Mudragada Meet with Kothapalli: వైసీపీ దూరం పెట్టిన కొత్తపల్లితో ముద్రగడ భేటీ.. మతలబేంటో..!

ABN , First Publish Date - 2022-06-05T19:47:52+05:30 IST

మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురు గంటపాటు చర్చించినట్లు తెలుస్తోంది.

Mudragada Meet with Kothapalli: వైసీపీ దూరం పెట్టిన కొత్తపల్లితో ముద్రగడ భేటీ.. మతలబేంటో..!

నర్సాపురం: మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురు గంటపాటు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశం లేదని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. సుబ్బారాయుడిని వైసీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆయనను సస్పెండ్ చేసిన రోజుల వ్యవధిలోనే ముద్రగడ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. కొద్దిరోజులుగా మౌనంగా ఉన్న ముద్రగడ, సుబ్బరాయుడితో భేటీ కావడంతో కొత్త చర్చ మొదలైంది. అది కూడా సుబ్బారాయుడు వైసీపీ నుంచి బహిష్కరణకు గురికావడం.. ఆ వెంటనే ముద్రగడ వాలిపోవడం అంతా చకచక సాగిపోయింది. కాపులు ఓ ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఎన్నికల నాటికి ఓ గొడుగు కిందకి వచ్చే అవకాశం లేకపోలేదు. అందువల్లే సుబ్బారాయుడిని కూడా కాపులకు దగ్గర చేసేందుకే ముద్రగడ భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. 


సుబ్బారాయుడి రాజకీయ జీవితాన్ని అధికార పార్టీ ఓ క్రమపద్దతిలోనే దెబ్బతీస్తోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సుబ్బారాయుడు గన్‌మెన్‌లను తొలగించడం... ఆ తర్వాత పార్టీ నుంచే సస్పెండ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత సుబ్బరాయుడు మౌనంగా ఉండలేదు. పార్టీ తీరును తీవ్రంగా ఖండించారు. ‘‘పార్టీ నుంచి నన్ను సస్పెండ్‌ చేయడానికి కారణం ఏమిటి? నాపై ఫిర్యాదు చేసింది ఎవరు? షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా, రాత్రికి రాత్రే నన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు సంతకం లేని ఉత్తర్వులను మీడియాకు ఎలా విడుదల చేస్తారు? ఈ చర్యతో నా ఇమేజ్‌, గౌరవం దెబ్బతిన్నాయి’’ అని సుబ్బారాయుడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-06-05T19:47:52+05:30 IST