ఫ్యూచర్‌లోకి రిలయన్స్‌!

ABN , First Publish Date - 2020-06-19T05:52:07+05:30 IST

ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్‌ గ్రూప్‌లోని కొన్ని వ్యాపారాల్లో వాటాలు కొనుగోలు చేసేందుకు బియానీతో ముకేశ్‌ సంప్రదింపులు...

ఫ్యూచర్‌లోకి రిలయన్స్‌!

  • గ్రూప్‌ కంపెనీల్లో వాటాల కోసం ఆర్‌ఐఎల్‌ ప్రయత్నాలు 
  • అంబానీ-బియానీ మధ్య చర్చలు
  • వచ్చే నెలలో అధికారిక ఒప్పందం? 

న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్‌ గ్రూప్‌లోని కొన్ని వ్యాపారాల్లో వాటాలు కొనుగోలు చేసేందుకు బియానీతో ముకేశ్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు అభిజ్ఞ వర్గాల సమాచారం. ముకేశ్‌ తన డిజిటల్‌ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఈ-కామర్స్‌ దిగ్గజంగా మార్చాలన్న ఆశయానికి ఈ డీల్‌ ఎంతగానో దోహదపడనుంది.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌- ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య వాటాల కొనుగోలుకు సంబంధించి అధికారిక ఒప్పందాన్ని వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు ఇరు కంపెనీల ప్రతినిధులు నిరాకరించారు.




ఆర్థిక సంక్షోభంలో ఫ్యూచర్‌ రిటైల్‌ 

అప్పుల భారం, లాక్‌డౌన్‌తో ఫ్యూచర్‌ రిటైల్‌ ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది. గ్రూప్‌లోని మిగతా కంపెనీల పరిస్థితీ అంతంతే. ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా విక్రయించేందుకు బియానీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కంపెనీతో ఇప్పటికే భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న అమెజాన్‌ ఇండియా వాటా కొనుగోలుకు ఆసక్తిగా ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌), సమరా క్యాపిటల్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ కుటుంబానికి చెందిన వ్యక్తిగత పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సైతం బరిలో ఉన్నాయి. ఒక్కో ఇన్వెస్టర్‌ భిన్న ప్రతిపాదనతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రిలయన్స్‌ ఏకంగా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీల్లో వాటాల కొనుగోలుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ముకేశ్‌తో డీల్‌ కుదుర్చుకునేందుకే కిశోర్‌ బియానీ మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.  




గుదిబండగా మారిన రుణాలు 

గత ఏడాది మార్చి నాటికి ఫ్యూచర్‌ గ్రూప్‌లోని 6 లిస్టెడ్‌ కంపెనీలపైనున్న మొత్తం రుణ భారం రూ.11,464 కోట్లుగా నమోదైంది. గత సెప్టెంబరు చివరి నాటికి రూ.12,778 కోట్లకు పెరిగింది. బియానీ కుటుంబ హోల్డింగ్‌ కంపెనీలపై దాదాపు ఇదే స్థాయి రుణ భారం ఉంది. పైగా, హోల్డింగ్‌ కంపెనీల చేతుల్లో ఉన్న మెజారిటీ షేర్లు ప్రస్తుతం తాకట్టులో ఉన్నాయి. 


1,500 స్టోర్లు

ఫ్యూచర్‌ రిటైల్‌ దేశంలోని 400 నగరాల్లో 1,500 స్టోర్లను నిర్వహిస్తోంది. కాగా, రిలయన్స్‌ రిటైల్‌ దేశవ్యాప్తంగా 11,784 సూపర్‌ మార్కెట్లను నడుపుతోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో రిలయన్స్‌ రిటైల్‌ ఆదాయం రూ.38,211 కోట్లుగా నమోదైంది.


ఫ్యూచర్‌ గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీలు 

  1. ఫ్యూచర్‌ కార్పొరేట్‌ రిసోర్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  2. ఫ్యూచర్‌ కూపన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  3. ఫ్యూచర్‌ క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  4. రైకా కమర్షియల్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  5. ఆకార్‌ ఎస్టేట్‌ అండ్‌ ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  


ప్రేమ్‌జీ, అమెజాన్‌కు వాటాలు 

ఫ్యూచర్‌ రిటైల్‌ కొనుగోలు కోసం పోటీలో ఉన్న ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, అమెజాన్‌కు కంపెనీలో ఇప్పటికే మైనారిటీ వాటా ఉంది. ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ దాదాపు 6 శాతం, అమెజాన్‌ సుమారు 3.6 శాతం వాటా కలిగి ఉన్నాయి. 


‘జియో’లో పీఐఎఫ్‌ పెట్టుబడులు 

రూ.11,367 కోట్లతో 2.32శాతం వాటా కొనుగోలు 

జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాల విక్రయ ప్రక్రియ కొన సాగుతూనే ఉంది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్‌ ఇన్వె స్ట్‌మెంట్‌ ఫండ్‌ (పీఐఎఫ్‌).. ఈ కంపెనీలో 2.32 శాతం వాటాను రూ.11,367 కోట్లకు చేజిక్కించుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌ మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో కలిపి జియో ప్లాట్‌ఫామ్స్‌ సమీకరించిన నిధుల విలువ రూ.1.16 లక్షల కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు జియోలో దాదాపు 25 శాతం వాటాను విక్రయించింది రిలయన్స్‌. ఫేస్‌బుక్‌తో కుదిరిన తొలి వాటా విక్రయ ఒప్పందాన్ని ఏప్రిల్‌ 22న ప్రకటించారు. కంపెనీలో 9.99 శాతం వాటాను ఫేస్‌బుక్‌ రూ.43,573.62 కోట్లకు కొనుగోలు చేసింది. 


ఆ తర్వాత సిల్వర్‌ లేక్‌, కేకేఆర్‌, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌, ముబాదలా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, జనరల్‌ అట్లాంటిక్‌, టీపీజీ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజాలు సైతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాలు కొనుగోలు చేశాయి. అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్‌ లేదా మైక్రోసాఫ్ట్‌ కూడా ఈ కంపెనీలో వాటాపై ఆసక్తిగా ఉన్నట్లు మార్కెట్లో ఊహాగానాలు నెలకొన్నాయి. 




వాల్‌మార్ట్‌, అమెజాన్‌తో అంబానీ టక్కర్‌ 

దేశీయ ఈ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌, అంతర్జాతీయ ఆన్‌లైన్‌ మార్కెట్‌ దిగ్గజం అమెజాన్‌కు దీటుగా జియో ప్లాట్‌ఫామ్‌ను నిలిపేందుకు ముకేశ్‌ అంబానీ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం, సంప్రదాయ ఈ-కామర్స్‌ మోడల్‌కు బదులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ హైబ్రిడ్‌ మోడల్‌ను ఎంచుకున్నారు. ఫేస్‌బుక్‌ సహా పలు అంతర్జాతీయ కంపెనీలకు జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా ఇ ప్పటికే రూ.లక్ష కోట్లకు పైగా నిధులు సేకరించారు అంబానీ. ఈ-కామర్స్‌ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు ఈ నిధులను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఆఫ్‌లైన్‌ నెట్‌వర్క్‌తో పాటు వినియోగదారుల ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు ఫ్యూచర్‌తో ఒప్పందం జియోకు భారీగా కలిసిరానుందని అంచనా. 


Updated Date - 2020-06-19T05:52:07+05:30 IST