మూడు రోజులకే కంపు.. గబ్బు!

ABN , First Publish Date - 2022-07-14T04:39:16+05:30 IST

నెల్లూరు నగరంలో జరుగుతున్న సమ్మెలో 1600 మంది కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు.

మూడు రోజులకే  కంపు.. గబ్బు!
నెల్లూరులోని కాంప్లెక్స్‌ రోడ్డుపై చెత్తాచెదారం

మున్సిపాలిటీల్లో కార్మికుల సమ్మె ప్రభావం

రోడ్లపై పేరుకుపోతున్న చెత్తకుప్పలు

ఇళ్లలోనూ నిండుతున్న డస్ట్‌బిన్లు

కానరాని ప్రత్యామ్నాయ చర్యలు

చెదురుమదురు వర్షాలతో బిక్కుబిక్కు

అంటువ్యాధులు ప్రబలుతాయేమోనన్న భయం

వెంటనే చొరవ చూపాలంటున్న ప్రజలు


ఎటు చూసినా చెత్తకుప్పలు.. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం.. ఇళ్లలోనూ నిండిన డస్ట్‌బిన్లు.. రోడ్లపై మురుగు ప్రవాహం.. ఇదీ మున్సిపాలిటీల్లో పరిస్థితి. తమ డిమాండ్ల సాధన కోసం పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ మూడు రోజులకే నగరం, పట్టణాల్లో పారిశుధ్యం వ్యవస్థ స్తంభించింది. వీధుల్లో, రోడ్లపై పేరుకుపోయిన చెత్తతోపాటు అడపాదడపా కురుస్తున్న వానకు తడిచి దుర్వాసన వెదజల్లుతోంది. ఇదిచాలదన్నట్టు కాలువల్లోనూ పూడిక, చెత్త పేరుకుపోయి మురుగు నీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. అసలే వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు ప్రబలుతాయేమోనన్న భయం పట్టణ ప్రజానీకంలో పట్టుకుంది.


నెల్లూరు(సిటీ), జూలై 13 : నెల్లూరు నగరంలో జరుగుతున్న సమ్మెలో 1600 మంది కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. 54 డివిజన్ల నుంచి నిత్యం 300 టన్నుల చెత్త వెలువడుతుంది. కార్మికుల సమ్మెతో ఇంటింటా చెత్త సేకరణ నిలిచిపోయింది. దీంతో వ్యర్థాలన్నీ రోడ్లపై పేరుకుంటున్నాయి. అటు డ్రైనేజీ కాలువల్లోనూ మురుగు ముందుకు కదలక దుర్గంధం వ్యాపిస్తోంది. మరోవైపు వర్షాలు పడుతుండటంతో అంటురోగాలు ప్రబలుతాయేమోనన్న ఆందోళన నగరవాసులను కలవరపెడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కార్పొరేషన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 300 మంది ప్రైవేట్‌ కూలీలతోపాటు 260 మంది రెగ్యులర్‌ కార్మికులతో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. 

కందుకూరు : పారిశుధ్య కార్మికుల సమ్మెతో కందుకూరు పట్టణంలో రహదారులు చెత్త కుప్పలుగా మారుతున్నాయి. సమ్మె మూడవ రోజుకి చేరడంతో చెత్త కుండీలు నిండిపోయి ఎక్కడికక్కడ రోడ్లపైనే చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. మున్సిపాలిటీలో 120 మంది కాంట్రాక్టు, 10 మంది పర్మినెంట్‌  కార్మికులు ఉండగా కాంట్రాక్టు కార్మికులంతా సమ్మెలో ఉన్నారు. కేవలం పర్మినెంట్‌ కార్మికులు పది మందికి ఒకరిద్దరిని తాత్కాలికంగా జతచేసి చెత్త తొలగింపు చేపడుతున్నారు. దీంతో పట్టణంలోని అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయింది. మరోవైపు  ఇంటింటా చెత్త సేకరణ ఆగిపోవటంతో ఇళ్లలోని చెత్తను కూడా వీధుల్లో, మురుగు కాలువల్లో పడేస్తుండటంతో పరిస్థితి అధ్వానంగా మారింది. మురగుకాలువలు, ప్రధాన రహదారుల శుభ్రతా ఆగిపోవడంతో చెత్త, దుమ్ముధూళితో నిండిపోయి ఉన్నాయి. అయితే, గురువారం నుంచి పర్మినెంట్‌ కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో రానున్న రోజుల్లో పారిశుధ్య పరిస్థితులు మరింత అధ్వానంగా మారడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కావలి : పురపాలక సంఘంలో 232 మంది అవుట్‌ సోర్సింగ్‌, 35 మంది పర్మినెంట్‌ పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వీరంతా సమ్మెలో ఉండగా, బుధవారం మధ్యాహ్నం నుంచి పర్మినెంట్‌ కార్మికులను విధుల్లోకి వచ్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పారిశుధ్యం మెరుగు కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టకపోవటంతో పట్టణం మురికి కూపంగా మారుతోంది. ఇళ్లలో చెత్త ఇళ్లలో మగ్గుతుండగా డంపర్‌ బిన్లన్నీ చెత్తతో నిండి రోడ్లన్నీ అపరిశుభ్రంగా మారిపోయాయి. కాలువల్లో పూడిక తీసే వారు లేక చెత్తాచెదారం పడి మురుగునీరంతా రోడ్డెక్కి పారుతుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికుల సమ్మె విరమించే వరకు పారిశుధ్య నిర్వహణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.

ఆత్మకూరు : మున్సిపాలిటీ పరిధిలో రోజుకు సుమారు 15 టన్నుల మేర చెత్త సేకరించాల్సి ఉంది.  అయితే, పారిశుధ్య కార్మికులంతా సమ్మెలో ఉండటంతో ఎక్కడికక్కడ చెత్త సేకరణ ఆగిపోయి ఉంది. వర్షాలు  కురుస్తుండటంతో ఇళ్ల వద్ద, కాలువల్లో మురుగు, చెత్త నిలిచిపోయి దోమలు, ఈగల ఉధృతి పెరిగింది. అంటురోగాలు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 



Updated Date - 2022-07-14T04:39:16+05:30 IST