మొదటిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ములాయం

ABN , First Publish Date - 2022-02-17T23:40:51+05:30 IST

ఇక్కడికి పెద్ద సంఖ్యలో రైతులు, యువకులు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటి నుంచో సమాజ్‌వాదీ పార్టీ వెన్నంటి ఉంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీని ఈ స్థాయికి తీసుకువచ్చింది కూడా మీరే. నా భావాలను గౌరవించి అఖిలేష్‌ని పెద్ద మెజారిటీతో గెలిపించండి...

మొదటిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ములాయం

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఎంపీ ములాయం సింగ్ యాదవ్ మొట్టమొదటి సారి ఎన్నికల మైదానంలోకి అడుగు పెట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున అఖిలేష్ యాదవ్ అన్నీ తానై ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీలతో పొత్తులు, సీట్ల పంపకాలు, ప్రచారానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు అఖిలేషే నిర్వర్తిస్తున్నారు. అయితే ములాయం సింగ్ ప్రచారానికి వస్తున్నారా అని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటికే రెండు దశల ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో ఇక ఆయన రారని, మొత్తంగా అఖిలేషే ఉంటారని అనుకున్నారు. ఇంతలోనే ట్విస్ట్ ఇస్తూ గురువారం ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్‌లో జరిగిన ప్రచార సభకు ములాయం హాజరయ్యారు.


ములాయం పాల్గొన్న కార్యక్రమం ఏర్పాటు చేసిన కర్హాల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే కుమారుడు అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఒకవైపు వరుస ర్యాలీలు, సభలతో బిజీగా ఉన్నఅఖిలేష్‌ను కర్హాల్ నుంచి ఎలాగైనా గెలిపించాలనే లక్ష్యంతోనే ములాయం రంగంలోకి దిగినట్లు ఎస్పీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన కూడా చెప్పారు. కర్హాల్ ఉన్న మైన్‌పురి లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది. మైన్‌పురి నుంచి లోక్‌భకు ములాయం ఎన్నికయ్యారు.


కర్హాల్‌లో నిర్వహించిన సభలో ములాయం మాట్లాడుతూ ‘‘ఇక్కడికి పెద్ద సంఖ్యలో రైతులు, యువకులు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటి నుంచో సమాజ్‌వాదీ పార్టీ వెన్నంటి ఉంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీని ఈ స్థాయికి తీసుకువచ్చింది కూడా మీరే. నా భావాలను గౌరవించి అఖిలేష్‌ని పెద్ద మెజారిటీతో గెలిపించండి. సమాజ్‌వాదీ పార్టీని మరింత బలోపేతం చేయండి’’ అని అన్నారు. ఇక భారతీయ జనతా పార్టీపై ములాయం విమర్శలు గుప్పించారు. ములాయం పాల్గొన్న సభకు 5 కిలోమీటర్ల దూరంలోనే అమిత్ షా సభ నిర్వహిస్తున్నారు. దీన్ని ప్రస్తావిస్తూ ‘‘ఇందాక నేను వస్తుంటే ఒక సభ కనిపించింది. అక్కడ జనాలు ఎవరూ లేరు. వాళ్లు జనాలను పోగు చేసేందుకు అవసరమైతే వాళ్ల కాన్వాయ్‌ని ఆపి వాళ్లకు వాళ్లే దాడులు చేసుకుంటారు’’ అని ములాయం విమర్శించారు.

Updated Date - 2022-02-17T23:40:51+05:30 IST