రూ.కోట్లు తుప్పుపట్టిపోతున్నాయ్‌!

ABN , First Publish Date - 2022-06-28T06:32:35+05:30 IST

నగరంలో చెత్త తరలింపు, నిర్వహణ ప్రక్రియను అత్యాధునిక పద్ధతిలో చేపట్టేందుకు ముడసర్లోవ వద్ద రూ.8.5 కోట్లతో తలపెట్టిన మోడరన్‌ మినీ సూయిజ్‌ఫామ్‌ ప్రాజెక్టు అర్ధాంతరంగా నిలిచిపోయింది.

రూ.కోట్లు తుప్పుపట్టిపోతున్నాయ్‌!
ముడసర్లోవ ఎంఎస్‌ఎఫ్‌ తుప్పల్లో ఉన్న క్లోజ్డ్‌ కాంపాక్ట్‌లు

ముడసర్లోవలో అర్ధాంతరంగా నిలిచిపోయిన మోడరన్‌ మినీ సూయిజ్‌ఫామ్‌ ప్రాజెక్టు

రూ.8.5 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన

హైదరాబాద్‌కు చెందిన సంస్థకు పనులు అప్పగింత

బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యలోనే వదిలేసిన కాంట్రాక్టర్‌

రూ.కోట్లు వెచ్చించి కొనుగోలుచే సిన యంత్రాలు వృథాగా పడివున్న వైనం

రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోని జీవీఎంసీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


నగరంలో చెత్త తరలింపు, నిర్వహణ ప్రక్రియను అత్యాధునిక పద్ధతిలో చేపట్టేందుకు ముడసర్లోవ వద్ద రూ.8.5 కోట్లతో తలపెట్టిన మోడరన్‌ మినీ సూయిజ్‌ఫామ్‌ ప్రాజెక్టు అర్ధాంతరంగా నిలిచిపోయింది. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ మధ్యలోనే పనులు ఆపేశారు. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు తుప్పుపట్టిపోతున్నాయి.                     

చెత్తను పారిశుధ్య సిబ్బంది వాహనాల ద్వారా సేకరించి ముడసర్లోవ, టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక, పెందుర్తిల్లో గల నాలుగు మినీ సూయిజ్‌ ఫామ్‌(ఎంఎస్‌ఎఫ్‌)లకు తరలిస్తారు. అక్కడ నుంచి లారీల ద్వారా కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. కానీ ఎంఎస్‌ఎఫ్‌లకు చేరిన చెత్త ఎప్పటికప్పుడు కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించడం లేదు. దీంతో ఎంఎస్‌ఎఫ్‌లలో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. దీనివల్ల తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాలవారు ఎంఎస్‌ఎఫ్‌లను అక్కడ నుంచి తరలించాలంటూ తరచూ ఆందోళనలకు దిగుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు వీలుగా జీవీఎంసీ అధికారులు మోడరన్‌ ఎంఎస్‌ఎఫ్‌ల ఏర్పాటుకు రూపకల్పన చేశారు. దాని ప్రకారం ఎంఎస్‌ఎఫ్‌ల చుట్టూ ఎత్తైన రేకుల షెడ్డును నిర్మించి, వాహనాల ద్వారా అక్కడకు వచ్చే చెత్తను నేలపై కాకుండా నేరుగా ఒక యంత్రంలో వేసేలా ర్యాంప్‌లను నిర్మిస్తారు. యంత్రంలో పడిన చెత్తను బాగా కంప్రెస్‌ చేసి ఒక క్యూబ్‌ మాదిరిగా చేస్తారు. ఆ క్యూబ్‌లను ట్యాంకర్‌ మాదిరిగా వుండే క్లోజ్డ్‌ కాంపెక్టర్‌లలో వేసి నేరుగా కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకు తరలిస్తారు. దీనివల్ల ఎంఎస్‌ఎఫ్‌లలో చెత్త నిల్వ సమస్య పరిష్కారం కావడంతో పాటు, కంప్రస్‌ చేసి క్యూబ్‌గా మార్చడం వల్ల నాలుగు ట్రిప్పుల్లో వెళ్లాల్సిన చెత్తను ఒక ట్రిప్పులోనే తరలించవచ్చునని భావించారు. ఒకేసారి నాలుగు ఎంఎస్‌ఎఫ్‌ల్లో కాకుండా టౌన్‌కొత్తరోడ్డులోని ఎంఎస్‌ఎఫ్‌లో ఏర్పాటుచేసిన అనంతరం 2019లో ముడసర్లోవలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుకు రూ.8.5 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసిన అధికారులు హెచ్‌పీసీఎల్‌ నుంచి సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద రూ.4.3 కోట్లు సమకూర్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో రూ.1.7 కోట్లు హెచ్‌పీసీఎల్‌ విడుదల చేసింది. 


బిల్లులు చెల్లించకపోవడంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

హెచ్‌పీసీఎల్‌ నుంచి సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద రావాల్సిన రూ.4.3 కోట్లలో తొలివిడతగా రూ.1.7 కోట్లు జీవీఎంసీకి అందడంతో ప్రాజెక్టుకు టెండర్‌ పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ల్యాండ్‌స్కై అనే సంస్థ ప్రాజెక్టు చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్‌పీసీఎల్‌ నుంచి విడుదలైన రూ.1.7 కోట్లను కాంట్రాక్టర్‌కు జీవీఎంసీ చెల్లించింది. దీంతో కాంట్రాక్టర్‌ సుమారు రూ.5 కోట్లు విలువైన యంత్రాలు, వాహనాలను కొనుగోలు చేసి 2019లోనే ముడసర్లోవ ఎంఎస్‌ఎఫ్‌కు చేర్చారు. ఆ తర్వాత జీవీఎంసీ బిల్లు చెల్లించకపోవడం, కరోనా మొదలవ్వడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. తర్వాత కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ జీవీఎంసీ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు. దీంతో ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసిన యంత్రాలు వృథాగా పడివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు దీనిపై దృష్టిసారించి ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలని, తద్వారా చెత్త సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-06-28T06:32:35+05:30 IST