‘ముహూర్తం’ ప్రసవాలు

ABN , First Publish Date - 2022-05-15T05:25:57+05:30 IST

పెళ్లి, గృహ ప్రవేశం, ఇతర శుభాకార్యాలు ఏమైనా ముహూర్తం చూసుకుంటాం. ఇటీవల పిల్లలను కనేందుకు కూడా కొందరు ముహూర్తాలు చూసుకుంటున్నారు.

‘ముహూర్తం’ ప్రసవాలు

- జిల్లాలో పెరుగుతున్న సీజేరియన్‌ ఆపరేషన్లు

- తేదీ, సమయంలో చూసుకొని ఆపరేషన్‌ చేయాలని ఒత్తిడి

- సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్‌ ఆదేశం

- ముహూర్తాలు చూడవద్దని పురోహితులకు ఆదేశాలు

బెల్లంపల్లి, మే 14: పెళ్లి, గృహ ప్రవేశం, ఇతర శుభాకార్యాలు ఏమైనా ముహూర్తం చూసుకుంటాం. ఇటీవల పిల్లలను కనేందుకు కూడా కొందరు ముహూర్తాలు చూసుకుంటున్నారు. మంచి రోజు, సమయం చూసుకుని సిజేరియన్‌లు చేయించుకుంటున్నారు. అందుకు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు సహకరిస్తుండడంతో సాధారణ ప్రసవం కావాల్సిన వారికి సైతం సిజేరియన్‌ చేస్తున్నారు. మూఢనమ్మకాలతో  ఆపరేషన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పురోహితులు, గైనకాలజిస్టులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించి ఆపరేషన్లకు స్వస్తి పలకాలని ఆదేశించింది.

ముహూర్తాలు...ప్రత్యేక తేదీల్లో...

బిడ్డకు జన్మనివ్వడానికి మంచి రోజు, నక్షత్రం, ముహూర్తం చూసుకుంటున్న వైనం ఇటీవల బాగా పెరిగిపోయింది. చాలా మంది దంపతులు, వారి కుటుంబీకులు పురోహితుల వద్దకు వెళ్లి పిల్లలను కనడానికి ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఫలానా రోజు ఫలానా సమయం బాగుందని పురోహితులు చెబితే ఆ తర్వాత డాక్టర్‌లను కలిసి అదే సమయానికి ఆపరేషన్‌ చేయాలని కోరుతున్నారు.  వారు కోరిన సమయానికి డెలివరీ సమయం కంటే వారం, పది రోజులు ముందుగానే ఆపరేషన్‌ చేసి బిడ్డను చేతిలో పెడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఇందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. మరికొందరు వైద్యులు కాసుల కక్కుర్తి కోసం సీజేరియన్‌ చేసేందుకు వెనుకాడడం లేదు. రోజురోజుకు సాధారణ ప్రసవాలు తగ్గిపోయి సిజేరియన్‌ ఆపరేషన్‌లు పెరిగిపోతున్నాయి. 

-ఇష్టారాజ్యంగా సీజేరియన్‌లు..

జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా చేయడం లేదు. నార్మల్‌ డెలివరీ చేస్తే  తక్కువ ఫీజు వస్తుందని, సిజేరియన్‌ ఆపరేషన్‌లు చేయడానికి కొందరు వైద్యులు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారుల గుణాంకాలే నిదర్శనం.

సంవత్సరం : 2020-21

ప్రభుత్వ ఆసుపత్రి సీజేరియన్‌ సాధారణ

4656 2378 2277

ప్రైవేట్‌ ఆసుపత్రి

5379 5010 369

సంవత్సరం : 2021-22

ప్రభుత్వ ఆసుపత్రి సీజేరియన్‌ సాధారణ

4510 2174 2336

ప్రైవేట్‌ ఆసుపత్రి

5637 5298 339


ప్రైవేటు ఆసుపత్రుల్లో 90 శాతం సీజేరియన్‌లు జరుగుతుండడం గమనార్హం.  ఒక్కో ఆసుపత్రిని బట్టి ప్రసవానికి రూ.40 వేల నుంచి 60 వేల వరకు ప్యాకేజీలు మాట్లాడుకుని ఆసుపత్రుల్లో చేర్పిస్తున్నారు. సీజేరియన్‌లతో తల్లి, బిడ్డలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిసినప్పటికీ కొందరు ఆపరేషన్లకే మొగ్గు చూపుతున్నారు. ఓ వైపు మూఢనమ్మకాలు, మూహూర్తాల పేరుతో సీజేరియన్‌లు చేయించుకోవడం, మరో వైపు కాసుల కక్కుర్తి కోసం వైద్యులు మొగ్గు చూపుతుండడంతో రోజు రోజుకు సీజేరియన్‌ల సంఖ్య పెరిగిపోతోంది.

-సహకరించవద్దని కలెక్టర్‌ ఆదేశం

పిల్లలను కనేందుకు ఎవరైనా గర్భిణీలు, వారి కుటుంబీకులు పురోహితులను ఆశ్రయిస్తే ముహూర్తాలు చూడవద్దని కలెక్టర్‌ బారతి హోళికేరీ ఆదేశించారు. ఎవరైనా ఇలాంటి ముహూర్తాలు చూస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రైవేటు ఆసుపత్రుల గైనకాలజిస్టులతో  సమావేశం ఏర్పాటు చేసి ముహూర్తం ఆపరేషన్లు చేయవద్దని సూచించారు. ప్రసవం కోసం ముహూర్తాలు అడగరాదు...పురోహితులు చెప్పరాదు అని ప్రతి గుడి ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రుల్లో సైతం సాధారణ ప్రసవం ముద్దు..సిజేరియన్‌ ప్రసవం వద్దని ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

-సాధారణ ప్రసవాలతోనే తల్లీబిడ్డ క్షేమం -డాక్టర్‌ నీరజ, 

సాధారణ ప్రసవాలతోనే తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. సాధారణ ప్రసవాలు జరిగితే పుట్టబోయే బిడ్డకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ముర్రుపాలు బాగా వస్తాయి. సాధారణ ప్రసవాలు జరిగిన వారం రోజుల తర్వాత ఎలాంటి పనులు అయినా చేసుకోవచ్చు. రక్తస్రావం ఎక్కువగా జరగదు. మూఢనమ్మకాలతో ముహూర్తాలు చూయించుకుని సిజేరియన్‌ ఆపరేషన్‌లు చేయించుకోవద్దు. కుటుంబ సభ్యులు సైతం సాధారణ ప్రసవం జరిగేలా ముందు ప్రోత్సహించాలి.  

Updated Date - 2022-05-15T05:25:57+05:30 IST