ముల్షీ సత్యాగ్రహం

ABN , First Publish Date - 2022-05-27T06:07:47+05:30 IST

సేనాపతి బాపట్ (1880–1967) సారథ్యంలో సాగిన ముల్షీ సత్యాగ్రహం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యామ్ వ్యతిరేక ఉద్యమం. వలస పాలనా పద్ధతులు, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా...

ముల్షీ సత్యాగ్రహం

సేనాపతి బాపట్ (1880–1967) సారథ్యంలో సాగిన ముల్షీ సత్యాగ్రహం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యామ్ వ్యతిరేక ఉద్యమం. వలస పాలనా పద్ధతులు, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన సమష్టి పోరాటమది. ‘వ్యవసాయ సమాజం పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేసిన సందర్భంలో ఎదురయ్యే బాధాకర సమస్యలకు మల్షీ పోరాటం ఒక తొలి నిదర్శనం. నర్మదా బచావో ఆందోళనకు అది పూర్వగామి మాత్రమే కాదు, సింగూర్, నందిగ్రామ్‌లలో వలే సన్నకారు చిన్నకారు రైతుల భూములను రాజ్య వ్యవస్థ ఒక ప్రైవేట్ కంపెనీకి నిర్బంధంగా అప్పగించడానికి పూనుకుంటే సంభవించే నిరసనలను ముందస్తుగా చూపిన ఉద్యమమది’ అని రామచంద్ర గుహ విశ్లేషించారు.


భారత రాజ్యాంగం నిర్దేశించిన రీతిలో జాతి నిర్మాణానికి స్ఫూర్తినిస్తోన్న పోరాటాలు ఎన్నో మన జాతీయోద్యమంలో జరిగాయి. వాటిలో ఒకటి ముల్షీ సత్యాగ్రహం. పూణే సమీపాన ఉన్న ముల్షీపేట గ్రామం వద్ద మూలా, నీలానదుల సంగమ ప్రదేశంలో విద్యుదుత్పాదన లక్ష్యంతో 1919లో ఒక డ్యామ్ నిర్మాణానికి టాటా కంపెనీ పూనుకున్నది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు అంగీకరించిన బొంబాయి ప్రభుత్వం భూసేకరణకు భూ స్వాధీన చట్టాన్ని ప్రయోగించడానికి నిర్ణయించింది. ఫలితంగా పదివేల మంది రైతులు నిర్వాసితులయ్యే ప్రమాదమేర్పడింది. వారు తమ భూములను అప్పగించడానికి తిరస్కరించారు. భూములను చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవడానికి ముందే ప్రాజెక్టు నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు టాటాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కోపోద్రిక్తులైన రైతులు కంపెనీ చేపట్టిన పనులను అడ్డుకున్నారు. ఒక అధికారి పిస్తోలుతో ఆందోళనకారులను బెదిరించాడు. రైతులు సాహసోపేతంగా ఎదురు తిరిగారు. ఉద్రిక్తతలు ఉపశమించినప్పటికీ ఆ ఘటనకు వార్తా పత్రికల్లో విశేష ప్రాధాన్యం లభించింది. తిలక్ పత్రిక ‘కేసరి’లో దీనిపై సంపాదకీయం చదివిన వినాయక్ మహాదేవ్ భూస్కూటే అనే పాత్రికేయుడు, రాజకీయ కార్యకర్త ముల్షీపేటతో పాటు భూములు ముంపునకు గురికానున్న 54 గ్రామాలనూ సందర్శించి రైతులతో మాట్లాడారు. డ్యామ్‌కు వ్యతిరేకంగా సత్యాగ్రహోద్యమానికి సిద్ధం కావాలని ఆయన సూచించారు. తొలుత డ్యామ్ నిర్మాణానికి అనుమతినివ్వవద్దని కోరుతూ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. పాలకులు దిగిరాకపోవడంతో సత్యాగ్రహానికి రైతులు సంసిద్ధమయ్యారు. 1921 ఏప్రిల్ 16 నుంచి సత్యాగ్రహాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.


సత్యాగ్రహోద్యమ మద్దతుదారులు కొంతమంది బొంబాయి వెళ్లి పాండురంగ మహాదేవ్ బాపట్‌ను కలుసుకుకున్నారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేసే ముల్షీ డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకోవడం మూర్ఖత్వమని బాపట్ తొలుత భావించారు. అయితే సత్యాగ్రహ ప్రతిపాదకుల వాదనలతో ఆయన అంతిమంగా ఏకీభవించారు. ఇంగ్లాండ్‌లో మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో శిక్షణ పొందిన బాపట్, న్యాయబద్ధమైన పునరావాస హక్కుల కోసం దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా డిమాండ్ చేస్తున్న రైతుల పక్షాన నిలిచేందుకు నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ముల్షీ డ్యామ్ లాంటి ప్రాజెక్టులను అమలుపరచవలసివచ్చినప్పుడు నిర్వాసితుల పునరావాసం పెద్ద సమస్య అవుతుందని కూడా ఆయన ఆనాడే చెప్పారు. 1921 ఏప్రిల్ 16న వందలాది రైతులు బాపట్ తదితరుల నాయకత్వంలో ప్రతిపాదిత డ్యామ్ నిర్మాణ ప్రదేశానికి ఊరేగింపుగా వెళ్లారు. పనులు నిలివేయాలని సత్యాగ్రహులు కోరారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వారిపై వేడినీళ్లను వెదజల్లారు. అయినా సత్యాగ్రహులు చలించలేదు. సత్యాగ్రహం పక్షం రోజులపాటు సాగింది. చివరకు ప్రాజెక్ట్ ఛీఫ్ ఇంజనీర్ సత్యాగ్రహులతో సంప్రదింపులు జరిపారు. ఆరు నెలల పాటు వేచి ఉండడానికి సత్యాగ్రహులు, అదేకాలంలో ప్రాజెక్టు పనులు నిలిపివేయడానికి టాటా కంపెనీ అధికారులు అంగీకరించారు. అయితే పౌడ్ నుంచి ముల్షీదాకా రైల్వే మార్గాన్ని నిర్మించేందుకు టాటా కంపెనీ పూనుకున్నది. బాపట్ వ్యతిరేకించారు. బాపట్ మొదలైన వారిని అరెస్ట్ చేసి ఆరునెలల పాటు జైలు శిక్ష విధించారు. 1922 మే 1న ముల్షీ సత్యాగ్రహం రెండో దశ ప్రారంభమయింది. జైలు నుంచి విడుదలయిన బాపట్ సత్యాగ్రహాన్ని ముమ్మరం చేశారు. ఈ దశలోనే ఆయన్ని ప్రజలు సేనాపతి (జనరల్) బాపట్‌గా పిలవడం ప్రారంభమయింది. స్త్రీలు సైతం పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. అనేక మంది జైళ్లకు వెళ్ళారు 1922 జూన్‌లో బాపట్‌తో సహా పలువురు సత్యాగ్రహులను అరెస్ట్ చేసి ఆరునెలలు జైలు శిక్ష విధించారు. 1923 ఫిబ్రవరిలో విడుదలైన బాపట్ సత్యాగ్రహాన్ని కొనసాగించేందుకు పూనుకున్నారు. అయితే టాటా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం బహిరంగపరిచింది. ఆ మేరకు ఎకరానికి రూ.500 నష్ట పరిహారం చెల్లించేందుకు ముల్షీపేటలో ఒక కార్యాలయాన్ని కూడా టాటా కంపెనీ ప్రారంభించింది. ఉద్యమానికి తొలుత మద్దతునిచ్చిన పెద్దలు, ప్రముఖులు క్రమంగా అనాసక్తిచూపడంతో ఉద్యమం నిలిచిపోయింది. నిర్వాసిత కుటుంబాల సమస్యలు మాత్రం నేటికీ కొనసాగుతున్నాయి!

Updated Date - 2022-05-27T06:07:47+05:30 IST