రామాలయానికి అమంగళ ముహూర్తం: దిగ్విజయ్

ABN , First Publish Date - 2020-08-03T19:58:17+05:30 IST

అయోధ్యలో రామాలయ భూమిపూజకు నిర్ణయించిన సమయం అమంగళమైనదని కాంగ్రెస్ సీనియర్..

రామాలయానికి అమంగళ ముహూర్తం: దిగ్విజయ్

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ భూమిపూజకు నిర్ణయించిన సమయం అమంగళమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అన్నారు.  ఆగస్టు 5వ తేదీ ముహూర్తం వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సూచించారు.


'ఆగస్తు 5వ తేదీ శుభ ముహూర్తం కానందున భూమిపూజను వాయిదా వేయాలని ప్రధానిని మరోసారి నేను కోరుతున్నాను. వందలాది సంవత్సరాల పోరాటం తర్వాత రామాలయ నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రధాని పట్టుదలకు పోతే ఆలయ నిర్మాణ ప్రక్రియకు అవాంతారాలు తలెత్తుతాయి' అని దిగ్విజయ్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.


సనాతన ధర్మ పద్ధతులను అలక్ష్యం చేసిన ఫలితంగానే పలువురు బీజేపీ నేతలు కోవిడ్‌తో అస్వస్థతకు గురయ్యారని దిగ్విజయ్ ఆరోపించారు. 'రామాలయ అర్చకులంతా కోవిడ్ బారిన పడ్డారు. కరోనాతో ఉత్తరప్రదేశ్ మంత్రి కమల్ రాణి వరుణ్ మృతి చెందారు. యూపీ బీజేపీ చీఫ్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కేంద్ర హోం మంత్రికి కరోనా సోకింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ కోవిడ్‌కు చికిత్స పొందుతున్నారు. కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు' అని ఆయన తెలిపారు.


కోట్లాది మంది హిందువుల విశ్వాసాలకు రాముడు కేంద్రబిందువని, వేళ ఏళ్లుగా నడుస్తున్న సతానత ధర్మం సంప్రదాయాలతో ప్రధాని చెలగాటమాడటం తగదని దిగ్విజయ్ అన్నారు. దేశంలో కోవిడ్ ముమ్మరంగా ఉన్న సమయంలో అంత హడావిడిగా భూమిపూజ నిర్వహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.


'అమంగళకరమైన సమయంలో శంకుస్థాపన వల్ల ఎంతమందిని మోదీ ఆసుపత్రికి పంపదలచుకున్నారు? యోగీజీ (ఆదిత్యనాథ్) మీరైనా మోదీకి చెప్పండి. మీ సమక్షంలోనే సనాతన ధర్మ కట్టుబాట్లు, సంప్రదాయాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? ఇందుకు దారితీసిన అనివార్య కారణాలేమిటి?' అని దిగ్విజయ్ ప్రశ్నించారు.


క్వారంటైన్ సాధారణ వ్యక్తులకేనా?

'ఉత్తరప్రదేశ్ మంత్రి కరోనాతో మరణించారు. కేంద్ర హోం మంత్రికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ పరిస్థితిల్లో యూపీ సీఎం, ప్రధాని క్వారంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదా? సామాన్యులకే ఈ క్వారంటైన్ వర్తిస్తుందా? ప్రధాని, ముఖ్యమంత్రికి వర్తించదా?' అని దిగ్విజయ్ ప్రశ్నించారు. హిందుత్వమే వీరి మతమని, సతాతన ధర్మం కాదని ఆయన విమర్శించారు.

Updated Date - 2020-08-03T19:58:17+05:30 IST