అంబరమంటిన సంబరం!

ABN , First Publish Date - 2022-06-24T06:05:53+05:30 IST

అంగరంగ వైభవంగా జరిగిన వెంగమాంబ పేరంటాలమ్మ బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

అంబరమంటిన  సంబరం!
వెంగమాంబ, గురవయ్య నాయుడుల గ్రామోత్సవం

ముగిసిన వెంగమాంబ బ్రహ్మోత్సవాలు

భారీగా తరలివచ్చిన భక్తులు


దుత్తలూరు, జూన్‌ 23 : అంగరంగ వైభవంగా జరిగిన వెంగమాంబ పేరంటాలమ్మ బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. చివరి రోజు వెంగమాంబ పేరంటాల దంపతులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉంచి అన్ని గ్రామాల్లో ఊరేగించారు. గురువారం తెల్లవారుజాము నుంచే నర్రవాడలో భక్తుల తాకిడి ఎక్కువైంది. మహిళలు అత్యధికంగా తరలివచ్చి పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు. సంతానం లేని మహిళలు ఎండు కొబ్బరిని హోమగుండంలో వేసి మొక్కులు తీర్చుకొన్నారు. బుధవారం రాత్రి నుంచి ప్రారంభమైన వెంగమాంబ ప్రధానోత్సవం గురువారం మధ్యాహ్నం వరకు నర్రవాడ జరిగింది. ఉత్సవాలు ముగింపు సందర్భంగా అమ్మవారికి అత్తగారిల్లు అయిన వేమూరి వంశీయుల నుంచి సారె తీసుకొచ్చి  అందచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అకట్టుకున్నాయి. 


వర్షంతో భక్తుల ఇక్కట్లు

బుధవారం రాత్రి భారీ వర్షం కురవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ప్రధానోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఆ సమయంలో వర్షం రావడంతో వారు తలదాచుకునేందుకు నానా అగచాట్లు పడ్డారు. ఆలయ పరిసరాల్లో స్థలాలు అద్దెకు తీసుకొని, వ్యాపారాలు పెట్టిన వారు వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయారు.   


ఉత్సాహంగా బండలాగుడు పోటీలు

 గురువారం సాయంత్రం ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఆరు జతల ఎడ్లు వచ్చాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాళెం గ్రామానికి చెందిన శిరీష, శివకృష్ణచౌదరి ఎడ్లు ప్రథమ, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గానుగపెంట రాజశేఖర్‌రెడ్డి ఎడ్లు ద్వితీయ, పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం శ్రీనివాసపురం కాలనీకి చెందిన డప్పుల అంజనిరెడ్డి ఎడ్లు తృతీయ బహుమతి పొందాయి. వారికి వరుసగా రూ.55 వేలు, రూ.45 వేలు, రూ.35 వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. మిగిలిన మూడు ఎడ్ల జతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. 


విజయవంతంగా నిర్వహణ

 జిల్లా దేవదాయ శాఖ ఏసీ శ్రీనివాసులరెడ్డి, ఆలయ ధర్మకర్తలు పచ్చవ కరుణాకర్‌బాబు, పచ్చవ వెంగయ్య, వేమూరి ముసలయ్య, ఈవో ఆర్‌.వెంకటేశ్వర్లు, కావలి ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసులు, ఉదయగిరి, కందుకూరు సీఐలు గిరిబాబు, మల్లికార్జున్‌రావు, ఎస్‌ఐ బాజిరెడ్డి విజయవంతంగా ఉత్సవాలను నిర్వహించారు. వెంగమాంబ సేవాసమితి, భక్తమండలి, ఆర్యవైశ్య సంఘం, పలువురు దాతలు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-06-24T06:05:53+05:30 IST