ఆ ఆదేశాలు ఆచరిద్దాం!

ABN , First Publish Date - 2021-02-12T08:17:31+05:30 IST

దైవం ఈ లోకాన్ని సృష్టించి, జీవకోటికి బహుమతిగా ఇచ్చాడు. అన్ని జీవరాశులలోనూ మానవులను ఉన్నతులను చేశాడు. వారు సత్ప్రవర్తనతో మెలగడానికీ, అత్యున్నతంగా జీవనం

ఆ ఆదేశాలు ఆచరిద్దాం!

దైవం ఈ లోకాన్ని సృష్టించి, జీవకోటికి బహుమతిగా ఇచ్చాడు. అన్ని జీవరాశులలోనూ 

మానవులను ఉన్నతులను చేశాడు. వారు సత్ప్రవర్తనతో మెలగడానికీ, అత్యున్నతంగా జీవనం సాగించడానికీ, సాటి మానవులతో సామరస్యంగా మెలగడానికీ అవసరమైన ఆదేశాలను 

ప్రవక్తల ద్వారా అందజేశాడు. మానవాళి శ్రేయస్సు కోసం అల్లాహ్‌ ఇచ్చిన ఈ ఆదేశాలను 

దివ్య ఖుర్‌ఆన్‌ చాటిచెబుతోంది.


అల్లాహ్‌ ఆదేశాల ప్రకారం... దైవానికి సాటి ఎవరూ లేరు. తల్లితండ్రుల పట్ల మంచిగా మెలగాలి. వారికి ఏలోటూ రాకుండా చూసుకోవాలి. లోకంలో అన్నిటినీ, అందరికీ అందించేది దైవమే. కాబట్టి దారిద్య్ర భయంతో ఎవరూ తమ సంతానాన్ని చంపుకోకూడదు. అలాగే దైవం చంపకూడదని నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకూడదు. చాలామంది తప్పుడు పనులు చేసి, ఎవరూ చూడలేదని అనుకుంటారు. కానీ దైవానికి అన్నీ తెలుసు. కాబట్టి నీతిబాహ్యమైన పనుల దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. అనాథ బాలలకు సంరక్షకులుగా ఉన్నవారు వారి ధనాన్ని దోచుకోవాలనీ, అనుభవించాలనీ ప్రయత్నించకూడదు. తూనికలూ, కొలతల్లో పూర్తిగా న్యాయాన్ని పాటించాలి. అలాగే న్యాయం విషయంలో తరతమ భేదాలు చూపించకూడదు. బంధువులకు సంబంధించిన వ్యవహారమైనా న్యాయంగానే మాట్లాడాలి. మాటలద్వారా కానీ, చేతలతో కానీ ఎవరినీ అవమానించకూడదు, నొప్పించకూడదు.


ఇవన్నీ పాటిస్తామని దైవానికి ప్రమాణం చేయాలి. దాన్ని గుర్తుంచుకోవాలి. మానవులు వీటి వెనుక అంతరార్థాన్ని తెలుసుకొని, ఆచరిస్తారనే ఈ విషయాలను దైవం బోధించాడు. తాను నిర్దేశించిన ఈ మార్గంలోనే నడవాలనీ, ఇతరులు చూపే చెడ్డ దారుల్లోకి వెళ్ళకూడదనీ హెచ్చరించాడు. నిజానికి వీటిని ఆదేశాలు, ఆంక్షలు అనడం కన్నా సన్మార్గంలో పయనించడానికి దైవం ఇచ్చిన అవకాశాలుగా పరిగణించాలి. మనస్ఫూర్తిగా వాటిని ఆచరించాలి.


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-02-12T08:17:31+05:30 IST