స్‌ వద్ద కొనుగోలు చేయాలని నిర్ణయించారు. బాలబాలికలు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సమానమేనని చెప్పేలా పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కోసం ప్రచారం చేయాలని తీర్మానించారు. అదేవిధంగా నగరంలో జరుగుతున్న వర్షపునీటి  కాల్వల నిర్మాణ పనులను త్వరితగతిని పూర్తి చేయాలని కూడా తీర్మాణం చేశారు. చెన్నై కార్పొరేషన్‌ పరిధిలోని 200 వార్డుల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే, ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానమిచ్చారు. చెన్నై నగర వ్యాప్తంగా యేడాదికి 1.54 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త పోగవుతుందని, ఇందులో 75 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తతో 3 వేల టన్నుల ఎరువు తయారు చేస్తున్నామన్నారు. ఇందులో 200 టన్నుల ఎరువును వ్యవసాయానికి అందజేస్తుండగా మిగిలిన ఎరువు చెన్నై పార్కులు, రోడ్డు డివైడర్ల మధ్యలో నాటే మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నామని, మిగిలినది ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నట్టు ఆమె వివరించారు.

Updated Date - 2022-06-29T13:49:23+05:30 IST