Abn logo
Jul 13 2020 @ 11:24AM

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం!

కాకినాడ : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు!. కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ఓ ప్రకటనను ఆయన విడుదల చేశారు. ఈ మధ్య పెద్దవారు చాలా మంది మన సోదరుల చేత నేను మానసికంగా కృంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఈ విధంగా దాడులు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఉద్యమం చేసిన కాలంలో నేను వసూలు చేసిన నిధులు కానీ, పారిశ్రామిక వర్గాలను బెదిరించి సంపాదించిన డబ్బులు కానీ, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి దగ్గర లొంగిపోయి మూటలతో కోట్లాది రూపాయిలు, నన్ను నిత్యం విమర్శించే మన సోదరులకు పంచలేదనా..? ఈ దాడికి కారణం అని ముద్రగడ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.


చంద్రబాబే కారణం!

నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి చంద్రబాబుగారే ముఖ్య కారణం. మన జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తానని హామీ కోసం అన్న సంగతి మీకు తెలియనిది కాదు. ఈ ఉద్యమం ద్వారా డబ్బు కానీ, పదవులు కానీ పొందాలని నేను ఏనాడూ అనుకోలేదు. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగాను, ఆరోగ్యం పరంగాను చాలా నష్టపోయాను. రాజకీయంగా ఎంతో నష్టపోయానో మీ అందరికీ తెలుసు. కానీ ఏ నష్టానికి నేనెప్పుడు చింతించలేదుఅని ప్రకటనలో ముద్రగడ చెప్పుకొచ్చారు.


ఫలితాన్ని ఆశించను..!

ఒకరు ఫోన్ చేసి మీ కష్టం ద్వారా వచ్చే ఫలితాన్ని ఇతరులు కొట్టేసేలాగున్నారు. కాబట్టి ఇతరులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సపోర్ట్ చేస్తూ మీరు నడిచేయండి అని సలహా ఇచ్చారు. ఎందుకు వారితో నడవాలి, ఆనాడు ఈ ఉద్యమం వెనకాల వారందరూ నడిచారా..? వారు నడవనప్పుడు నేను నడవలసిన అవసరం లేదు. ఎవరి ద్వారా అయినా రిజర్వేషన్ రానివ్వండి దానికి అందరూ సంతోషపడదాం అని చెప్పడం జరిగింది. ఆ నాడు అప్పటి ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ రిజర్వేషన్ ఇచ్చేయడం వల్ల నేను గొప్పవాడినికి అయిపోతానని మీరు అభిప్రాయపడవచ్చు. దయచేసి మీ ఆఫీసులో పనిచేసే వారి పేరు మీద లేఖ తీసుకుని, పనిచేసి ఆ పేరు ప్రతిష్టలు పొందండి.. ఫలితాన్ని ఆశించే మనిషిని కాను అని ఆనాడే చెప్పడం జరిగిందిఅని ముద్రగడ ఆ ప్రకటనలో నిశితంగా వివరించారు.


ముద్రగడ తప్పుకుంటే..!

ఇదే లేఖలో తుని ఘటన, ఆ సభకు వచ్చిన జనసమీకరణ గురించి కూడా చెప్పారు. అంతేకాదు వేలాది మంది సభకు రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. ఇది నిజంగా మరువలేని అనుభూతి అని ముద్రగడ చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనపై కాపు నేతలు, ఆయన అభిమానులు, అనుచరులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ముద్రగడ్డను కాపు నేతలు బుజ్జగించి ఉద్యమ నేతగా కొనసాగిస్తారా..? లేకుంటే ఆయన స్థానంలోకి మరెవరైనా వస్తారా..? అనేది ఇవాళ సాయంత్రంలోపు తేలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి.Advertisement
Advertisement
Advertisement