కల తీరేనా.. హామీ అమలయ్యేనా?

ABN , First Publish Date - 2022-03-10T04:59:49+05:30 IST

తీరప్రాంత వాసుల చిరకాల కోరిక.. సర్వేపల్లి- కోవూరు నియోజకవర్గ ప్రజల స్వప్నం.. మూడు దశాబ్దాల నుంచి నాయకుల హామీలతో ముదివర్తి-ముదివర్తిపాళెం మధ్య పెన్నానది వారధి నిర్మాణం జరుపుకున్నట్లేనని ప్రజలు సంబరపడ్డారు.

కల తీరేనా.. హామీ అమలయ్యేనా?
ముదివర్తి - ముదివర్తిపాళెం పెన్నానదిని పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్‌)

ముదివర్తి-ముదివర్తిపాళెం మధ్య పెన్నా వారధి నిర్మాణం 


ఇందుకూరుపేట, మార్చి 9: తీరప్రాంత వాసుల చిరకాల కోరిక.. సర్వేపల్లి- కోవూరు నియోజకవర్గ ప్రజల స్వప్నం.. మూడు దశాబ్దాల నుంచి నాయకుల హామీలతో ముదివర్తి-ముదివర్తిపాళెం మధ్య పెన్నానది వారధి నిర్మాణం జరుపుకున్నట్లేనని ప్రజలు సంబరపడ్డారు. నాడు ఎన్నికల ప్రచారసభలో జగన్మోహన్‌రెడ్డి ఈ విషయమై జిల్లాలో ప్రకటించడం కొంత బలాన్ని చేకూర్చింది. ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దీనిపై సీఎం దృష్టికి తీసుకెళ్లి రూ.95కోట్లు మంజూరు చేయించడంతో ప్రజలు సంబరపడ్డారు. కాగా నిర్మాణానికి అనువైన వాతావరణం, నేలను సాంకేతిక నిపుణులు పరిశీలించి, అన్నిశాఖల అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఎమ్మెల్యే ప్రసన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి పెన్నానది వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని కూడా ప్రకటించారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు నిండుకుంటుంది. కానీ పెన్నా వారధి నిర్మాణ కల వాస్తవ రూపం దాల్చలేదని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వారధి సర్వేపల్లి - కోవూరు నియోజకవర్గ ప్రజలకు అనువైనది మాత్రమే కాకుండా రైతులకు, ఆక్వా హేచరీలు, పరిశ్రమలకు, పెన్నాకు వదిలే మిగులు జలాలు కూడా కొంత భద్రపరచుకునేందుకు వీలుంటుంది. అలాగే తీర గ్రామాల్లో ఉప్పునీటి సమస్యను ఎదుర్కొనే అనేక రంగాలకు అండగా నిలిచే ఈ వంతెనకు ఎమ్మెల్యే కృషిచేసి ఆచరణలోకి తీసుకురావాలని కోరుతున్నారు. అప్పటి ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి నుంచి ఐదారుగురు ఎమ్మెల్యేలు హామీలిచ్చినా, ఇప్పుడు ఈ కల సాకారమవుతుందా? ప్రజల కోరిక నెరవేరేనా అని ఎదురు చూస్తున్నారు. 

Updated Date - 2022-03-10T04:59:49+05:30 IST