తాలిబానీ మనస్తత్వంపై కేంద్ర మంత్రి నఖ్వీ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-12-18T22:17:23+05:30 IST

మహిళా సాధికారతకు ఆటంకాలు కల్పిస్తున్న తాలిబానీ

తాలిబానీ మనస్తత్వంపై కేంద్ర మంత్రి నఖ్వీ ఆగ్రహం

న్యూఢిల్లీ : మహిళా సాధికారతకు ఆటంకాలు కల్పిస్తున్న తాలిబానీ మనస్తత్వంపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇటువంటి మనస్తత్వంగలవారు ట్రిపుల్ తలాక్‌ను శిక్షించదగిన నేరంగా చేయడాన్ని కూడా వ్యతిరేకించారన్నారు. 


తక్షణ ట్రిపుల్ తలాక్ దురాచారాన్ని శిక్షించదగిన నేరంగా పరిగణించడాన్ని, హజ్‌కు ముస్లిం మహిళలు ఒంటరిగా వెళ్ళడాన్ని వ్యతిరేకించేవారు భారత రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకించే ప్రొఫెషనల్ నిరసనకారులని మండిపడ్డారు. వీరు మహిళల స్వేచ్ఛ, గౌరవ, మర్యాదలు, సాధికారతలను అడ్డుకుంటున్నారన్నారు. మహిళల వివాహ అర్హత వయసు పెంపును అడ్డుకుంటున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న మతాల్లో దాదాపు అన్నిటికీ చెందినవారు మన దేశంలో ఉన్నారని, అదేవిధంగా నాస్తికులు కూడా అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారని, వీరందరికీ గౌరవ, మర్యాదలతోపాటు, రాజ్యాంగ, సాంఘిక హక్కులు సమానంగా లభిస్తున్నాయని చెప్పారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ళ నుంచి ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి’’ అనే నినాదంతో పని చేస్తోందని చెప్పారు. చెప్పుకోదగ్గ సంస్కరణలు అమలు చేస్తోందని తెలిపారు. దీంతో మైనారిటీలతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి జరుగుతోందన్నారు. ‘హునార్ హాత్’ ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న స్థానిక వృత్తిపనివారికి భరోసానిచ్చిందన్నారు. గడచిన ఆరు సంవత్సరాల్లో ఏడు లక్షల మంది వృత్తిపనివారికి ఉపాధి కల్పించామన్నారు. 


నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీలైన పారశీకులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, ముస్లింలకు చెందిన ఐదుకోట్ల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేసినట్లు చెప్పారు. లబ్ధిదారుల్లో 50 శాతం మంది విద్యార్థినులని చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేస్తుండటం వల్ల అర్థాంతరంగా చదువు మానేసేవారి సంఖ్య బాగా తగ్గిందన్నారు. మరీ ముఖ్యంగా ముస్లిం బాలికలు అర్థాంతరంగా చదువు మానేయకుండా ఈ పథకం దోహదపడుతోందన్నారు. ముస్లిం బాలికలు అర్థాంతరంగా చదువు మానేసే పరిస్థితిని పరిశీలించినపుడు 2014కు పూర్వం 70 శాతం మంది అర్థాంతరంగా చదువు మానేసేవారని, ప్రస్తుతం ఇది 30 శాతం కన్నా తక్కువకు తగ్గిందని తెలిపారు. రానున్న రోజుల్లో ముస్లిం బాలికలు అర్థాంతరంగా చదువు మానేయకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-18T22:17:23+05:30 IST