న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (Mukhtar Abbas Naqvi) రాజీనామా చేశారు. ముక్తార్ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. రాజ్యసభ ఎంపీగా ఉండి మంత్రి అయిన నఖ్వీ ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభ ఎంపీగా ఆయన పదవీ కాలం గురువారంతో ముగుస్తుంది. మంత్రిగా ముక్తార్ అందించిన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. నఖ్వీతో పాటు కేంద్ర స్టీల్ శాఖ మంత్రి ఆర్సీపీ సింగ్ కూడా కేబినెట్ నుంచి వైదొలిగారు. మోదీ 2.0 కేబినెట్లో స్టీల్ శాఖ మంత్రిగా ఆర్సీపీ సింగ్ పనిచేశారు. మంత్రివర్గంలో ఆర్సీపీ సింగ్, నఖ్వీ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రశంసించినట్లు తెలిసింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం నఖ్వీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. ఆగస్ట్‌లో జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో నఖ్వీ కూడా ఉన్నట్లు తెలిసింది. ఆయనకు ఉపరాష్ట్రపతి దక్కని పక్షంలో గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్‌గా పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో నామినేషన్ల ఘట్టానికి తెరలేచింది. మొదటి రోజు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో గ్వాలియర్(మధ్యప్రదేశ్)కు చెందిన ‘రామాయణి చాయ్‌వాలా’గా పేరొందిన ఆనంద్ సింగ్ కుశ్వాహా కూడా ఉన్నారు. కె.పద్మరాజన్ (సేలం-తమిళనాడు), పరేశ్‌కుమార్ నానూభాయ్ ములానీ (అహ్మదాబాద్-గుజరాత్), హోస్మత్ విజయానంద్ (బెంగళూరు-కర్ణాటక), నాయుడుగారి రాజశేఖర్ శ్రీముఖలింగం (ఆంధ్రప్రదేశ్) కూడా నామినేషన్లు వేశారు. కుశ్వాహా రూ.15 వేల డిపాజిట్ చెల్లించలేదు.రాజశేఖర్ ఓటర్ల జాబితాలో తన పేరుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీ సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగతావారి పత్రాలు కూడా తిరస్కరణకు గురవడం ఖాయం. ఎందుకంటే అభ్యర్థిగా పోటీచేసేవారి నామినేషన్‌పై 20 మంది ఎంపీలు ప్రతిపాదకులుగా, మరో 20 మంది ఎంపీలు సమర్థకులుగా సంతకాలు చేయాలి. వీరి నామినేషన్లపై ఎంపీల సంతకాలు లేవు.
కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 19 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 20న వాటి పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 22. ఎన్నికలు అనివార్యమైతే ఆగస్టు 6న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితం కూడా ప్రకటిస్తారు. కొత్త ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న పదవీప్రమాణం చేస్తారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు మాత్రమే ఓటర్లు. రెండు సభల్లో పాలక ఎన్డీఏకి స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ కూటమి అభ్యర్థి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. నామినేటెడ్ ఎంపీలకు కూడా ఓటుహక్కు ఉంది. ఓటింగ్ బహిరంగంగా గాక రహస్యంగా జరుగుతుంది. అలాగే పార్టీలు విప్ జారీచేయరాదని ఈసీ స్పష్టం చేసింది.
బలాబలాలు..
లోక్‌సభలో 543.. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. లోక్‌సభలో ఎన్డీఏకి 336 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీజేపీ సభ్యులే 303 మంది ఉన్నారు. యూపీఏ సంఖ్యా బలం 91కి కాగా.. టీఎంసీ, వైసీపీ, బీజేడీ, బీఎస్పీ, టీఆర్ఎస్, టీడీపీ సహా ఇతర ఎంపీలు 97 మంది ఉన్నారు. అలాగే రాజ్యసభలో ఎన్డీఏకి 112 మంది (బీజేపీకి 91 మంది), యూపీఏకి 48, టీఎంసీ, వైసీపీ, బీజేడీ, బీఎస్పీ, టీఆర్ఎస్ సహా ఇతరులకు 73 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీ, బీజేడీ, బీఎస్పీ వంటి పార్టీలు ఎన్డీఏకే మద్దతిచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గం ఎంపీలు సైతం పాలక కూటమి అభ్యర్థిని సమర్థించే వీలుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ అభ్యర్థి నెగ్గడం తథ్యమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.