భారత్‌లో ఏడాదికి రూ.71 కోట్ల జీతం తీసుకుంటున్న వ్యక్తి ఎవరో తెలుసా...

ABN , First Publish Date - 2022-05-27T02:18:51+05:30 IST

భారతీయులు పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. అద్భుతమైన సారధ్యబాధ్యతలతో కంపెనీల ఎదుగుదలకు తోడ్పాటునందిస్తూ కళ్లు చెదిరే జీ

భారత్‌లో ఏడాదికి రూ.71 కోట్ల జీతం తీసుకుంటున్న వ్యక్తి ఎవరో తెలుసా...

న్యూఢిల్లీ : భారతీయులు పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. అద్భుతమైన సారధ్యబాధ్యతలతో కంపెనీల ఎదుగుదలకు తోడ్పాటునందిస్తూ కళ్లు చెదిరే జీతాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. మరి భారతీయ దిగ్గజ కంపెనీలకు సీఈవోగాలు వ్యవహరిస్తున్న సీఈవోలు ఎంతెంత జీతాలు తీసుకుంటున్నారు? అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న భారతీయ కంపెనీ సీఈవో ఎవరు? ఏ కంపెనీలో పనిచేస్తున్నారు ? అనే ఆసక్తికరమైన అంశాలపై మీరూ ఓ లుక్కేయండి...


సలీల్ పరేఖ్ జీతం ఏడాదికి రూ.71 కోట్లు..

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవోగా వ్యవహరిస్తున్న సలీల్ పరేఖ్ ఆర్థిక సంవత్సరం 2021-22కిగానూ రూ.71 కోట్ల వార్షికవేతనం అందుకుంటున్నారు. ఈ ఏడాది ఆయన జీతాన్ని 43 శాతం పెంచినట్టు ఇన్ఫోసిస్ కంపెనీ తన వార్షిక రిపోర్టులో పేర్కొంది. దీంతో భారత్‌లో అత్యధిక వార్షికవేతనం పొందుతున్న సీఈవోగా సలీల్ పరేఖ్ నిలిచారు. కొన్నేళ్లుగా ఇన్ఫోసిస్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పరేఖ్ జీతాన్ని పెంచినట్టు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా మరో ఐదేళ్లపాటు 2027 వరకూ సీఈవోగా ఆయన పదవికాలాన్ని పొడిగించింది. కాగా గ్లోబల్ ఐటీ సర్వీసుల రంగంలో పరేఖ్‌కు 30 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.


ముకేష్ అంబానీ(రిలయన్స్ ఇండస్ట్రీస్)..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి కంపెనీలో 44 శాతానికిపైగా వాటా ఉంది. కంపెనీ వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడతారు. ఇందుకుగానూ 2020లో రూ.15 కోట్ల వార్షికవేతనం అందుకున్నారని రిపోర్టులు చెబుతున్నాయి.


సీపీ గుర్నామీ(టెక్ మహింద్రా)

సీపీ గుర్నామీ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాకు సీఈవో, ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఆర్థిక సంవత్సరం 2020లో రూ.28.57 కోట్ల వార్షిక జీతాన్ని ఆర్జించారు.


ఎస్ఎన్ సుబ్రమణ్యన్ (లార్సెన్ అండ్ టుబ్రో)

బహుళజాతి కంపెనీ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్‌టీ)కి సీఈవో, ఎండీగా వ్యవహరిస్తున్న ఎస్ఎన్ సుబ్రమణ్యన్ 2019-20లో రూ.27.17 కోట్ల జీతాన్ని అందుకున్నారు. అయితే కొవిడ్ నేపథ్యంలో 43.91 శాతాన్ని స్వచ్ఛంధంగా కోత విధించుకున్నారు. 


రాజేష్ గోపినాథన్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)

ఎన్ చంద్రశేఖరన్ 2017లో టాటాసన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక.. అప్పటివరకూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఎఫ్‌వోగా ఉన్న  రాజేష్ గోపినాథన్ సీఈవోగా నియమితులయ్యారు. 2021-22 ఏడాదికిగానూ రూ.25.7 కోట్ల జీతాన్ని అందుకున్నారు.


పవన్ ముంజల్ (హీరో మోటోకార్ప్)

హీరో మోటోకార్ప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న పవన్ ముంజల్ ఆర్థిక సంవత్సరం 2020లో ఏకంగా రూ.84.59 కోట్ల వార్షిక జీతం తీసుకున్నారని లైవ్‌మింట్ రిపోర్ట్ పేర్కొంది. 


రాజీవ్ బజాజ్ (బజాజ్ ఆటో)

బజాజ్ ఆటో సీఈవో, ఎండీగా కొనసాగుతున్న రాజీవ్ బజాజ్ 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.39.86 కోట్ల జీతం ఆర్జించారు.


సునీల్ మిట్టల్ (భారతీ ఎంటర్‌ప్రైజెస్)

సునీల్ మిట్టల్ భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకులు, చైర్మన్. ఆర్థిక సంవత్సరంలో 2020లో రూ.30.1 కోట్ల శాలరీ పొందాడు.


సిద్ధార్థ లాల్ (ఐషర్ మోటార్స్ లిమిటెడ్)

ఐషర్ మోటార్స్ లిమిటెడ్ బాస్ సిద్ధార్థ లాల్ ఆర్థిక సంవత్సరంలో రూ.19.21 కోట్ల వార్షిక వేతనం పొందారు. 2019లో రూ.12.81 కోట్ల నుంచి భారీగా పెరిగింది.


సంజీవ్ పురి(ఐటీసీ లిమిటెడ్)

సంజీవ్ పురి మే 2019 నుంచి ఐటీసీ లిమిటెడ్ చైర్మన్, ఎండీగా కొనసాగుతున్నారు. 2020-21లో రూ.10.10 కోట్ల వార్షిక వేతనాన్ని పొందారని బిజినెస్ టుడే రిపోర్ట్ పేర్కొంది.


ఎన్ చంద్రశేఖరన్ (టాటా సన్స్)

టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆర్థిక సంత్సరం 2020లో రూ.58 కోట్ల వార్షిక జీతాన్ని తీసుకున్నారని టైమ్స్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. కాగా ఆర్థిక సంవత్సరం 2019లో ఆయన రూ.66 కోట్లు పొందారని వెల్లడించింది.

Updated Date - 2022-05-27T02:18:51+05:30 IST