Mukesh Ambani : వరుసగా రెండో ఏడాది ముకేష్ అంబానీ శాలరీ ‘సున్నా’

ABN , First Publish Date - 2022-08-08T21:53:50+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ముకేష్ అంబానీ(Mukesh Ambani) వరుసగా రెండవ ఏడాది జీతాన్ని త్యజించారు.

Mukesh Ambani : వరుసగా రెండో ఏడాది ముకేష్ అంబానీ శాలరీ ‘సున్నా’

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముకేష్ అంబానీ(Mukesh Ambani) వరుసగా రెండవ ఏడాది జీతాన్ని త్యజించారు. కొవిడ్ మహమ్మారి(covid pandamic) ఆర్థిక వ్యవస్థతోపాటు వ్యాపార, పారిశ్రామికరంగంపై తీవ్ర దుష్ప్రభావం చూపడంతో 2020-21 వేతనాన్ని వదులుకున్న ఆయన.. 2021-22లోనూ ఇదే విధానాన్ని కొనసాగించారు. ముకేష్ అంబానీ స్వచ్ఛందంగా వేతనాన్ని వదులుకున్నారని వార్షిక నివేదికలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(Reliance Industries limited) తెలిపింది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ గత రెండేళ్లకు సంబంధించిన అలవెన్సులు, సౌకర్యాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, కమీషన్ లేదా స్టాక్ అవకాశాలను అంబానీ పొందలేదని కంపెనీ వెల్లడించింది. 


2008-09 ఏడాది నుంచి ముకేష్ అంబానీ రూ.15 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నారు. సౌకర్యాలు, అలవెన్సులు, కమీషన్లతో కలుపుకుని మొత్తం రూ.24 కోట్లకుపైగానే ముడుతోంది. ఈ విధంగా వరుసగా 11 ఏళ్లపాటు..  అంటే 2019-20 వరకు ఇదే జీతాన్ని పొందారు. కొవిడ్-19 మహమ్మారి భారతీయ సమాజం, ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిన నేపథ్యంలో జీతాన్ని వదులుకుంటున్నట్టు 2020లో ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇక రిలయన్స్ బోర్డ్ డైరెక్టర్లు నిఖిల్, హిటల్ మెస్వానీల జీతంలో ఎలాంటి మార్పు లేదు. వార్షికవేతనంగా చెరో రూ.24 కోట్ల జేబులో వేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పీఎంఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ వేతనాలు స్వల్పంగా తగ్గాయి. 2021-22లో ప్రసాద్ రూ.11.89 కోట్లు తీసుకోగా 2020-21లో ఈ మొత్తం రూ. 11.99 కోట్లుగా ఉంది. 2021-22లో కపిల్ రూ.4.22 కోట్ల జీతం తీసుకోగా.. అంతక్రితం ఏడాది ఇది రూ.4.24 కోట్లుగా ఉంది. 


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ కంపెనీ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ 2021-22కిగానూ సిట్టింగ్ ఫీజు కింద రూ.5 లక్షలు, కమీషన్ కింద మరో రూ.2 కోట్లు వేతనం తీసుకున్నారు. అంతక్రితం ఏడాది సిట్టింగ్ ఫీజు రూ.8 లక్షలు, కమీషన్ కింద రూ.1.65 కోట్లు తీసుకున్నారు. రిల్ బోర్డులో ముకేష్ అంబానీతోపాటు మెస్వానీ సోదరులు, ప్రసాద్, కపిల్‌లు జీవితకాల డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇక స్వతంత్ర డైరెక్టర్లు అందరూ రూ.2 కోట్ల కమీషన్ పొందారు.

Updated Date - 2022-08-08T21:53:50+05:30 IST