క్రిప్టో బిల్లు సరైన చర్యే... ముఖేష్ అంబానీ...

ABN , First Publish Date - 2021-12-04T01:42:33+05:30 IST

ప్రతిపాదిత డేటా గోప్యత.. క్రిప్టోకరెన్సీ బిల్లులకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మద్దతునిచ్చారు. భారతదేశం అత్యంత ముందుచూపు విధానాలను పాటిస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

క్రిప్టో బిల్లు సరైన చర్యే... ముఖేష్ అంబానీ...

ముంబై : ప్రతిపాదిత డేటా గోప్యత.. క్రిప్టోకరెన్సీ బిల్లులకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మద్దతునిచ్చారు. భారతదేశం అత్యంత ముందుచూపు విధానాలను పాటిస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.  ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్‌ఎస్‌సీఏ) నిర్వహించిన ‘ఇన్ఫినిటీ ఫోరం’లో ఆయన మాట్లాడారు. భారతీయులు తమ స్వంత డేటాను కలిగి ఉండటం, అలాగే... నియంత్రించడం మాత్రమే కాకుండా డిజిటల్ సమాచారం ఎలా నిల్వ చేయాలి ? భాగస్వామ్యం చేయడం ఎలా జరుగుతుంది ? అన్న అంశాలకు సంబంధించి కఠినమైన నియమాలను రూపొందించడం అవసరమని అయన అభిప్రాయపడ్డారు. వ్యూహాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, రక్షించడానికి దేశాలకు హక్కు ఉంటుందని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. డేటాను ‘కొత్త చమురు’ అని అభివర్ణించిన అంబాని... ప్రతీ పౌరుడి గోప్యత హక్కును కాపాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 


అంబానీ మాట్లాడుతూ ‘ఆధార్, డిజిటల్ బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ చెల్లింపుల ద్వారా ఇప్పటికే డిజిటల్ గుర్తింపు కోసం గొప్ప ఫ్రేమ్‌వర్క్ ఉందని పేర్కొన్నారు. “మనం డేటా గోప్యత బిల్లు, క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో ఉన్నాము. మనం సరైన మార్గంలోనే ఉన్నామని నేను భావిస్తున్నాను” అని అంబానీ వ్యాఖ్యానించారు. చిన్న పెట్టుబడిదారులను కాపాడుతూ క్రిప్టోకరెన్సీలను ఆర్థిక ఆస్తిగా పరిగణించేందుకు ప్రభుత్వం పార్లమెంటులో కొత్త బిల్లును తీసుకురావాలని చూస్తోన్న సమయంలో ముఖేష్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. డిజిటల్ కరెన్సీలలో పెట్టుబడులకు కనీస మొత్తాన్ని చట్టబద్ధమైన టెండర్‌గా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ చట్టం నిర్దేశించవచ్చని భావిస్తున్నారు. 

Updated Date - 2021-12-04T01:42:33+05:30 IST