బుట్టాయిగూడంలో 75కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి : మంత్రి ఆళ్ల

ABN , First Publish Date - 2020-07-13T18:51:22+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు.

బుట్టాయిగూడంలో 75కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి : మంత్రి ఆళ్ల

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. పర్యటనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్స్ అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న మెడికల్ సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజును మంత్రి ఆదేశించారు. ఏజెన్సీలో వెంటనే మొబైల్ ఎక్సరే యూనిట్ ఏర్పాటు చేయాలన్నారు. బుట్టాయిగూడంలో 10ఎకరాలు స్థలంలో 75కోట్లు రూపాయలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నామని ఈ సందర్భంగా మంత్రి శుభవార్త తెలిపారు. 


7 మల్టీ స్పెషాలిటి ఆస్పత్రులు..!

రాష్ట్రంలో 7ఐటీడీఏ పరిధిలో మల్లీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి తెలిపారు. కోవిడ్ -19 చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం బుట్టాయిగూడం కమ్యూనిటీ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, ఐటీడీఏ పీఓ సూర్యనారాయణ, డాక్టర్ సునంద, డాక్టర్ శంకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్ళీ వారం రోజుల్లో ఏజెన్సీకి వస్తానని ఆ లోపు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీలో అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. వైద్యం అందించడంలో ఆలస్యం వహిస్తే మీరే బాధ్యత వహించాలని అధికారులు, వైద్యులను మంత్రి హెచ్చరించారు.

Updated Date - 2020-07-13T18:51:22+05:30 IST